mt_logo

సన్నబియ్యం పంపిణీపై విద్యార్థులు, తల్లిదండ్రుల హర్షం..

హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నాలుగులక్షలమంది విద్యార్థులు కడుపునిండా అన్నం తింటున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ముక్కిపోయిన అన్నం తింటూ ఎన్నో అవస్థల పాలైన విద్యార్థులకు టీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యమైన భోజనం అందించడం పట్ల వారి తల్లిదండ్రుల్లో సంతోషం వెల్లువెత్తుతోంది.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో 1500 నుండి 1800 హాస్టళ్లు ఉండగా మరో 230 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి. వీటన్నింటిలో సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గతంలో సమైక్య పాలనలో హాస్టల్ విద్యార్థుల కోసం సుమారు 70-80 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు తెలంగాణ సర్కారు సన్నబియ్యం కోసం చేసే ఖర్చు సుమారు 500 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా.

గత పాలకులు విద్యార్థుల ఆకలికేకలు ఏనాడూ పట్టించుకోకపోగా ఆందోళన చేసిన విద్యార్థులను, విద్యార్థి సంఘాల నేతలను లాఠీలతో కొట్టించారు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా విద్యార్థుల కష్టాలను దగ్గరనుండి గమనించిన టీఆర్ఎస్ నాయకులు ఎంత ఖర్చైనా హాస్టల్ విద్యార్థుల సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకు పోతున్నారు.

హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పెట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ లోని సంక్షేమ హాస్టళ్లు, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు శుక్రవారం ఆర్ధిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సన్నబియ్యం అన్నం పెట్టి విద్యార్థుల ఆకలి తీర్చినందుకు తనకు సంతోషంగా ఉందని, తాను కూడా సంక్షేమ హాస్టళ్లలో ఉండే వచ్చానని, అక్కడి పరిస్థితులు పూర్తిగా తెలుసని అన్నారు. ఈ పథకం కోసం ఎంత ఖర్చయినా సరే భరిస్తామని, వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *