mt_logo

దేశంలో విద్యుత్ ఉత్పత్తి శాతంలో సింగరేణి ఎస్టీపీపీ అగ్రస్థానం  

విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణి రికార్డు సృష్టించింది. దేశంలోని 250కిపైగా ప్రభుత్వ, ప్రైవేటు థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలన్నింటిలోనూ ఉత్పత్తిశాతంలో అగ్రస్థానం దక్కించుకొని చరిత్ర నెలకొల్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ వరకు అత్యధిక పీఎల్‌ఎఫ్‌(ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) సాధించిన థర్మల్‌ విద్యుత్తు కేంద్రంగా సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ) నిలిచింది. సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా నివేదిక ప్రకారం ఎస్టీపీపీ అగ్రస్థానంలో ఉన్నది.

మంచిర్యాల జిల్లా బీమారం సమీపంలో 2016 ఆగస్టులో ఎస్టీపీపీ ప్రారంభమైంది. అప్పటి నుంచి మెరుగైన పీఎల్‌ఎఫ్‌తో దేశంలోని 25 అత్యుత్తమ ప్లాంట్ల జాబితాలో ఉంటున్నది. 2021-22లో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో జాతీయస్థాయిలో 88.97 పీఎల్‌ఎఫ్‌తో తొలిస్థానంలో, 2020-21లో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలన్నింటిలోనూ అగ్రస్థానంలో ఎస్టీపీపీ నిలిచింది. రెండో స్థానంలో ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్టీపీసీ కోర్బా సూపర్‌ పవర్‌ థర్మల్‌ స్టేషన్‌ 90.01 పీఎల్‌ఎఫ్‌తో, ఎన్టీపీసీకే చెందిన సింగ్రౌలి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ 89.94 పీఎల్‌ఎఫ్‌తో మూడో స్థానంలో నిలిచాయి.

సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం ఇప్పటివరకు 51,547 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును రాష్ట్ర అవసరాలకోసం అందించింది. సింగరేణి ప్లాంట్‌ పురోగతిని ప్రశంసిస్తూ మరో 800 మెగావాట్లు (మూడో యూనిట్‌)ను నిర్మించేందుకు సీఎం కేసీఆర్‌ పచ్చజెండా ఊపారు. దీంతో సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ టెండర్‌ ప్రక్రియను వేగవంతం చేశారు. త్వరలో నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. ఇప్పటికే 219 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను కూడా సింగరేణి ప్రారంభించింది. మూడో విడత 81 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా త్వరలో ఎస్టీపీపీ ఆవరణలోని నీటి రిజర్వాయర్‌లో 15 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నది.

పీఎల్‌ఎఫ్‌ అంటే..

ఒక విద్యుత్తు కేంద్రం స్థాపిత సామర్థ్యంలో ఎంత శాతం విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నదో చెప్పేదే పీఎల్‌ఎఫ్‌. వంద మెగావాట్ల ప్లాంటులో 75 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అయితే, దాని పీఎల్‌ఎఫ్‌ను 75% అని చెప్తారు. ఇప్పటివరకు ఎస్టీపీపీ నాలుగుసార్లు 100శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించింది. 2018 సెప్టెంబర్‌, 2019 ఫిబ్రవరి, 2020 ఫిబ్రవరి, 2022 మార్చి నెలల్లో వందశాతం పీఎల్‌ఎఫ్‌ సాధించింది. ఈ ప్లాంట్‌లో 600 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు ఉండగా.. మొదటి యూనిట్‌ 7 సార్లు, రెండో యూనిట్‌ 10 సార్లు 100శాతం పీఎల్‌ఎఫ్‌ సాధించాయి.

2026 నాటికి 3 వేల మెగావాట్లు :

1200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు కేం ద్రంతో పాటు 2026 నాటికి పూర్తికానున్న 800 మెగావాట్ల మూ డో యూనిట్‌తో కలిపి 2 వేల మెగావాట్లకు విద్యుత్తు ఉత్పత్తి చేరుతుందని సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. ప్రతిపాదిత 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్తుతోపాటు జలాశయాలపై ఏర్పాటుచేయనున్న 1000 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్తు ప్లాంట్లతో కలిపి 2026 నాటికి మొత్తం 3 వేల మెగావాట్లకుపైగా విద్యుత్తును ఉత్పత్తి చేసేస్థాయికి సింగరేణి చేరుకుంటుందని తెలిపారు. పీఎల్‌ఎఫ్‌లో ఎస్టీపీపీ జాతీయస్థాయిలో తొలిస్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తంచేశారు. భవిష్యత్తులోనూ ఇలాగే కృషిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *