mt_logo

ఒక ఊరేగింపుకి ఇంత నిర్బంధమా?

పశ్చిమ దేశాల ప్రజాస్వామిక ముసుగులు ఒక్కొక్కటీ తొలగిపోతున్న నేపధ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా తానూ తగ్గేది లేదని చాటుకుంటోంది. ఒకే ఒక ఊరేగింపుకు, అది కూడా రాజ్యాంగం గ్యారంటీ చేసిన భావ ప్రకటనా స్వేచ్ఛకు అనుగుణంగా మాత్రమే తలపెట్టిన ఊరేగింపుకు, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని రీతిలో పది జిల్లాలను పోలీసు కాపలా మధ్య దిగ్బంధించిన తీరు అత్యంత హేయం.

బస్సులు, రైళ్లు, మెట్రో రైళ్లు అన్నీ రద్దు చేసి, స్కూళ్ళు, కాలేజీలకు సెలవు ప్రకటించి, యూనివర్శిటీలను యుద్ధ రంగాలుగా మార్చివేసి, రాజధానిలో పది గజాలకు ఒక పోలీసు గుంపును నిలబెట్టి, రోడ్లపై కార్లు, స్కూటర్లు, బైక్ లు కూడా తిరగనివ్వకుండా అడ్డుకుని, ప్రయాణీకుల వ్యక్తిగత బ్యాగ్ లు, సూట్ కేసులు కూడా బలవంతంగా తెరిపించి తనిఖీలు చేసి… ఎందుకిదంతా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను పునరుద్ఘాటించడానికి పార్లమెంటరీ రాజకీయ పార్టీలు తమ రాజకీయ హక్కుకు అనుగుణంగా నిర్వహించ తలపెట్టిన ‘ఛలో అసెంబ్లీ’ పిలుపును అడ్డుకోడానికి!? అంటే రాజధాని వీధుల్లో ఒక ఊరేగింపు జరగకుండా అడ్డుకోవడానికి? ఇదా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా?

ఇన్ని కట్టుదిట్టాల మధ్య ఊరేగింపు జరగనివ్వకుండా అడ్డుకుంటే ఆ ఊరేగింపు జరిగినట్లే కాదా?

70-80ల్లో ఐదో తరగతి తెలుగు వాచకంలో ‘ఈశ్వరుడు-శనైశ్వరుడు’ అని ఒక పద్య పాఠం ఉండేది. శనిగారు ఒక సారి ఈశ్వరుడి దగ్గరికి ఏతెంచి ‘నేను నీకు పడతాను, కాచుకో గలవా’ అని సవాలు విసిరాడట. ‘లేదు, నేను సర్వ శక్తిమంతుడను, నువ్వు నాకు పట్టడం అసంభవం.’ అని ఈశ్వరుల వారు ప్రతి సవాలు విసిరారట. ‘అయితే ఫలానా ఘడియ నుండి ఫలానా ఘడియ వరకు నేను నిన్ను పట్టి పల్లారుస్తాను’ అన్నాట్ట శనీశ్వరుల వారు.

ఇంకేం, క్లూ ఇచ్చేశాడు గదాని ఈశ్వరుల వారు, శనీశ్వరుడు చెప్పిన సమయానికి కైలాసం వదిలి ఎవరూ సంచరించలేని తావుకి వెళ్ళి ఒక మడుగులో అట్టడుగున దాక్కున్నారట. శనీశ్వరుడు నిర్దేశించిన గడువు ముగిశాక ఈశ్వరుడు కులాసాగా బైటికి వచ్చి కైలాసానికి తిరిగి వచ్చారట.

అనంతరం శని గారు వచ్చి ‘చూశావా నా తడాఖా’ అన్నాట్ట. ‘నువ్వసలు నన్ను చేరనేలేదు. ఇక నీ తడాఖా ఎక్కడిది?’ అని ప్రశ్నించిన శంకరునికి “ఓరి పిచ్చి శంకరయ్యా, ప్రమధ గణాలను వీడి, భార్యలను వీడి, కైలాసమే వీడి, ఎవరూ సంచరించలేని తావుకి వెళ్ళి, నీటి మడుగులో అట్టడుగున దాక్కోవలసిన పరిస్ధితిని నీకు కల్పించాను. ఇంతకంటే శని ఎవరికి పడుతుంది?” అని ప్రశ్నించిన శనైశ్వరుడి మాటలు విని నెత్తి గోక్కోవడం (గంగమ్మకు గాయం కాకుండానే లెండి) ఈశ్వరుల వంతయిందట!

అలా వుంది, మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి శూరత్వం!

ది హిందూ ప్రకారం ‘ఛలో అసెంబ్లీ’ ఊరేగింపు జరగకుండా నిరోధించడానికి వివిధ పారా మిలట్రీ బలగాలతో పాటు మిలట్రీతో సమానమైన బి.ఎస్.ఎఫ్ బలగాలను కూడా దించింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు 25,000 మందిని ఒక్క రాజధానిలోనే మోహరించారు. అసెంబ్లీకి దారి తీసే ప్రతి మార్గంలోని ప్రతి పది గజాలకూ ఒక పోలీసు పికెట్ ను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ చుట్టూ మూడు అంచెల్లో పోలీసు బలగాలను మోహరించి అప్పటికీ నమ్మకం లేక ఉక్కు బారికేడ్లు కూడా నిర్మించారు.

