mt_logo

అడుగడుగునా చరిత్ర వక్రీకరణ

శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో శైలజానాథ్ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. అడుగడుగునా చరిత్ర వక్రీకరిస్తూ అహంకారపూరితమైన వ్యాఖ్యలతో మంత్రి శైలజానాథ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని, తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది విశాలాంధ్ర ఏర్పాటుకేనని, వేల సంవత్సరాలుగా తెలుగుజాతి కలిసే ఉందని అసత్యవ్యాఖ్యలు చేశారు. తెలుగుజాతి విడిపోవడమంటే అది వారి ఆత్మగౌరవ సమస్య అని భావిస్తున్న మంత్రిగారికి, తెలంగాణ ప్రజలకు సీమాంధ్ర ప్రజలతో కలిసిఉండటం తమ ఆత్మగౌరవ సమస్య అంటే మాత్రం వినపడటంలేదా? విద్యార్థులు చేసిన ఉద్యమాలను విమర్శించి, హైదరాబాద్ ఆంధ్రుల పట్నమేనంటూ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తెలంగాణ ప్రజల కోరికేనని, పిలిస్తేనే తాము వచ్చామని అంటూ అతి నీచమైన, అహంభావ, ఆధిపత్య ధోరణితో కూడిన ప్రసంగం కొనసాగింది. హైదరాబాద్ సమైక్య రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిందని మితిమీరి మాట్లాడుతున్న ఆయనకు హైదరాబాద్ స్వాతంత్ర్యానికి ముందే ఒక మహానగరమనే విషయం తెలియకపోవడం దురదృష్టకరం. ఒక్కదానికీ పొంతన లేకుండా మాట్లాడుతున్న శైలజానాథ్ ను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రాంత నేతలు ఎంత అడ్డుకున్నా తన అవాస్తవ ప్రసంగాన్ని 3గంటలపాటు సాగదీస్తూ పోయారే తప్ప ముగించలేదు. మధ్యలో ఎర్రబెల్లి అడ్డుపడుతూ, మంత్రి స్థానంలో ఉండి రాష్ట్రపతి పంపిన బిల్లు రాజ్యాంగవిరుద్ధం అంటే ఊరుకోమని, రాజీనామా చేసి మాట్లాడాలని అన్నారు. జానారెడ్డి కూడా రాజ్యాంగబద్ధంగానే చర్చ కొనసాగాలని, రాష్ట్రపతి పంపిన బిల్లును విమర్శించడం సరికాదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, 2004 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణను చేర్చినప్పుడు ఈ దమ్ము, ధైర్యం ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను చులకన చేసి మాట్లాడిన శైలజానాథ్ పై టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లక్షల కోట్ల అవినీతిపరులు జగన్, గాలి జనార్ధన్ రెడ్డి అని, సీమాంధ్రులే అభివృద్ధి పేరుతో తెలంగాణను దోచుకున్నారని, తెలంగాణకు చెందిన ఏ ఒక్కరూ అవినీతికి పాల్పడలేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *