mt_logo

సోమవారం తెలంగాణపై చర్చ లేకుంటే ఇలా చేస్తాం:హరీష్ రావు

ఆదివారంనాడు కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 13 ఏళ్ళ కేసీఆర్ ఉద్యమం, తెలంగాణ అమరుల బలిదానాలే తెలంగాణ బిల్లు అని అన్నారు. శాసనసభలో రాష్ట్ర విభజన బిల్లుపై సీమాంధ్ర నేతలు చర్చ నడవనివ్వకపోతే, బిల్లుకు మద్దతుగా రాత పూర్వక పత్రాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం స్పీకర్ కు అందచేస్తామని తెలిపారు. అందులో సవరణలు కూడా పొందుపరుస్తామని వివరించారు. 11 రోజులుగా సభలో చర్చ జరగనీకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న సీమాంధ్ర నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ ప్రాంతానికే తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం, సీమాంధ్ర నేతలు విలేకరుల సమావేశాలలో మొసలికన్నీరు కార్చారని, ఇప్పుడు బిల్లుపై చర్చ జరిపి తెలంగాణకు జరిగే అన్యాయాలపై ఎందుకు మాట్లాడడంలేదో తెలపాలన్నారు.

ఈనెల 23 తర్వాత బిల్లు అసెంబ్లీ పరిధి దాటి పార్లమెంటుకు చేరుకుంటుందని, ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ పై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని, కాని పక్షంలో సీమాంధ్ర నాయకులపై కూడా కేసులు పెట్టాలని హెచ్చరించారు. తెలంగాణ ఇస్తే రైలు పట్టాలు పేల్చివేస్తానన్న ఎంపీ వేణుగోపాల్ రెడ్డి, మానవ బాంబు నవుతానన్న పయ్యావుల కేశవ్, ప్రైవేట్ సైన్యం తయారు చేస్తామన్న టీజీ వెంకటేష్ లపై కేసులు పెట్టాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *