వరంగల్ జిల్లా చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం తమకు లేదని, ఎవరైనా పొత్తులగురించి తప్పుగా ప్రచారం చేస్తే ఊరుకోమని టీ టీడీపీ నేతలను కిషన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.
గుజరాత్ లో జరిగిన అల్లర్లకు నరెంద్రమోడీని బాధ్యుడ్ని చేస్తూ, హైదరాబాద్ వస్తే మోడీని అరెస్ట్ చేస్తామని, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రాత్మక తప్పిదంగా వక్రీకరించిన చంద్రబాబుతో తామెలా పొత్తు పెట్టుకుంటామని ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ జెండా ఎక్కడ ఉంటుందో, ఏ పార్టీ మాయమవుతుందో, ఏ పార్టీ ఏ పార్టీతో విలీనమవుతుందో స్పష్టమవుతుందన్నారు. తెలంగాణ బిల్లు ఈనెల 23 తర్వాత అసెంబ్లీ నుండి పార్లమెంటుకు చేరుకుంటుందని, బీజేపీ పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చించి ఆమోదం తెలుపుతుందన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, వేలమంది అమరవీరుల బలిదానాలను వృధా కానివ్వమని, తెలంగాణ వచ్చి తీరుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి అని, హైదరాబాద్ ను పదేళ్ళు ఉమ్మడి రాజదానిగా ఒప్పుకోమని అన్నారు.