mt_logo

ఫ్రెంచ్ సెనేట్ లో ప్రసంగించమని కేటీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ సెనేట్ లో ప్రసంగం చేయమని తెలంగాణ రాష్ట్ర యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ఫ్రాన్స్‌ ఎగువ సభలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా ఆ దేశ ప్రభుత్వం కేటీఆర్ కు ఈ ప్రత్యేక ఆహ్వానాన్ని పంపింది. ఇప్పటికే పలు దేశాలు, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించిన కేటీఆర్‌.. 348 మంది సభ్యులున్న ఫ్రెంచ్‌ సెనేట్‌లో కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ నెల 29న ఫ్రెంచ్‌ సెనేట్‌ లో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్‌ మాక్రాన్‌ సారథ్యంలో ‘అంబిషన్‌ ఇండియా-2021’ పేరుతో వాణి జ్య సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాలని ఫ్రాన్స్‌ ప్రభుత్వం కేటీఆర్‌ను కోరింది. ఈ సదస్సు భారత్‌- ఫ్రాన్స్‌ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని ఫ్రాన్స్‌ ప్రభుత్వం పంపిన లేఖలో పేర్కొన్నది. సదస్సులో ‘గ్రోత్‌-డ్రాఫ్టింగ్‌ ఫ్యూచ ర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా’ (కొవిడ్‌ తర్వాత భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలక ఉపన్యాసం చేయాలని కోరింది. ఇలాంటి కీలక వేదికపై తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు అవకాశం కలుగుతుందని వెల్లడించింది. సదస్సులో వైద్యారోగ్యం, పర్యావరణ మార్పులు, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌, ఆగ్రో బిజినెస్‌ వంటి ప్రధానమైన అంశాలపై ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్టు వివరించింది. దీంతోపాటు ఫ్రాన్స్‌-భారత కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని తెలిపింది. గతంలో నిర్వహించిన ఆంబిషన్‌ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, ఇరు దేశాల కంపెనీల నుంచి 400కు పైగా ప్రతినిధులు పాల్గొన్నారని పేర్కొన్నది. ఈసారి అంతకుమించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్టు తెలిపింది.

ప్రభుత్వ విధానాలకు దక్కిన గుర్తింపు : కేటీఆర్

ఫ్రాన్స్‌ ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దకిన గుర్తింపుగా అభివర్ణించారు. సదస్సు వేదికగా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఇరు దేశాల వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, కంపెనీల ప్రతినిధులకు వివరిస్తానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *