mt_logo

భూములిచ్చిన రైతులకు పాదాభివందనం : మంత్రి కేటీఆర్

రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ప్రాజెక్టుల‌కు భూములిచ్చిన రైతులంద‌రికీ పాదాభివంద‌నాలు చేస్తున్నాన‌ని ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటు చేస్తున్న కిటెక్స్ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు భూమిపూజ చేసిన సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌సంగించారు. కిటెక్స్ టెక్స్ టైల్స్ ప‌రిశ్ర‌మ‌తో ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలోని వేలాది మందికి ఉపాధి అవ‌కాశాలు రాబోతున్నాయ‌ని తెలిపారు. రైతులు క‌ష్ట‌మైనా, న‌ష్ట‌మైనా ఓర్చుకొని ఇబ్బందైనా త‌ట్టుకొని భూములు ఇచ్చిన వారంద‌రికీ పేరుపేరునా పాదాభివంద‌నాలు చేస్తున్నాను అని తెలిపారు. ప్రాజెక్టుల‌కు భూములు ఇచ్చే రైతుల త్యాగాలు వెల‌క‌ట్ట‌లేనివని, వాళ్ల‌కు మ‌నం ఎంత చేసినా త‌క్కువ‌ని, రుణం తీర‌దు. పెద్ద మ‌న‌సుతో భూములు ఇచ్చిన రైతులంద‌రికీ 100 గ‌జాల చొప్పున ప్లాట్లు ఇవ్వాల‌ని చెప్పారు. క‌చ్చితంగా ఇస్తామ‌ని మాటిస్తున్నాన‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో పారిశ్రామికీక‌ర‌ణ వేగంగా జ‌ర‌గాల‌న్నారు.

ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ పిల్ల‌ల దుస్తులు త‌యారు చేసే సంస్థ కిటెక్స్ అని చెప్పారు. ఈ ప‌రిశ్రమ నుంచి ఉత్ప‌త్తి చేసిన బ‌ట్ట‌ల‌ను దేశ‌విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్నారు. కిటెక్స్ సంస్థ రూ. 3 వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆలోచ‌న చేసిన‌ప్పుడు వారిని తెలంగాణ‌కు ఆక‌ర్షించ‌డానికి ఎంతో ప్ర‌య‌త్నం చేసి తీసుకొచ్చాం. మీరు ఇక్క‌డ పెడితేనే వ‌రంగ‌ల్ బిడ్డ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పి కిటెక్స్ సంస్థ‌ను ఏర్పాటు చేస్తున్నాం. రూ.1600 కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌బోతోంది. 15 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. కొరియాకు చెందిన యంగ్ వ‌న్ అనే కంపెనీ రూ. 1100 కోట్ల‌తో పెట్టుబ‌డులు పెట్ట‌బోతున్నారు. 12 వేల మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు. ఈ రెండు కంపెనీలు కూడా 8 నుంచి 11 ఫ్యాక్ట‌రీలు పెట్ట‌బోతున్నారు. రాబోయే 18 నెల‌ల్లో ప‌నుల‌న్నీ పూర్త‌వుతాయి. భార‌త‌దేశంలో ఇలాంటి టెక్స్ టైల్స్ పార్కు ఎక్క‌డా లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *