mt_logo

తెలంగాణకు కేంద్ర ప్రోత్సాహం శూన్యం : ‘పీఎం గతిశక్తి సౌత్ జోన్’లో మంత్రి కేటీఆర్ మండిపాటు

దేశంలో అన్ని రంగాల్లో మెరుగ్గా పనిచేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించడంలేదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వల్పకాలంలోనే కొత్త రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తుచేశారు. తెలంగాణకు మానవ వనరులతోపాటు భౌగోళిక వాతావరణ పరంగానూ అనేక అనుకూలతలు ఉన్నాయని, అందువల్లనే పెట్టుబడిదారులు రాష్ట్రంవైపు చూస్తున్నారని గుర్తుచేశారు. సోమవారం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నేతృత్వంలో జరిగిన ‘పీఎం గతిశక్తి సౌత్‌ జోన్‌’ వర్చువల్‌ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను వెల్లడించారు. ఇప్పటికే ఫార్మా, వస్త్ర, ఇంధన, బొగ్గు రంగాల్లో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35% ఉండటం నిదర్శనమని ఉదహరించారు. ఇన్ని సానుకూలతలున్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించడంలేదన్నారు. ఇండస్ట్రియల్‌ కారిడార్ల ఏర్పాటు, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్కు, రైల్వే నెట్‌వర్క్‌ విస్తరణకు ప్రోత్సాహకాలు అందించాలని తెలంగాణ వచ్చిన నాటి నుంచి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నామని అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన, సాయం అందడం లేదని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకనైనా ప్రోత్సాహకాలు అందించి రాష్ట్ర ప్రగతికి అండగా నిలవాలని కోరారు.

రాజకీయ లబ్ధి కోసమే బుందేల్‌ఖండ్‌కు డిఫెన్స్‌ కారిడార్‌ :

బుందేల్‌ఖండ్‌కు డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను కేంద్రం మంజూరు చేయడాన్ని మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఆక్షేపించారు. భౌగోళిక అంశాల రీత్యా హైదరాబాద్‌ ఎంతో రక్షణాత్మకమైన ప్రాంతమని, దశాబ్దాల క్రితమే నగరంలో డీఆర్డీవో, డీఆర్‌డీఎల్‌, డీఎంఆర్‌ఎల్‌, ఆర్‌ఎస్‌ఐ, అనురాగ్‌ వంటి రక్షణరంగ సంస్థలను ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. డిఫెన్స్‌ సంస్థల హబ్‌గా హైదరాబాద్‌ ఇప్పటికే ప్రఖ్యాతి గాంచిందన్నారు. డిఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు, కావాల్సిన వాతావరణం ఒక్క హైదరాబాద్‌ నగరానికే ఉండగా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఎలాంటి వనరులు, రక్షణ రంగ సంస్థలు లేని బుందేల్‌ఖండ్‌లో డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను మంజూరు చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. కేంద్రం తీసుకొన్న నిర్ణయం దేశానికి ఎంతో నష్టదాయకమని చెప్పారు. ఎలాంటి వనరులు, రక్షణ పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన సానుకూల వాతావరణం లేని కొత్త ప్రదేశాల్లో తమ సంస్థలను ఏర్పాటుచేసేందుకు అంతర్జాతీయ డిఫెన్స్‌ కంపెనీలు ముందుకురాబోవని, అది అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు.

మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించండి :

తెలంగాణ భూపరివేష్టిత రాష్ట్రమని, సరుకుల స్వేచ్ఛా రవాణాలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని కొన్ని కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయని కేంద్ర మంత్రి గడ్కరీకి మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా వివరించారు. తక్కువ లోడ్‌ను సాకుగా చూపుతూ రైళ్లను తరచుగా రద్దు చేస్తున్నారని, దీంతో ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సరుకుల రవాణ కోసం ట్రక్కులను ఆశ్రయించాల్సి వస్తుండటంతో రవాణా ఖర్చులు మోయలేని భారంగా మారుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వివిధ పోర్టులకు ప్రత్యేకమైన కార్గో రైల్‌ నెట్‌వర్క్‌ను విస్తరించాల్సిన ఆవసరమున్నదని చెప్పారు. లాజిస్టిక్‌ మౌలిక వసతుల కల్పనకు కేంద్రం అదనపు ఆర్థిక ప్రోత్సాహకాలను మంజూరుచేస్తే రాష్ట్ర ప్రభుత్వం డ్రై పోర్ట్‌లు, ఇంటిగ్రేటెడ్‌, మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. మెరుగైన రోడ్డు, రైలు, వాయుమార్గ కనెక్టివిటినీ ఏర్పాటుచేయాలని సూచించారు. హైదరాబాద్‌ నుంచి అన్ని ఓడరేవులకు రైలు సౌకర్యం ఉన్నప్పటికీ ఓడరేవులకు రైళ్ల రాకపోకలు ప్రధాన సమస్యగా ఉన్నదని, గూడ్స్‌ రైళ్లు వేగంగా వెళ్లేందుకు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని కేంద్రానికి మంత్రి విజ్ఞప్తిచేశారు. నార్త్‌-సౌత్‌ ఫ్లైట్‌ కారిడార్‌ హైదరాబాద్‌ను తాకకుండానే తెలంగాణ మీదుగా వెళ్తున్నదని, అదే హైదరాబాద్‌ గుండా వెళితే అందరికీ ప్రయోజనకరమని వివరించారు.

మేకిన్‌ ఇండియా కాదు.. అసెంబుల్‌ ఇన్‌ఇండియా :

ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమం ‘అసెంబుల్‌ ఇన్‌ ఇండియా’గా మారిందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. దేశంలో ఒక్క చిప్‌ను కూడా తయారు చేయకపోవడం అందుకు తార్కాణమన్నారు. ఇకనైనా కేంద్రం ఎలక్ట్రానిక్స్‌తోపాటు, ఐటీ రంగానికి పెద్దపీట వేయాలని సూచించారు. ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సిద్ధం ఉన్నదని, అందుకు కావాల్సిన అన్ని వసతులను ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో సమకూర్చుతుందని చెప్పారు. తెలంగాణ వంటి రాష్ట్రాలను ప్రోత్సహిస్తే, అది మొత్తం భారత వృద్ధి రేటుకు ప్రయోజనం చేకూర్చుతుందని, దేశం తన ఎగుమతి లక్ష్యాన్ని చేరుకోవడం గణనీయంగా దోహదపడుతుందని మంత్రి కేటీఆర్‌ ఉద్ఘాటించారు.

రోడ్ల వల్లే అమెరికా అభివృద్ధి :

మౌలిక వసతుల కల్పన, రవాణా విస్తరణ ఆవశ్యకతను మంత్రి కేటీఆర్‌ ఈ సమావేశంలో బలంగా వినిపించారు. ‘అందరూ అమెరికా ధనిక దేశం కాబట్టి రోడ్లు అభివృద్ధి చెందాయని అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే రోడ్లు అభివృద్ధి చెందడం వల్లే అమెరికా ధనిక దేశంగా ఎదిగింది’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఉటంకించారు. కేంద్రం ఇకనైనా మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *