mt_logo

రేపటి నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు

ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఈ నెల 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్పీఆర్బీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌తోపాటు ప్రయోగాత్మకంగా సిద్దిపేటలోనూ ఈ సారి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇప్పటికే ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహణకు అవసరమైన బయోమెట్రిక్‌ పరికరాలు, డిజిటల్‌ హైట్‌ మీటర్లు, సీసీటీవీ కెమెరాలు, ఆర్‌ఎఫ్‌ఐడీ(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) పరికరాలు సహా ఇతర అన్ని సాంకేతిక సామగ్రిని నిర్వహణ కేంద్రాలకు తరలించారు. దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించిన ప్రతి దశనూ సీసీ కెమెరాలతో నమోదు చేస్తారు. షెడ్యూల్‌ ప్రకారం జనవరి మొదటివారంలో ఫిజికల్‌ ఈవెంట్స్‌ ప్రక్రియ పూర్తవుతుందన్న భావనలో అధికారులు ఉన్నారు.

అభ్యర్థులు తీసుకు రావాల్సిన పత్రాలు :

అడ్మిట్‌కార్డు లేదా ఇంటిమేషన్‌ లెటర్‌ ఏ4 సైజ్‌లో పేజీకి రెండు వైపులా ప్రింట్‌ తీసుకొని రావాలి.

పార్ట్‌-2 దరఖాస్తును ప్రింట్‌ అవుట్‌ తీసి దానిపై అభ్యర్థి సంతకం చేసి, వెంట తెచ్చుకోవాలి.

కుల ధ్రువీకరణ పత్రం, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కోటా అభ్యర్థి అయితే సంబంధించిన ధ్రువీకరణ పత్రాల జీరాక్స్‌ కాపీపై సంతకం చేసి తీసుకురావాలి.

ఎస్టీ అభ్యర్థులు ఏజెన్సీ ఏరియా ధ్రువీకరణ పత్రం జీరాక్స్‌ కాపీపై సంతకం చేసి తేవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *