తెలంగాణ ఉద్యమాన్ని నెగెటివ్ కోణంలో చూపించడానికి సీమాంధ్ర మీడియా ప్రదర్శించే టక్కుటమార విద్యలు ఒకటి కావు. అయితే ఇప్పుడు ఉద్యమం ఇచ్చిన చైతన్యంతో తెలంగాణ పౌరులు సీమాంధ్ర మీడియా నిజస్వరూపాన్ని బాగానే కనిపెట్టగలుగుతున్నారు.
నిన్న వచ్చిన ఎమ్మెల్సీ ఫలితాల విషయంలో సీమాంధ్ర మీడియా మరోసారి “ఎజెండా సెట్టింగ్” చేయడానికి ప్రయత్నించింది. నిజానికి ఈ ఎన్నికల ఫలితాలు, తెలంగాణవాదం హిమాలయం అంత ఎత్తున ఉన్నదని మరోసారి నిరూపించాయి. మెదక్, కరీ నగర్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీచేసిన టీ.ఆర్.ఎస్ అభ్యర్ధి స్వామి గౌడ్ దేశచరిత్రలో ఎక్కడా లేనంత ఓట్ల శాతం (92%) సాధించి రికార్డు సృష్టించాడు. అదే జిల్లాలకు చెందిన టీచర్ల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి పాతూరు సుధాకర రెడ్డి తొలి ప్రాదాన్యత ఓట్లలోనే మంచి మెజార్టీతో విజయం సాధించాడు. ఇక నలగొండ, వరంగల్, ఖమ్మం టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి వరదారెడ్డి, తెలంగాణ టీచర్ల జేయేసీ అధ్యక్షుడు పూల రవీందర్ ఇద్దరి మధ్యా హోరాహోరీ పోరు జరగగా చివరికి ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా పూల రవీందర్ గెలిచాడు. ఇక్కడ పోటీబడ్డ ఇద్దరు అభ్యర్ధులూ తెలంగాణవాదంపైనే పోటీబడ్డారు. గెలిచిన అభ్యర్ధి పూల రవీందర్ తెలంగాణ టీచర్ల జేయేసీ అధ్యక్షుడు, సకల జనుల సమ్మెను ముందుండి నడిపిన నాయకుడు.
తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, వైకాపాలు కనీసం పోటీచేసే సాహసం కూడా చేయలేదు.
ఇక తెలంగాణతో పాటు ఆంధ్రలో కూడా జరిగిన ఎమ్మెల్సీ ఫలితాలు ఒకసారి చూద్దాం.
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుండి తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్, ఒక ఇండిపెండెంటు చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. ఇక్కడ వైకాపా కూడా పోటీచేసింది కానీ దాని అభ్యర్ధి కనీసం మూడో స్థానంలో కూడా నిలవలేకపోయాడు.
మరోవైపు ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఇండిపెండెంటు అభ్యర్ధి రవి కిరణ్ వర్మ గెలిచాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కనుమిల్లి వెంకట సూర్యనారాయణ మూడో స్థానంలో నిలవగా, వైకాపా అభ్యర్ధి సోదిలోకి లేకుండా పోయాడు. .
కానీ మన సీమాంధ్ర మీడియాకు ఇవేవీ కనపడవు. తెలంగాణ ప్రాంతంలో మూడు చోట్లా తెలంగాణావాదమే గెలిచినా, చారిత్రాత్మక విజయం సాధించినా, ఏదో విధంగా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితిని తక్కువచేసి చూపాలనే యావే సీమాంధ్ర మీడియా కవరేజిలో కనపడింది. అందుకే నలగొండ-వరంగల్-ఖమ్మం స్థానాన్ని తెరాస ఓడిపోవడాన్ని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాయా సంస్థలు.
మరి రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెదేపా, గొప్ప ఊపు మీద ఉన్నట్టు కలరింగ్ ఇచ్చే వైకాపాలు ఈ ఎన్నికల్లో ఎక్కడ గల్లంతు అయ్యాయో, ఒక్క మీడియా సంస్థ కూడా అక్షరం ముక్క రాస్తే ఒట్టు.
ఆపాటికి ఎన్నికలు ఏదో తెలంగాణలోనే జరిగినట్టు, తెలంగాణ రాష్ట్ర సమితి తప్ప మరే పార్టీకి అసలు గెలుపోటములే లేనట్టు ఒకటే కాకిగోల.
మూడు స్థానాల్లో పోటీచేసి, రెండు చోట్ల చారిత్రాత్మక విజయం సాధించి, మరోస్థానంలో గట్టిపోటీ ఇచ్చిన తెరాసకేమో ఈ ఫలితాలు “షాక్” ఇచ్చాయని, “నిరాశ” పరిచాయని గోబెల్స్ ప్రచారానికి దిగుతున్న పచ్చజ్యోతులు, పిచ్చి సాక్షులు – తమ తమ యాజమానుల పార్టీలు తెలంగాణ గడ్డ మీద ఒక్కటంటే ఒక్కచోట కూడా పోటీచేసే సాహసం చేయలేదని, ఆంధ్రలో ఉన్న సిట్టింగ్ స్థానం కూడా తెదేపా ఘోరంగా ఓడిందని, అధ్యక్షులు పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాల్లోనే ఆయా పార్టీల అడ్రస్సు ఎందుకు గల్లంతు అయ్యాయన్నదాని మీద ఒక్క కథనమూ రాయవు, చూపవు.
వాటి ఎజెండా సెట్టింగ్ వ్యూహాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకంగా లేరిప్పుడు తెలంగాణ ప్రజలు.