mt_logo

సెప్టెంబర్ 17 డిమాండ్: ముందూ వెనక..

By: సవాల్‌రెడ్డి

మరి.. తెలంగాణకు ఒక స్వాతంత్య్ర దినం వంటి పర్వదినం అక్కరలేదా? తప్పనిసరిగా కావాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున తెలంగాణ ఇంకా రాజరిక నియంతృత్వంలోనే మగ్గుతున్నది. అయితే కొన్ని వర్గాలకు ఏమంత సంతోషదాయకం కాని రోజును కాకుండా మరో రోజును ఎంచుకోలేమా? అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఏ జ్ఞాపకమైనా ఏ పర్వదినమైనా ప్రజలను కలిపేటట్టు ఉండాలి.. తప్ప విభజన తీసుకువచ్చేట్టు ఉండకూడదు. -ఆంధ్రజ్యోతి సంపాదకీయం 26 ఆగస్టు 2010.

ఆ రోజున తెలంగాణ విమోచనదినం అధికారికంగా జరపాలనే అంశం మీద తీవ్రవాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆ అంశంమీద బీజేపీ చాలా ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నా.. 2009 డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన.. ఆ తర్వాత పరిణామాల్లో తెలంగాణ జేఏసీ ఏర్పాటై ఉద్యమం ఉరకలు వేస్తున్న సమయం. ఎవరు ప్రతిపాదించారన్నది ఖచ్చితంగా చెప్పలేం కానీ.. తెలంగాణ జేఏసీ సమావేశాల నుంచే సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా జరపాలనే డిమాండ్ ను వినిపించింది. మీడియాలో కేసీఆర్ వాదన బలంగా కనిపించింది గానీ విముక్తిదినం డిమాండ్ వినిపించిన వారిలో కోదండరాం కూడా ఉన్నారు. ఈ విషయమై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యేకించి భారతదేశంలో విలీనమైన రోజును కనీసం విలీనదినంగానైన జరపుకోవాలని కనీసమైనటువంటి స్పృహను గూడ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నడూ ప్రదర్శించలేదు. అని పేర్కొన్నారు.

మీడియా రచ్చ…
ఆ వెంటనే సీమాంధ్ర మీడియా కంగారుపడిపోయింది. ఒకే దేశంలో రెండు స్వాతంత్య్ర దినోత్సవాలేంటి? అనే వాదన దగ్గర్నుంచి అసలు సెప్టెంబర్ 17 స్వాతంత్య్ర దినోత్సవం ఎలా అవుతుంది? అనేదాకా ఎన్నో వాదనలు. టీవీ స్టూడియోల్లో గొంతులు చించుకున్నాయి. హైదరాబాద్ ప్రత్యేక దేశం కాదు.. అన్నారు. అలాంటప్పుడు స్వాతంత్య్రం ఎలా అవుతందన్నారు. స్వయం ప్రతిపత్తి వట్టిమాట.. నిజాం బ్రిటిష్ బంటు అన్నారు. మొత్తంమీద ఛస్.. స్వాతంత్య్రదినం అనవసరం అని తేల్చేశారు. ఇది ఒక కోణం.

రెండో కోణం మరొకటి ఉంది. నాటి తెలంగాణ జేఏసీ నానా భావజాలాల వేదిక. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వారంతా అందులో ఉన్నారు. సెప్టెంబర్ విముక్తి దినం అంశం మీద వామపక్ష భావజాలం కలిగిన వారి నుంచి, మైనారిటీ ప్రతినిధుల నుంచి భిన్న స్వరాలు వినిపించాయి. ఒకటి వామపక్షాలు పంచిన భూమిని భారత సైన్యం వెనక్కి ఇప్పించి పేదలకు అన్యాయం చేసిందని.. రెండు సైనికచర్య సందర్భంగా సాయుధపోరాట ఉద్యమకారుల.. ముస్లింల ఊచకోత జరిగిందని. ఈ నేపథ్యంలో సుందర్‌లాల్ కమిటీ నివేదికలు.. వగైరా వగైరాలు మీడియాకెక్కాయి. అయితే అవి జేఏసీ నిర్ణయాలను అప్పటికప్పుడు ప్రభావితం చేసే స్థాయిలో రాలేదు. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో విముక్తిదినం అనేది ఒక బలమైన ఆయుధంగా మారుతుందనే అంచనా జేఏసీలోని మెజారిటీ వర్గాల్లో ఉంది.

అభిప్రాయం మారింది ఎక్కడ?…
2010లో రంజాన్ సందర్భంగా ఎంపీజే ఇప్తార్ విందు ఇచ్చింది. ఆ విందుకు కేసీఆర్, కోదండరాం ఇద్దరూ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఏంపీజే అధ్యక్షుడు మహ్మద్ హమీద్‌ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరిపితే అది ముస్లింలను అవమానించినట్టేనని బహిరంగంగానే చెప్పారు. అప్పటికే ఎంఐఎం విమోచనదినాన్ని వ్యతిరేకించినా జేఏసీలో గానీ, తెలంగాణ ఉద్యమంలో గానీ భాగస్వామి కాదు కాబట్టి అది ఉద్యమకారుల మీద ప్రభావం చూపలేదు.

అయితే కొన్ని ముస్లిం సంస్థలు కేసీఆర్‌ను కలసినపుడు ఈ విషయం ప్రస్తావించాయి. మొత్తానికి ముస్లింలలో మంచి పలుకుబడి ఉన్న ఎంపీజే సమావేశంలో బహిరంగంగానే ముస్లిం నేతలు దీన్ని ప్రస్తావించడం.. హాజరైన వారంతా ఆ వాదనను సమర్థించడం కేసీఆర్, కోదండరాం ఇద్దరినీ కొంత ఇరకాటంలో పెట్టింది. ఈ అంశం మీద మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ఆ వేదిక మీది నుంచే ప్రకటించారు. అలాగే జేఏసీ స్టీరింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని కోదండరాం కూడా చెప్పారు.

తీవ్రంగా వ్యతిరేకించిన జేఏసీ..
జేఏసీలో ఈ విషయాన్ని అంతర్గతంగా చర్చించారు. ఈ చర్చల్లోనూ తీవ్ర విభేదాలు వచ్చాయి. ముఖ్యంగా ప్రజాసంఘాల నుంచి విమోచన, విలీన దినాల ప్రస్తావనను వ్యతిరేకించారు. న్యూ డెమోక్రసీ అడుగు ముందుకు వేసి తాము విద్రోహదినం పాటిస్తామని ప్రకటించింది. సెప్టెంబర్ 17 విమోచన దినమే అయితే.. స్వాతంత్య్రమే వచ్చి ఉంటే.. ఇపుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు చేస్తున్నామని కొన్ని ప్రజాసంఘాలు ప్రశ్నను లేవనెత్తాయి. ఏకాభిప్రాయం రాలేదు. ఈ విభేదాలను దృష్టిలో పెట్టుకుని చివరకు ఆగస్టు 30న సెప్టెంబర్ 17ను విముక్తిదినంగా కాకుండా విలీనదినంగా సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వమే ఈ ఉత్సవాన్ని అధికారికంగా జరపాలనే డిమాండ్ వెనక్కి పోయింది.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి సెప్టెంబర్ 17 అంశం ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వమే వచ్చింది కాబట్టి విముక్తి దినం జరపాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఈ ఒత్తిడి తిరిగి జేఏసీ పైనా పడింది. అనేక తర్జనబర్జనల అనంతరం 2014 సెప్టెంబర్ 16నాడు మీడియా సమావేశంలో ఈ వివాదాన్ని ప్రస్తావిస్తూ ప్రొఫెసర్ కోదండరాం ఇలా చెప్పారు. పౌరసమాజంలో వివాదం ఉన్నప్పుడు ప్రభుత్వం విముక్తి దినం జరపడం అనేది కొంత ఇబ్బందిగనే ఉంటది. అందుకని ఈ విషయాలపైన కొంత ఏకాభిప్రాయమనేది సమాజంలో పెంపొందవల్సిన అవసరం ఉంది. భిన్నమైన దృక్పథాలు ఉన్నపుడు ప్రభుత్వాలకు కూడా ఒక నిర్ణయానికి రావడం అనేది కష్టంగానే ఉంటది. చాలా సుదీర్ఘమైన చర్చ తర్వాత జేఏసీ సెప్టెంబర్ 17ను కేవలం విలీనదినంగా మాత్రం పాటించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రజలను విలీనదినంగానే పాటించాలని కోరుతున్నం.

జాతీయ జెండాను ఎగరేసి అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఈ కార్యక్రమం నిర్వహించవలిసిందిగా విజప్తి చేస్తున్నం అన్నారు. మరుసటి రోజు జేఏసీ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగరేసిన కోదండరాం తన ప్రసంగంలో చెప్పిన మాట…మళ్లీ కుల మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఎటువంటి ప్రయత్నాలను కూడా మేము జేఏసీగా ఆమోదించబోమని ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలిచినం. రాజకీయాలనేవి ప్రజలయొక్క సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాలె గానీ సమస్యలను సృష్టించేవిగా ఉండకూడదని, ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నం ఇవాళ వెటకారాలు పలికేవారికి.. విద్వేషాలు రాజేసే వారికి బహుశా ఈ వివరణ సరిపోవచ్చు.

