ఫొటో: ధర్మపురి క్షేత్రంలో ఒకప్పుడు స్థానికులు కట్టించిన ఆలయం. ఇప్పుడు అది కనిపించకుండా సత్యవాణి కట్టిన విజయదుర్గ గుడి
—
నోరు తెరిస్తే ఆధ్యాత్మికం, కాలు కదిపితే మాత్రం కబ్జా… శివ శివ అంటూనే గుడితో సహా లింగాన్ని మింగే ఘనురాలు ఆమె. సీమాంధ్ర నుంచి హైదరాబాద్ కు వచ్చి వందల ఎకరాల భూమిని సంపాదించడం ఎంత సులువో శ్రీ శివబాలయోగి మహరాజ్ ట్రస్ట్ ఓనర్ గొట్టిపాటి సత్యవాణిని అడిగితే తెలుస్తుంది.
మొన్న 7 సెప్టెంబర్ నాడు జరిగిన సమైక్య సభలో ఆమె చెప్పిన సుద్దులకు, ఆధ్యాత్మికం ముసుగులో ఆమె చేసే పనులకు ఏ మాత్రం సంబంధం వుండదని ఆమె గురించి కాస్త తెలిసినవారికెవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది.
ధార్మిక క్షేత్రం మాటున సత్యవాణి ఆక్రమించిన స్థలం 520 ఎకరాల పైమాటేనని సమాచారం. మియాపూర్ గ్రామస్థులు బతుకమ్మలు వేసే స్థలాన్ని కూడా సొంతం చేసుకున్న ఘనచరిత్ర సత్యవాణిది.
ఆమె ధార్మిక క్షేత్రంలో వనభోజనాలు నిర్వహించుకునేందుకు సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే అనుమతిస్తారని స్థానిక గ్రామస్థులు వాపోతున్నారు.
ఈ స్థలంలో ఏర్పాటు చేసిన శ్రీ శివబాలయోగి మహరాజ్ ట్రస్ట్ ప్రాంగణంలో శివాలయం, సాయిబాబా మందిరం, సరస్వతీ దేవాలయం,విజయ దుర్గా దేవీ మందిరాలు నిర్మించారు. దేవాలయాల్లో హుండీలు ఏర్పాటు చేసి భారీగా డబ్బులు గుంజడమే లక్ష్యంగా ఆమె ట్రస్ట్ రోజువారీ కార్యకలాపాలు సాగుతాయనే విమర్శలు కూడా వున్నాయి.
ప్రభుత్వ భూములు ఆక్రమించడం, దాన్ని అయినవారికి కట్టబెట్టడం సత్యవాణి అనునిత్యం చేసే దందా.
సత్యవాణి భూ దయకు పాత్రులైనవారిలో సినీ ప్రముఖులే కాకుండా పొలీసు శాఖలో చిన్న బాసులు కూడ వున్నారు. గతేడాది మే 11న ధర్మపురి క్షేత్రం ప్రాంగణంలో అక్కినేని గురుకుల అభినయ విద్యాలయం మొదటి బ్యాచ్ ను స్వయంగా అక్కినేని నాగేశ్వర రావు ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో అక్కినేని మాట్లాడుతూ ‘స్వీయ లోపంబు లెరుగుట పెద్ద విద్య’ అన్నారు – (తమ తప్పులను గుర్తించి, వాటికనుగుణంగా ముందుకు సాగేవాడు ఎక్కడైనా రాణిస్తాడన్నది ఆయన మాటల్లోని భావం). కానీ అందుకు పూర్తి విరుద్ధంగా సత్యవణి మాత్రం అబద్దాలు ఆడుతూ అసత్యవాణిగా ముందుకుసాగుతున్నది.
పోలీసులకు కూడా భూపందేరాలు చేసినట్లు ఆమెపై అభియోగాలున్నాయి.
సాక్షాత్తూ దేవుడి బిడ్డనని చెప్పుకునే గొట్టిపాటి సత్యవాణి భూ దందాపై అనేక ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే నాధుడే లేడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ స్థలాలను తప్పుడు సర్వే నంబర్లతో అమాయకులకు అమ్మి మోసం చేస్తున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
వ్యవసాయం ముసుగులో అక్రమంగా నీటి వ్యాపారాన్ని సైతం సత్యవాణి కొనసాగిస్తున్నారు. పంటల సాగు కోసమనే వంక చూపుతూ లెక్కకు మించిన బోర్లు వేసి ఆ నీళ్ళతో వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు బోర్లు వుండడంతో అక్కడే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసింది. దీని ద్వారా దాదాపు 10 లక్షల రూపాయల వ్యాపారం జరుగుతోంది.
తాను ఆక్రమించిన స్థలాలను క్రమబద్ధీకరించాలంటూ రంగారెడ్డి జిల్లా కలక్టరేట్ కు ఆమె పెట్టుకున్న దరఖాస్తే ఆమె ప్రభుత్వ భూమిని ఆక్రమించిందనే దానికి ఉదాహరణ.
ధర్మపురి క్షేత్రంలోని గుడులన్నీ దాతలు కట్టించినవే, సత్యవాణి కేవలం విజయదుర్గాదేవి ఆలయం మాత్రమే కట్టించింది. పూర్వం తెలంగాణ ప్రజలు కట్టుకున్న దుర్గాదేవి ఆలయాన్ని పూర్తిగా మాయం చేసే కుట్రలో భాగం గానే హంగులతో చిన్నపాటి విజయదుర్గాదేవి ఆలయాన్ని నిర్మించింది.
అక్కడి వ్యవహారాలన్నీ యూసుఫ్ గూడాలోని అపార్ట్ మెంట్ లోని తన నివాసం నుంచి నడిపిస్తారని ఈ వ్యవహారాలు తెలిసినవారు చెబుతున్నారు