తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో “సినివారం” శీర్షికతో రవీంద్రభారతి సమావేశమందిరంలో ప్రతీ శనివారం లఘుచిత్రం/డాక్యుమెంటరీ ప్రదర్శన.
ఇటీవలీ కాలంలో లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించే యువ దర్శకులు ఎంతో మంది తమదైన సృజనాత్మకతతో ముందుకు వస్తున్నారు. తమ టాలెంట్ కి పదును పెట్టుకుంటూ కొత్త కథలతో, కథనాలతో, టెక్నిక్, టెక్నాలజీతో తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. వీరు తీసిన షార్ట్ ఫిల్మ్ లు కానీ, డాక్యుమెంటరీలు కానీ అద్భుతమైన ప్రశంసలు పొందుతున్నాయి.
అయితే…ఇంతటి నవ్య ఆలోచనలతో దూసుకువస్తున్న నవతరం ఫిల్మ్ మేకర్స్ కి తమ ఫిల్మ్ ని ప్రదర్శించుకునే ప్రివ్యూ థియేటర్స్ కానీ, వేదికలు కానీ కొరతగా ఉన్నాయి. ఉన్నప్పటికి అవన్నీ వ్యయభరితంగా ఉన్నాయి.
ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ రవీంద్రభారతి మొదటి అంతస్తులోని సమావేశమందిరంలో ప్రతీ శనివారం “సినివారం” పేరిట ఈ నవ తరం దర్శకులు రూపొందించిన షార్ట్ ఫిల్మ్ / డాక్యుమెంటరీలను స్క్రీనింగ్ చేయాలని, ఈ స్క్రీనింగ్ సౌకర్యాన్ని ఉచితంగా అందించి వారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది.
ఔత్సాహిక యువ దర్శక, రచయిత, నటులు తాము తీసిన లఘు చిత్రాలు/డాక్యుమెంటరీలను ప్రదర్శించాలనుకునే యువ సినీ దర్శకులు ఈ “సినివారం” అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.
దీనికిగాను మీరు చేయాల్సిందల్లా, మీ షార్ట్ ఫిల్మ్ /డాక్యుమెంటరీ వివరాలను, సంక్షిప్త కథను, సాంకేతిక నిపుణుల వివరాలతో కలిపి మీకు రవీంద్రభారతి సమావేశ మందిరాన్ని కేటాయించవలసిందిగా డైరెక్టర్, సాంస్కృతిక శాఖ వారిని అభ్యర్థిస్తూ ఒక ఉత్తరాన్ని రాయండి. లేదా cinivaram.rb@gmail.com కి మెయిల్ చేయండి లేదా +91-9849391432/040-23212832 (సతీష్) నెంబర్ లో సంప్రదించండి.
కొత్తతరం సినిమాకి ఆహ్వానం పలికే “సినివారం” అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నవతరం సినిమా ఎదుగుదలని ప్రోత్సహిద్దాం అని సంచాలకులు మామిడి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.