ఉద్యమకాలంలో విముక్తిదినం డిమాండ్ చేసి ఇవాళ ముస్లిం సాకుతో తప్పుకుంటున్నారని కొందరు వెటకారాలాడవచ్చు. కొందరేమో ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలకు కూడా ఈ సమస్య ఉండడం వల్లనే నిర్వహించలేదేమో అని వత్తాసు పలుకనూవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏమంటే ఉమ్మడి ప్రభుత్వాలు విముక్తిదినం పాటించేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు. ప్రయత్నించి.. వ్యతిరేకత వచ్చి విరమించుకుని ఉంటే ఆ అనుభవం చూసి కేసీఆర్‌కానీ..జేఏసీకానీ ఈ డిమాండ్ తెచ్చే అవకాశం లేకపోయేది. ఈ వ్యతిరేకత అనేది అంతకుముందు అంతర్గతంగా ఉండి ఉన్నా… డిమాండ్ తెరమీదికి వచ్చిన తర్వాత బహిర్గతమైంది. తెలంగాణ జనాభాలో ముస్లిం జనాభా చెప్పుకోదగినంతగా ఉంది. కారణాలేమైనా మూకుమ్మడి మరణాలు బాధాకరం కావడం వల్ల వారిలో ఆ సందర్భం గాయం చేసి ఉండవచ్చు. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంగా.. అందునా కొత్త రాష్ట్రంగా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలనుకుంటున్న ప్రభుత్వం… అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించే ప్రభుత్వం ఎవరినీ బాధపెట్టే పని చేయలేదు- సవాల్‌రెడ్డి

శానామందికి శానా కోరికలున్నయ్. ఇయ్యాల్ల ఓ పదిమంది నా ఇంటి ముందటికచ్చి ధర్నాకూడ చేసిండ్రు. కమ్యూనిస్టులది ఓ ప్రచారం.. బీజేపీది ఓ ప్రచారం.. ఒకల్లు విలీనదినమంటరు, ఒకల్లు విమోచన దినమంటరు, ఇంకోల్లు విద్రోహ దినమంటరు, ఇట్ల రకరకాల మల్టిపుల్ డైమన్షన్స్ దానికి ఉన్నయ్. తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ఇపుడే ఏర్పడ్డది. జూన్ సెకండ్ మనకు మంచిగ స్టేట్ ఫార్మేషన్ డే ఉంది. దాన్ని చాలా ఘనంగా జరుపుకుందాం. మీమీ సెంటిమెంట్లు ఉంటె మీమీ కార్యాలయాల్లో బ్రహ్మాండంగా జెండా ఎగరేసుకోండి. మీరు ఎట్ల పాటించాలనుకుంటే అట్ల పాటించుండ్రి. ఇక్కడ సబ్జెక్ట్ ఏందంటే ఆ సందర్భంలో మాకు గొప్ప నష్టం జరిగింది అని చెప్పి ఇక్కడ ఉండబడే ముస్లిం సోదరులలో ఒక భావన ఉంది. ఆ సెంటిమెంటు రెచ్చగొట్టాలని కొందరు ప్రయత్నం చేస్తరు. దానికి మేమెందుకు సకప్ అయితమండి? అన్ని మతాలు.. అన్ని వర్గాలు..అన్ని తెగలు మంచిగ పోవాలె. మాకు అది కావాలె. ఈ సిల్లర ఎత్తుగడలతో మేం రాజకీయం చేస్తమంటే అది కాదది. అది పనికచ్చేది కూడా కాదు. – కరీంనగర్ పర్యటన సందర్భంగా కేసీఆర్

1949 ఏప్రిల్ 17
ప్రస్తుత సంస్థాన ప్రభుత్వం, యూనియన్ అధికారులు హైదరాబాద్ ప్రజలను జయింపబడిన దేశంలోని ప్రజల మాదిరిగా చూస్తున్నారు. అవమానిస్తూ అణచిపెడుతున్నారు. ఈ దౌర్జన్యాన్ని ఇలాగే కొనసాగించిన పక్షంలో హైదరాబాద్ హైదరాబాదీయులకు మాత్రమే అనే నినాదంతో ఉద్యమాలకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను. సంస్థానంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారందరినీ ఊడబెరుకుతూ బయటినుంచి అధికారులను నింపుతున్నారు. ఉద్యోగ నియామకాల్లో ఉస్మానియా యూనివర్సిటీ అంటే చాలు.. పక్కన పెడుతున్నారు. ఇదే కొనసాగితే పాలన విషమిస్తుంది. మేం ప్రాణాలకు తెగించి గత ఫాసిస్టు ప్రభుత్వానికి ఎదురువెళ్లి పోరాటం జరిపింది… పెనం మీదినుంచి పొయ్యిలో పడేందుకు కాదు సైనికచర్య తర్వాత ఆరు నెలల కాలంలోనే నాటి సంస్థాన కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడు, జీఎస్ మెల్కోటే చేసిన బహిరంగ ప్రకటన ఇది. సెప్టెంబర్ 17 విముక్తి దినమో విమోచన దినమో అర్థం చేసుకోవడానికి ఈ ప్రకటన చాలు!!
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *