mt_logo

ఇందిరాపార్కులో సంపూర్ణ తెలంగాణ దీక్ష రేపే – కోదండరాం

జనవరి 7 న ఇందిరాపార్కులో జరిగే సంపూర్ణ తెలంగాణ దీక్షకు టీజేఏసీ లోని రాజకీయ పార్టీల నేతలతోపాటు, తెలంగాణ ప్రాంతాల ప్రజాప్రతినిధులు అందరూ హాజరుకావాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. పూర్తి హక్కులతో కూడిన తెలంగాణ మాత్రమే కావాలని, అందుకు సంబంధించిన 13 సవరణలు ప్రతిపాదిస్తూ, డిల్లీ స్థాయిలో వినిపించేందుకు సర్వం సిద్ధమైంది. మిగతా 28రాష్ట్రాలకు ఉన్న నిబంధనలే 29వ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికికూడా వర్తించాలని ఈ సందర్భంగా కోదండరాం కోరనున్నారు.

జేఏసీలోని 33 భాగస్వామ్య సంఘాల సభ్యులు ఈ దీక్షను ముందుకు తీసుకుపోనున్నారు. వేల సంఖ్యలో ప్రజలు ఈ దీక్షకు రానున్నట్లు టీ జేఏసీ తెలిపింది. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం, రాయల వర్గం నేతలు తదితరులు ఈ దీక్షలో అధిక సంఖ్యలో పాల్గోనున్నారు.

మంగళవారం జరగనున్న ఈ దీక్షలో పది జిల్లాల తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు పూర్తి హక్కులు ఉండాలని, గవర్నర్ కు ఎలాంటి హక్కులు ఉండొద్దని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ రెండేళ్ళే సాగాలని, రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు ఏర్పాటు చేయాలని కోరుతామని టీ జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని, అక్రమంగా తెలంగాణలో ఉద్యోగం సంపాదించి పదవీ విరమణ పొందిన సీమాంధ్ర ఉద్యోగులు సీమాంధ్ర ప్రాంతం నుండే పెన్షన్ పొందాలని టీ జేఏసీ ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *