mt_logo

రాజధాని గతిలేకనే సమైక్య రాగం

[click on image to view full size of this 1952 newsclip]

By: కొణతం దిలీప్

తెలంగాణ రాష్ట్రం సాకారం కాబోతున్నదన్న వాతావరణం సర్వత్రా నెలకొన్న సందర్భమిది. ఏదోవిధంగా ఆ పుట్టబోయే శిశువు ఉపిరి తీయడానికి సీమాంధ్ర బేహారులు కత్తులు దూస్తున్న సందర్భమిది. హైదరాబాద్‌ను ఉద్దేశపూర్వకంగానే చర్చనీయాంశం చేసి, తద్వారా ఒక గందరగోళం సృష్టించాలనే ప్రయత్నంలో తెలంగాణ వ్యతిరేకశక్తులు ఉన్నాయి. తెలంగాణ విడిపడ్డాక ఆంధ్ర రాష్ట్రం తన స్వంత రాజధాని ఏర్పాటు చేసుకునే దాకా కొంతకాలం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలనే ప్రతిపాదన కొంతమంది చేస్తున్నారు. ఇది భవిష్యత్ తెలంగాణకు ప్రమాదకరమైన ప్రతిపాదన. దీనివల్ల కేవలం కొద్దిమంది సీమాంధ్ర వ్యాపార సంపన్న వర్గాల స్వార్థ ప్రయోజనాలు నెరవేరుతాయేమో కానీ అక్కడి సామాన్యులకు ఉపయోగపడదు.

ఆనాడు ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయిననాడు రాజధాని విషయంలో జరిగిన చర్చ తెలుసుకుంటే సీమాంధ్ర నాయకులతో మనం, హైదరాబాద్ విషయంలో ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నా తమకు హక్కులు లేని మదరాసు నగరంపై పీటముడి వేసిన ఆనాటి సీమాంధ్ర నాయకుల వైఖరిని మనం మరవరాదు.

1952 అక్టోబర్ 30నాడు విద్యార్థుల సభలో నీలం సంజీవరెడ్డి  చేసిన ఆకుకు,పోకకు అందని వ్యాఖ్యలు చూడండి.

‘అప్పుడూ మదరాసుపై హక్కులు వదులుకున్నాం అని చెప్పాం. కానీ అది అరవలకు ఇస్తున్నామని అంగీకరించలేదు. మదరాసులో అరవలు ఎక్కువ ఉన్నారని ఒప్పుకోవచ్చు. కానీ అరవేతరులు అంతకన్నా ఎక్కువ కనుక, మదరాసును అరవలు కోరరాదు. మదరాసు అరవలకు , ఆంధ్రులకు ఉమ్మడిగా ఉంటే కష్టమేమిటీ? మదరాసులో వారు చెప్పినట్టు అరవలు 80మంది ఉన్నా, 16గా ఉన్న ఆంధ్రుల హక్కులు కాపాడడానికైనా ఆది ఉమ్మడిగా ఉండాలి’.

ఇది చూస్తే సీమాంధ్ర నేతలు ఇప్పుడు హైదరాబాద్‌పై చేసే అడ్డగోలు వాదనలు గుర్తుకురావడం లేదూ?

మదరాసు నగరానికి పొట్టి శ్రీరాములు ప్రాణాన్ని ముడివేసి అన్యాయంగా ఆ త్యాగమూర్తిని బలిపెట్టారు. చివరికి మదరాసు లేకుండానే కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పటి మదరాసు ముఖ్యమంత్రి రాజాజీ ఒక్కరోజు కూడా మదరాసులో ఆంధ్రుల రాజధాని ఉండటానికి వీలులేదని ఆజ్ఞాపించడంతో ఆంధ్ర ఆఫీసులన్నీ కర్నూలుకు తరలాయి. అరవైఏళ్ల కిందనే రాత్రికి రాత్రి స్వంత రాజధానికి తరలిన సీమాంధ్రులకు ఇంత సాంకేతిక నైపుణ్యం ఉన్న ఈ రోజుల్లో పదేండ్లు ఉమ్మడి రాజధాని ఎందుకు?

ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో సీమ నాయకులు ఎప్పుడు ఇష్టంగా పాల్గొనలేదు. కోస్తాంధ్రులతో వేగలేమని, తమిళులతో కలిసి ఉండటమే మేలనుకున్నారు. వారిని బుజ్జగించడానికే రాయలసీమకు కొన్ని రక్షణలు కల్పించే శ్రీబాగ్ ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేయడం కూడా శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తి నుంచి జరిగిందే. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి నెలరోజులు కూడా గడవక ముందే ఆంధ్ర నాయకులు మళ్లీ రాజధాని అంశాన్ని తిరగతోడారు.

1953 నవంబర్ 5న కృషికార్ లోక్‌పార్టీ నేత ఎన్.జీ రంగా గుంటూరు, విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరారు. అప్పటి ఆంధ్ర రాష్ట్ర మంత్రులు నీలం సంజీవరెడ్డి, గౌతులచ్చన్న మధ్య రాజధాని ఏర్పాటుపై పంచాయితీ సాగింది. కొందరు కర్నూలులో సౌకర్యాలు లేనందున తమ ఆఫీసులు కొన్నింటిని హైదరాబాద్‌లో పెట్టుకుంటామని ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. 1953 నవంబర్ 23న మొదలైన ఆంధ్రరాష్ట్ర మొదటి శాసనసభ సమావేశాలు ఆద్యంతం రాజధాని నగరంపై కీచులాటలతో సాగాయి. శాసనసభలో రాజధాని విషయమై ప్రతిపక్షం నెగ్గితే రాజీనామా చేయడానికి ముఖ్యమంత్రి ప్రకాశంపంతులు సిద్ధమయ్యాడు. రాజధానిని కర్నూలు నుంచి తరలించే చర్చలకు నిరసనగా నవంబర్ 27న నలుగురు కాంగ్రెస్ మంత్రులు సంజీవరెడ్డి, సంజీవయ్య, కోటిరెడ్డి, పట్టాభి సీతారామయ్య పదవులకు రాజీనామా చేశారు. రాజధానిని తరలిస్తే తాము రాజీనామా చేస్తామని 23 మంది సీమ శాసనసభ్యులు హెచ్చరించారు.

శాసనసభలో చర్చలు సాగుతుండగా కర్నూలు వీధుల్లో ప్రదర్శనలు మొదలైనయి. శాసనసభకు వెళ్తున్న ఎమ్మెల్యేలపై, స్పీకర్‌పై ఉద్యమకారులు దాడులు చేశారు. స్పీకర్ వెంకట్రామయ్య, తాత్కాలిక స్పీకర్ నడింపల్లి లక్ష్మీనరసింహం ప్రయాణిస్తున్న కారును ఆటకాయించి, బూతులు తిట్టి కారుపై ఉమ్మేశారు. ఇతర శాసనసభ్యులకు కూడా ఇదే పరాభవం ఎదురైంది. రాళ్లదాడి వల్ల వావిలాల గో పాల కృష్ణయ్య తలకు దెబ్బతగిలింది.

ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఏదనే తీర్మానంపై శాసనసభలో జరిగిన ప్రహసనం సీమాంధ్ర నాయకుల అతి తెలివికి, వారి మధ్య అపనమ్మకాలకు ఉదాహరణ. నవంబర్30న టెక్కలి శాసన సభ్యుడు రొక్కం లక్ష్మీనరసింహం విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని ప్రతిపాదించారు. సీమ సభ్యులు కర్నూలు నుంచి తరలించవద్దని పట్టుబట్టారు. ఆంధ్ర రాష్ట్రం రాయలసీమ ప్రజలకు అవమానాన్ని దుఃఖాన్ని, నాశనాన్ని తెచ్చిపెట్టిందే కాని సంతోషాన్ని మాత్రం తెచ్చి పెట్టలేదని మంత్రి తిమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.

రాజధాని కాగల అర్హతలు తమ పట్టణానికి ఉన్నాయని నెల్లూరు ఎమ్మెల్యే వేమయ్య వాదించాడు. కమ్యూనిస్టులు, ఆంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యుల్లో అత్యధికులు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలన్నారు.

ఆ రోజు రెండు విరుద్ధ సవరణ తీర్మానాలను శాసనసభ ఆమోదించింది. ఒకటి 1956 ఏఫ్రిల్ 1 నుంచి విశాఖపట్నం శాశ్వత రాజధాని కావాలనేది. రెండవది మదరాసులోని ఆంధ్రాఫీసులను 1954 ఏఫ్రిల్ 2 నాటికి గుంటూరు-విజయవాడలకు తరలించాలనేది. శాశ్వత రాజధానిగా విశాఖపట్నం పేరును సూచిస్తూనే ఆంధ్ర ప్రభుత్వ ఆఫీసులను గుంటూరు-విజయవాడలలో నెలకొల్పాలని సూచించడం ఎంత తలకాయలేని నిర్ణయాలో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

రాజధానిపై ఆంధ్ర- రాయలసీమ నాయకుల మధ్య ఏకాభిప్రాయం సాధించడం సాధ్యం కాదని అవగతమైనాక హైదరాబాద్‌ను చేజిక్కించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అసలు హైదరాబాద్ నగరం గురించి సీమాంధ్ర నాయకుల మెదళ్లలో ఆలోచనా బీజాలు నాటింది అప్పటి మదరాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి అని ఇప్పుడు వెల్లడవుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది.

మదరాసు నగరంపై పీఠముడి వేసి కూర్చున్న ఆంధ్ర నాయకులకు హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా చేసుకోవచ్చనే ఉపాయం చెప్పింది రాజాజీనే అని మోనికా ఫెల్టన్ అనే రచయిత్రి రాసిన ‘ఐ మీట్ రాజాజీ’ అనే పుస్తకం చదివితే అర్థమవుతుంది. రాజాజీ నుంచి ఈ సూచన అందుకున్న తరువాతనే సీమాంధ్ర నాయకులు విశాలాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఢిల్లీ పెద్దలను మేనేజ్ చేసి హైదరాబాద్ కోసం తెలంగాణను కలుపుకున్నారు. వారికి తెలంగాణ మీద ప్రేమ మొదలయ్యింది హైదరాబాద్ కోసమే అని ఈనాటి సమైక్యాంధ్ర ఉద్యమంగా పేర్కొనబడుతున్న తెలంగాణ వ్యతిరేక ఉద్యమ స్వభావాన్ని గమనించినా మనకు సులభంగానే అర్థం అవుతుంది. హైదరాబాద్‌ను మినహాయించి తెలంగాణను ఇస్తే తమకు అభ్యంతరం లేదని సోకాల్డ్ సమైక్యాంధ్ర నేతలంతా అనడం వారి సమైక్య ప్రవచనాల డొల్లతనాన్ని బయటపెడుతున్నది. అందుకే ఇటీవల జాతీయ మీడియా జర్నలిస్టులు కొందరు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని హైదరాబాద్ కోసం కొందరు ధనిక సీమాంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న ఉద్యమం’ అని నేరుగానే పేర్కొంటున్నారు.

సీమాంధ్ర కుట్రల చరిత్ర అంతా తెలిసి కూడా మనం ఉమ్మడి రాజధాని వంటి పరిష్కారాన్ని ఆమోదిస్తే కొరివితో తలగోక్కున్నట్టే. కనుకనే తెలంగాణ ఏర్పాటు ప్రకటనతోపాటు స్పష్టంగా సీమాంధ్రకు నూతన రాజధానిని ప్రకటించాలనే డిమాండ్‌ను మనం పెట్టాలె. లేకుంటే సీమాంధ్ర నాయకులు మరొకసారి 1953 నాటి నాటకాలనే పునరావృత్తం చేసి హైదరాబాద్‌ను వదలకపోయే ప్రమాదం ఉన్నది.

[21 జనవరి నాడు నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితం]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *