mt_logo

భూముల కొనుగోళ్ళలో సమైక్యాంధ్ర నేతలు బిజీబిజీ!

ఫొటో: ఒంగోలు శివార్లలో కొత్తగా వెలిసిన ఒక వెంచర్

సీమాంధ్రలో ప్రజలను ఉద్యమాలకు ఉసిగొల్పుతున్న నేతలే గుట్టుచప్పుడు కాకుండా పెద్దయెత్తున భూముల కొనుగోళ్లకు దిగుతున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తధ్యమని కాంగ్రెస్ అధిష్టానం కొంతకాలం క్రితమే సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులకు చెప్పేసింది. అదిమొదలు ఆయా ప్రముఖులు తమ వ్యాపారాభివృద్ధికి రియల్ ఎస్టేట్ ప్రణాళికలు వేసుకోవడంతోపాటు రాజధాని నగరం ఏ ప్రాంతంలో రావచ్చో అంచనాలు వేసుకుని అనుచరులతో ఆ ప్రాంతాల్లో భూముల అన్వేషణ చేయించారు. గిట్టుబాటు అయ్యే చోట్ల భారీఎత్తున కొనుగోళ్ళు కూడా మొదలుపెట్టారు. కానీ ఎవరికీ అనుమానం రాకుండా ఒకవైపు రాజీనామా డ్రామాలు, మరోవైపు ప్రజలను ఉద్యమాలవైపు నడిపిస్తున్నారు.

సీమాంధ్రకు కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య లేదా ఒంగోలు సమీపంలో నిర్మాణం జరుగుతుందనే ప్రచారం వుండడంతో పలువురు ప్రజాప్రతినిధులు గుంటూరు, ఒంగోలు, కనిగిరి, పొదిలి, మార్కాపురం చుట్టుపక్కల భారీఎత్తున భూములు కొనుగోలు చేస్తున్నారు. అదే విధంగా విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళే మార్గంలో హనుమాన్ జంక్షన్, నూజివీడు,అగిరిపల్లి చుట్టుపక్కల సైతం భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

గుంటూరు-విజయవాడ మార్గంలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక మాజీ టీడీపీ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి కలిసి సుమారు 300 ఎకరాలకు పైగా కొనుగోలు చేయడం గమనార్హం.

అట్లాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు ఒకరు గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుండి వినుకొండకు వెళ్ళే మార్గంలో 800 ఎకరాలకు పైగా కొనుగోలు చేసినట్లు సమాచారం.

చోటా మోటా నాయకులు కూడా భూముల కొనుగోలుపైనే దృష్టి సారిస్తున్నారు. విజయవాడ నుంచి నందిగామ వరకు కూడా రియల్ ఎస్టేట్ బూం విపరీతంగా పెరిగిపోఇంది.

సీమాంధ్ర సమ్మె నేపధ్యంలో అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులు నిలిచిపోయాయి. దీన్ని గమనించిన పెట్టుబడిదారులు తెలంగాణలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీమాంధ్ర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.

నేతలు భూముల దందాతో జేబులునింపుకోవడంలో బిజీగా ఉండగా, ఈ సంగతి తెలవని సామాన్యులు మాత్రం తెలంగాణకు వ్యతిరేకంగా సమ్మెలు, ఆందోళనల్లో పాల్గొని బకరాలు అవుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *