రూ.300 కోట్లతో హైదరాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఇండస్ట్రీయల్ పార్కు వద్ద ఏర్పాటు కానున్న ష్నీడర్ ఎలక్ట్రిక్ కంపెనీ కొత్త స్మార్ట్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. స్మార్ట్ మ్యనుఫ్యాక్టరింగ్‌లో స్థానిక యువతకు శిక్షణ ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఒకే రోజు హైదరాబాద్‌లో మూడు ఫ్రెంచ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇది సంతోషించే విషయమని పేర్కొన్నారు. మరిన్ని ఫ్రెంచ్ సంస్థలు హైదరాబాద్ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. 75 శాతం ష్నీడర్ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. ఏడాది లోపే సంస్థ తన నూతన ఫ్యాక్టరీని ప్రారంభించనుందని పేర్కొన్నారు. కాగా ఈ కంపెనీ ద్వారా యువతకు దాదాపు 1000 ఉద్యోగాలు రానున్నాయి.