ఒక్క సైబరాబాద్ లోనే 4గురు డి.ఐ.జిలు, 7 గురు ఎస్.పిలు, 40 మంది డి.ఎస్.పి లు, 100 మంది ఇనస్పెక్టర్లు, 400 మంది సబ్-ఇనస్పెక్టర్లను నియమించారు. సైబరాబాద్ లో వివిధ చోట్ల మొత్తం 58 చెక్ పోస్టులు నిర్మించి వాహనాలను తనిఖీ చేస్తూ, చీమ గూడా తమను మీరీ దాటిపోకుండా కాపలా కాశారు.

ఇన్ని చేసి కూడా విద్యా సంస్ధలన్నింటికీ సెలవు ప్రకటించేశారు. ప్రతి ఒక్క ఫ్లై ఓవర్ రహదారిని మూసేశారు. ఎం.ఎం.టి.ఎస్ సర్వీసులను రద్దు చేసేశారు. ఒక సికింద్రాబాద్-లింగంపల్లి రూట్ లో మాత్రమే అనుమతించారు.

ఇన్ని చర్యలు తీసుకున్నా మూడు గుంపుల్లో విద్యార్ధులు, యువకులు అసెంబ్లీని చేరుకోవడం, కట్టుదిట్టమైన పోలీసు కాపలా, డేగల్లా పరిశీలించే సి.సి కెమెరాల మధ్య టి.ఆర్.ఎస్ ఎమ్మేల్యేలు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను అసెంబ్లీ ప్రాంగణంలోకి తీసుకెళ్లి మరీ దగ్ధం చేయడం ఏమి సూచిస్తోంది?

ఛలో అసెంబ్లీ పిలుపు దిగ్విజయంగా విజయవంతం అయిందని సూచిస్తోంది. మీదు మిక్కిలి ఆ పిలుపును అమలు చేసింది పోలీసులు, పారా మిలట్రీ బలగాలు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలే కావడం గమనార్హం. వీరంతా నిన్నటివరకూ అసెంబ్లీ వద్ద లేరు. ఛలో అసెంబ్లీ పిలుపు కోసమే అసెంబ్లీ వద్దకు వచ్చారు. హైద్రాబాద్, సికిందరాబాద్, సైబరాబాద్ రహదార్లన్నింటిని నింపేశారు. సాధారణ జనానికి బదులు పోలీసు బలగాలే ‘ఛలో అసెంబ్లీ’ పిలుపును అమలు చేసేశారు.

తెలంగాణ రాష్ట్ర డిమాండు అనేది ఏమీ దేశాన్ని చీల్చేది కాదు. పాకిస్ధాన్ కి మద్దతుగా కాదు. కమ్యూనిస్టు పార్టీల్లో సి.పి.ఎం ఆ డిమాండ్ కి మద్దతే ఇవ్వడం లేదు. భద్రత కారణం చెప్పడానికి పోలీసులు ఎప్పుడూ చూపే సాకు ఐన మావోయిస్టులు ఈ ఉద్యమంలో లేరు. మద్దతు ఇస్తే ఇవ్వొచ్చు గానీ వారిని రాష్ట్రం నుండి తుడిచిపెట్టేశామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే సగర్వంగా దేశం అంతా చాటుకుంటోంది. మరెందుకింత నిర్బంధం? ప్రభుత్వానికి ఎందుకిన్ని ఆపసోపాలు?

‘హమ్మయ్య పోలీసులు అడ్డుకున్నారు’ అని సమైక్యవాదులు ఎవరైనా సంతసిస్తున్నట్లయితే వారు తమకు తాము ఒక ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు తెలంగాణ అడ్డుకోడానికి పోలీసు నిర్బంధం సరైందే అయితే, రేపు విద్యుత్ ఛార్జీల పింపుదలకు వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనలపై మోపబడే పోలీసు నిర్భంధం సైతం సరైందే అవుతుంది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం పైన కేంద్ర ప్రభుత్వం మోపిన అణచివేత కూడా సరైందే అవుతుంది. నిర్భయ అత్యాచారానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజానీకం పై ఢిల్లీ పోలీసులు ప్రయోగించిన అమానుష నిర్బంధం కూడా సరైందే అవుతుంది.

అప్పుడీ దేశం కనీసం సోకాల్డ్ ప్రజాస్వామ్య దేశం కూడా కాజాలదు. అచ్చంగా పోలీసు రాజ్యం లేదా, నియంతృత్వ రాజ్యం అవుతుంది. ఫర్వాలేదా?

Source: teluguvartalu.com/2013/06/14/ఒక-ఊరేగింపుకి-ఇంత-నిర్బం/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *