అంతర్జాతీయ వైర్‌లెస్ టెక్నాలజీ సంస్థ సిలికాన్ ల్యాబ్స్…హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. సలార్‌పురియా సత్వా నాలెడ్జ్ సిటీలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అంతర్జాతీయ టెక్నాలజీ రంగ పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్ మారిపోయిందని, వ్యాపార అత్యంత అనుకూలంగా ఉండటంతోపాటు దేశంలో ప్రతిభావంతులు ఇక్కడ లభిస్తుండటంతో గ్లోబల్ సంస్థలు ఇక్కడే ఆఫీస్‌లను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. వీఎల్‌ఎస్‌ఐ స్టార్టప్‌ల కోసం ఇంక్యూబేటర్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కార్పొరేట్లు, సీనియర్ ఇంజినీర్లు, విశ్లేషకులకు అవసరమైన సేవలు అందించడానికి ఇలాంటి ఇంక్యూబేటర్లు అవసరం ఎంతో ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇంజినీరింగ్, వైర్‌లెస్ కనెక్టివిటీ ఇన్నోవేషన్ విభాగంలో అంతర్జాతీయంగా ఉన్న ల్యాబ్‌లలో ఇదే అతిపెద్దది. ప్రస్తుతం ఈ ఆఫీస్‌లో 500 మంది హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ విభాగాల ఇంజినీర్లు విధులు నిర్వహిస్తుండగా.. 2025 నాటికి ఈ సంఖ్యను 1,500కి పెంచుకోనున్నట్లు కంపెనీ తెలిపింది.