mt_logo

ప్యాకేజీలు ఎవరడిగారు?

[జనంసాక్షి సంపాదకీయం]

తెలంగాణ ప్రాంతానికి ప్యాకేజీలు కావాలని ఎవరడిగారు? ఈమేరకు కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణకు చెందిన ఒక్కరైనా సంప్రదింపులు జరిపినట్టు ఆధారాలున్నాయా? ఎవరు ఎప్పుడు ఎవరిని కలిసి తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వమని కోరినట్టు సీమాంధ్ర మీడియా దగ్గర ఆధారాలున్నాయి? అనేక ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలోని ప్రజలందరూ అడుగుతున్నారు. చేతిలో మీడియా ఉందికదా అని సీమాంధ్ర పెత్తందారులు తెలంగాణ ఉద్యమంపై తోచినట్లుగా బురద జల్లడం, నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం, ఇష్టం వచ్చినట్లు రాతలు రాయడం పరిపాటిగా మారింది.

సీమాంధ్ర సర్కారు ఎంతగా అణచివేయాలని చూసినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని ఆక్షలు విధించినా టీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో అసెంబ్లీ సక్సెస్‌ అయింది. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రతి రోడ్డుపై వందలాది పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి అనుమానం వచ్చిన ప్రతివారిని అరెస్టు చేసినా, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న వారి ఇళ్లకు అర్ధరాత్రి వెళ్లి అరెస్టులు, బైండోవర్లు చేసినా హైదరాబాద్‌ నగరానికి తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 20 వేల మందితో అసెంబ్లీకి ఐదంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినా ఛేదించుకొని అసెంబ్లీ ముందుకు చొచ్చుకొచ్చారు. అసెంబ్లీ ఒకటో గేటు ఎదుట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

చలో అసెంబ్లీకి జడిసి ముఖ్యమంత్రి ఆరు గంటలకే అసెంబ్లీకి చేరుకున్నారంటే తెలంగాణవాదానికి ఉన్న శక్తి ఏమిటో స్పష్టమవుతోంది. చలో అసెంబ్లీ విఫలమైనట్టు సీమాంధ్ర మీడియా ఎంతగా విషప్రచారం చేసినా సక్సెస్‌ ఆనవాళ్లు కళ్లెదుటే కనిపిస్తుండటంతో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తెలంగాణ పై దృష్టి సారించక తప్పని పరిస్థితి తలెత్తింది. శుక్రవారం రాత్రి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో జరిగిన కోర్‌ కమిటీ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌ను పిలిపించుకొని చలో అసెంబ్లీకి సంబంధించిన వివరాలు సేకరించారు. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, సీఎం కిరణ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అడుగుకో పోలీసును పెట్టినా ఛేదించుకొని దూసుకొచ్చిన తెలంగాణవాదం ముందు ఎన్ని బలప్రయోగాలు నిలవకపోవడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆత్మరక్షణలో పడి తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని ప్రాథమికంగా అంగీకరించింది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర పెత్తందారుల చేతిలోని మీడియా మరోసారి రెచ్చిపోయింది. తన విష ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలంగాణ సమస్యకు ప్యాకేజీ ఇవ్వడం ద్వారా ముగింపు పలకవచ్చని జడ్జిమెంట్‌ ఇచ్చేస్తోంది.

తెలంగాణ సాధన కోసం జరుగుతున్న ఉద్యమం ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు. అర్ధరాత్రి ఎవరికో కల పడితే జై తెలంగాణ అంటూ రోడ్డు మీదికి వచ్చి పోరు మొదలు పెట్టలేదు. ఒకమాట చెప్పాలంటే రాత్రికి రాత్రే పురుడు పోసుకున్న ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమం. అబద్ధపు పునాదులపై, కులం గోడలపై నిర్మితమైంది సమైక్యాంధ్ర ఉద్యమం. పిడికెడు మంది ప్రయోజనం కోసం ప్రారంభమైంది సమైక్యాంధ్ర ఉద్యమం.

తెలంగాణ ఉద్యమం అలాంటిది కాదు. కేవలం రాష్ట్ర సాధనే లక్ష్యంగా నాలుగు దశాబ్దాలుగా తెలంగాణలోని పది జిల్లాల ప్రజలు ముక్తకంఠంతో ఉద్యమిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన అనే సింగిల్‌ ఎజెండా తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. గతంలో ప్రత్యామ్నాయం అనే మాట వినాల్సి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజల ప్రతిస్పందన చవిచూసిన కేంద్రం మళ్లీ మాటెత్తే ధైర్యం చేయడం కూడా కష్టమే. కానీ సీమాంధ్ర మీడియా మాత్రం ఢిల్లీలో ఏం జరుగుతుందో తమకు మాత్రమే తెలుసన్నట్టుగా కథలు అల్లుతూ చిలువలు పలువలు చేసి ప్రసారం చేస్తోంది. తెలంగాణ సాధన మాత్రమే పది జిల్లాల ప్రజల ఏకైక లక్ష్యం. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర లేదు. నిజంగా కేంద్రం ప్యాకేజీ ఇస్తామన్న తీసుకునే అవసరం తెలంగాణ ప్రజలకు లేదు. ఇప్పుడు ప్యాకేజీ కోరుతున్న ఒడిషా, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు మాత్రమే. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులే తమకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని కేంద్రాన్ని కోరారు. అందుకోసం లాబీయింగ్‌ కూడా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలెక్కడా తమకు ప్రత్యేక రాష్ట్రం మినహా ఇది కావాలని కోరలేదు. కోరబోరు కూడా.

మొదటి నుంచి దేబిరించడం సీమాంధ్ర పెత్తందారులకు అలవాటు. వాళ్లు కార్పొరేట్‌ శక్తులుగా ఎదిగింది కూడా అలాగే. కావాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక రాజదాని, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని వాళ్లు కోరవచ్చు. అందుకు తమ చేతిలో ఉన్న మీడియాను ఉపయోగించుకోవచ్చు.

తెలంగాణ ప్రజలు కోరనిది ఇస్తామంటే అవసరం లేదని తెగేసి కరాఖండిగా చెప్తారు. ఆ తెగువ, ధైర్యం ఉన్నది ఈ ప్రాంతానికి మాత్రమే. అసత్యాలు, అర్ధసత్యాలను ప్రచారం చేయడం, తద్వారా రేటింగులు పెంచుకోవడం సీమాంధ్ర మీడియాకు పరిపాటే.

తెలంగాణ ప్రజల ఆకాంక్షను కూడా తమ రేటింగులు పెంచుకోవడానికి అడ్డంగా ఉపయోగించుకుంటోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ అధిష్టానంలోని కొందరు వ్యక్తులు, సీమాంధ్ర పెత్తందారులు, సీమాంధ్ర మీడియా చేసిన అబద్ధపు ప్రచారానికి వెయ్యి మందికి పైగా తెలంగాణ యువత, విద్యార్థులు బలిదానం చేసుకున్న విషయం యావత్‌ ప్రపంచానికీ తెలుసు. ఈ విషయమై ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అభూత కల్పనలు చేయవద్దని తెలంగాణ పౌర సమాజం కోరినా సీమాంధ్ర మీడియా తన ధోరణిని మార్చుకోవడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అష్టావక్రునికి మళ్లే ఎన్ని వంకర్లు తిరుగుతుందో సీమాంధ్ర మీడియా బుద్ధి అన్నే వంకర్లు తిరుగుతుంది.

కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం, సీమాంధ్ర పెత్తందారులు, వారి చేతిలోని మీడియా గుర్తించాల్సి ఒక్కటే నాలుగు దశాబ్దాల పోరాటం ఒకే ఫలం కోసం జరుగుతుంది అది తెలంగాణ సాధన మాత్రమే. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంతగా బుజ్జగించాలని చూసినా అది నేతల మట్టుకు పరిమితమవుతుందే తప్ప ప్రజల వరకూ చేరదు. అసలు దానిని ప్రభావమే ప్రజలపై ఉండదు. అంతిమ లక్ష్యం తెలంగాణ సాధించుకునేందుకు చలో అసెంబ్లీ నింపిన స్ఫూర్తితో ముందడుగు వేసేందుకు పది జిల్లాల్లోని ప్రతి గడప సన్నద్ధమవుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *