mt_logo

శకుని లోకకళ్యాణం కోరతాడా?

By: సవాల్‌రెడ్డి

మాయాదర్పణం ముందు నిలబెడితే శకునికి లోకకళ్యాణం కనిపించదు. అబద్ధాలకోరుకు హరిశ్చంద్రుడు కనిపించడు. వక్రదృష్టి కలవాడికి రుజుమార్గం కనిపించదు. ఆంధ్రజ్యోతికి, దాని అధిపతి రాధాకృష్ణకు తెలంగాణ విషయంలో ఎప్పుడూ మంచి కనిపించదు. మంచి వినిపించదు. హుస్సేన్‌సాగర్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలొకటి, ఆంధ్రజ్యోతి రాసిందొకటి. హుస్సేన్‌సాగర్‌ను ఖాళీ చేయడంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తే, అబద్ధాలకు అలవాటైన ఆంధ్రా జ్యోతి యథావిధిగా సుప్రీంకోర్టు హుస్సేన్‌సాగర్‌ను ఎండగొట్టొద్దు అని ఆదేశించినట్టుగా రాసింది. అంతేకాదు హుస్సేన్‌సాగర్‌లో ఏం జరుగుతున్నదో చూసిరావడానికి వెళ్లాలని గ్రీన్ ట్రిబ్యునల్ నిపుణులను ఆదేశించింది.

ఇవేవీ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఆదేశాలు కాదు. కోతికి కొబ్బరికాయ దొరికితే ఎగురుతుంది. ఆంధ్రజ్యోతికి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ దొరకకపోయినా ఎగురుతుంది. ఆ పత్రికకు తెలంగాణలో ప్రతిదీ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ ప్రశాంతంగా ఉంటే రాధాకృష్ణకు పూనకం వస్తుంది. తెలంగాణకు సమస్యలు లేకపోతే ఆయన కుతకుత ఉడికిపోతాడు. అన్నీ తలకిందులుగా, వంకరగా కనిపించే అసాధారణ చిత్తభ్రాంతి ఏదో ఆయనను వెంటాడుతున్నది. అందుకే రాధాకృష్ణ తెలంగాణ విషయంలో ఏ మంచినీ భరించలేకపోతున్నాడు. ఇక్కడ రుణమాఫీ జరిగితే.. మిగులు బడ్జెట్ కదా అని ఏడుస్తాడు. ఇక్కడ రెండు లక్షల ఇండ్లు నిర్మించి ఇస్తామంటే డబ్బులెక్కడివి అంటాడు. కొత్త సచివాలయమంటే గుండెలు బాదుకుంటాడు. ఆకాశహర్మ్యాలు అంటే గాలిలో మేడలు అంటాడు.

అవి ఎలా సాధ్యం కావో కథనాల మీద కథనాలు వండి వార్చుతాడు. ఇవాళ రాధాకృష్ణ తెలంగాణ మీద ద్వేషంతో అన్ని హద్దులూ చెరిపేశాడు. బరితెగించేశాడు. న భయం న లజ్జ. ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలకే వక్రభాష్యం పలికాడు. కోర్టు ఇవ్వని ఆదేశాలను తన పత్రికలో, మీడియాలో రాసుకుని సంబరపడ్డాడు. తమ మీడియా పచ్చి అబద్ధాలకోరని తనకు తానే ఎలుగెత్తి చాటుకున్నాడు. ఇతర పత్రికల్లో వచ్చిన సదరు వార్త చూసి ముక్కున వేలేసుకోవడం పాఠకుల వంతైంది. సాంస్కృతిక సారథి మీద రాధాకృష్ణ జుగుప్సాకరమైన రాతలతో తనలోని అపరిచితుడిని బహిరంగ పరుచుకున్నాడు. రాధాకృష్ణ అబద్ధాలు అచ్చొత్తడం ఇది మొదలు కాదు. మొన్నటికి మొన్న రాధారాజారెడ్డి దంపతులకు రవీంద్రభారతిలో అనుమతి నిరాకరణ అంటూ గగ్గోలు పెట్టాడు. తెలంగాణ కళాకారులకు అన్యాయం అంటూ విషకథనాలు రాశాడు. ఖర్మగాలి.. ఆ దంపతులు లైవ్‌లోకే వచ్చి రాధాకృష్ణ వైఖరిని ఏకి పారేశారు. సరే తెలంగాణ వచ్చినప్పటినుంచి ఇలా ఎన్ని అబద్ధాల కథనాలు రాశాడో చెప్పడం చర్విత చరణమే అవుతుంది. ఏ ఒక్కటీ ఏనాడూ వాస్తవ రూపం దాల్చింది లేదు.

టార్గెట్ కేసీఆర్..
కేసీఆర్ మీద ఆయన కుమ్మరించిన విషానికి అంతే లేదు. మొన్నటికి మొన్న కొత్తపలుకులో రాధాకృష్ణ ఏడుపు వర్ణించనలవి గాదు. ఆయన దృష్టిలో కేసీఆర్ బస్తీల పర్యటన కేవలం ప్రజలను భ్రమల్లో ముంచేయడానికే. కేసీఆర్ ఎత్తుగడలను ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేకపోతున్నాయని వారి తరఫున తానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రతిపక్షాలు కేసీఆర్ వలలో పడడంతో కేసీఆర్‌కు రాజకీయ లబ్ధి చేకూరుతుందని బాధ పడ్డాడు. అలా వలలో చిక్కుతున్న వాళ్లు నిన్నా మొన్నా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు కాదు. ఘటనాఘటన సమర్థులైన కాంగ్రెస్ నాయకులు. తిమ్మిని బమ్మిని చేసే మీడియా అండ ఉన్న టీడీపీ నాయకులు. వీళ్లు నోట్లో వేలేసుకున్న వాళ్లుగా రాధాకృష్ణకు కనిపిస్తున్నారు. సరే వారి ఖర్మకు వాళ్లని వదిలేద్దాం. ఇక రాధాకృష్ణ మరో ఆరోపణ ఏమిటంటే కేసీఆర్ అనేక పథకాలు ప్రకటిస్తారు తప్ప ఆచరణకు రావట.

అలా ప్రకటన ఇచ్చి వివాదం చేసి వదిలేయడం కేసీఆర్ జాణతనమట. కొత్త సచివాలయం ప్రతిపాదన ఉత్తుత్తిదేనట. మరి సదరు సచివాలయం కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వడం కూడా ఉత్తుత్తిదేనా? చెస్ట్ హాస్పిటల్ స్థలాన్ని బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఉత్తుత్తివేనా? హైకోర్టులో సచివాలయ నిర్మాణానికి అనుకూలంగా వాదించడం ఉత్తుత్తిదేనా? అసలు రూ.150 కోట్లు నిధులే ఇచ్చినపుడు కొత్త భవనాలు కట్టడం కష్టమా? అనేది రాధాకృష్ణ విజ్ఞతకే వదిలేయాలి. పోనీ రాధాకృష్ణకు ఉత్తుత్తిగా కనిపించి ఉందనుకుందాం. మరి పాత సచివాలయం ఎంత పవిత్ర ప్రదేశమో.. దాన్ని తరలిస్తే రాష్ట్రానికి, దేశానికి, వీలైతే ప్రపంచానికి ఎంత నష్టం వాటిల్లుతుందో చిలవలు పలువలు చేస్తూ చంద్రజ్యోతి నిండా పుంఖానుపుంఖాలు కథనాలు ఎందుకు వడ్డించినట్టు? ఉత్తుత్తిదే అయినపుడు అయ్యేదా పొయ్యేదా అని ఊరుకోవచ్చు కదా. ఇదే మాటను మిత్రుడు చంద్రబాబుకు చెప్పి టీడీపీ నాయకులకు ఆయాసం తప్పించి ఉండవచ్చు కదా! పోసే నిప్పులన్నీ పోసి ఇపుడు నంగనాచి మాటలు!

ఇండ్లపై నిప్పులు..
ఇక ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఆయన రాసిన రాతలు మరీ విచిత్రం. ఆయన రాతలు చదివిన వారు కొంపదీసి రాజధానిలోని పేదల ఇండ్లన్నీ ఉస్మానియాలోనే కడుతున్నారా? అనే అనుమానానికి రాక తప్పదు. ఎందుకంటే ఉస్మానియాలో ఇండ్లు అని కేసీఆర్ కావాలనే ప్రకటన చేసి వివాదం రేపారని, తర్వాత ప్రతిపక్షాలు అడ్డు చెబుతున్నాయంటూ ఇండ్ల నిర్మాణాలన్నీ ఆపేస్తారని భవిష్యవాణి అనుగ్రహించారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఒక్క పార్సీగుట్ట పేదలకు మాత్రమే ఉస్మానియాలో ఇండ్లు కడతామని కేసీఆర్ చెప్పారు.

అదికూడా సదరు బస్తీలో ఎక్కడా అంగుళం జాగా లేకపోవడం వల్ల. ఉస్మానియా ఆ పక్కనే ఉండడం వల్ల. నిజానికి కేసీఆర్ అనేక బస్తీల్లో ఇండ్ల నిర్మాణాలకు హామీ ఇచ్చారు. కొన్ని చోట్ల అక్కడే స్థలం ఉంది. మరికొన్నిచోట్ల ఇతర ప్రదేశాల్లో చూస్తున్నారు. హమాలీ బస్తీలో అక్కడే స్థలం ఉంది. అక్కడే కడతామని చెప్పారు. ఖైరతాబాద్‌లోనూ బస్తీలో స్థలం ఉంది అక్కడే కడతామన్నారు కానీ ఉస్మానియాకు తీసుకుపోతాననలేదు. అలాగే మొత్తం రెండు లక్షల ఇండ్లు బంజారాహిల్స్‌లో కట్టిస్తామని కేసీఆర్ అనలేదు. ఎక్కడి బస్తీలో అక్కడే పేదలకు ఇండ్లు కడతాం.. బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో కూడా బస్తీ పేదలకు అక్కడే ఇండ్లు కడతామని అన్నారు. కేసీఆర్ అనని మాటలు నోట్లో దూర్చడం సీమాంధ్ర మీడియాకు ఇది కొత్తకాదు.

నాలుక తిప్పేసి..
ఇక నిన్నటిదాకా తెలంగాణకు మిగులు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న రాధాకృష్ణ ఇవాళ ఇండ్ల విషయానికి వచ్చేసరికి డబ్బులెక్కడున్నాయి? అంటూ దబాయిస్తున్నాడు. రూ. 20 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రభుత్వానికి రెండు లక్షల ఇండ్లకు నిధులు సమకూర్చుకోవడం అసాధ్యమా? విద్యుత్ విషయంలోనూ ఇలాగే అవహేళనలు చేసిన వారున్నారు. కానీ విద్యుదుత్పత్తికి లక్ష కోట్లు, మిషన్ కాకతీయకు, వాటర్ గ్రిడ్ పథకానికి వేల కోట్లు సమకూర్చుకున్న అనుభవం కండ్ల ముందరే ఉంది. ప్రభుత్వం ఎలాంటి ఇండ్లు కట్టగలదో ఐడీహెచ్ కాలనీ సజీవ సాక్ష్యంగా కూడా సిద్ధంగా ఉంది.

అసలు విషయం జీహెచ్‌ఎంసీ..
అన్నీ అయ్యాక ఆఖరుకు అసలు విషం కక్కేశాడు రాధాకృష్ణ. కేసీఆర్ ఇదంతా కేవలం జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం చేస్తున్నారట. అందుకే మోదీ స్వచ్ఛ భారత్ అన్నపుడు పట్టించుకోకుండా ఇపుడు రంగంలోకి దిగారట. ఇంకా చాలా చాలా రాశారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన తొలి సమీక్షా సమావేశం హైదరాబాద్ నగరంపైననే అనే విషయం రాధాకృష్ణ మరిచిపోయి ఉండవచ్చు. వర్షాకాలం వస్తున్నందున వర్షపునీటి సమస్య, ట్రాఫిక్ సమస్యలపై కేసీఆర్ సుదీర్ఘ సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం వెల్లడించింది కూడా అపుడే. అపుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు లేవు. అసలు పాత పాలకవర్గం పదవీకాలం కూడా పూర్తి కాలేదు. ఎంఐఎం ఆధ్వర్యంలో పాలకవర్గం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ అభివృద్ధిపై ఆ తర్వాత అనేక ప్రణాళికలను ప్రకటిస్తూ వచ్చారు.

నగరంలో పోలీస్ వ్యవస్థ పటిష్టం.. లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు, జీపీఎస్ వ్యవస్థ కలిగిన వాహనాల పంపిణీ, కమాండ్ కంట్రోల్ రూం ప్రతిపాదన అన్నీ ఆ కార్యక్రమంలో భాగంగా వస్తున్నవే. సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ కావచ్చు.. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన కావచ్చు.. ఆ జలాశయం వద్ద ఆకాశహర్మ్యాల నిర్మాణం కావచ్చు.. మెట్రో విస్తరణ కావచ్చు! ఇవన్నీ పాత పాలకవర్గం ఉన్నకాలంలోనే జరిగాయి. గురుకుల్ భూముల ఆక్రమణల తొలగింపుకూడా అపుడే జరిగింది. ఆక్రమణల కూల్చివేతలు ఆపాలని పాలకవర్గం తీర్మానించింది కూడా. ఆ క్రమంలోనే మూసీ వెంట పార్కుల నిర్మాణం కోసం విహంగ వీక్షణ, మోండా మార్కెట్ సందర్శన, రవీంద్రభారతికి నూతన భవనం, కళాభారతి భవనం, ఉస్మానియా దవాఖానలో జంట టవర్ల ప్రతిపాదన.. ఇలా అనేక పథకాలు పరంపరగా చర్చిస్తూనే వస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, ఐడీహెచ్‌లో ఇండ్ల నిర్మాణాలు కొలిక్కి వచ్చి, ప్రజల్లో ప్రభుత్వం మీద భరోసా కలిగిన తర్వాతే సీఎం బస్తీల పర్యటనలు చేపట్టారు. కానీ రాధాకృష్ణకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టి కేసీఆర్ పర్యటించినట్టుగా కనిపిస్తున్నది.

శవం చెవిలో రామరామ..
సరే సీఎం పర్యటిస్తున్నారు. హామీలు ఇస్తున్నారు. రూ.200 కోట్లు వ్యయం చేసి అనేక తక్షణ సమస్యలు పరిష్కరిస్తున్నారు. రాధాకృష్ణకు నొప్పేమిటి? అక్కడే ఉంది కీలకం. రాష్ట్రంలో టీడీపీ పాడెమీద ఉంది. శవం తరలించే సమయంలో అక్కడక్కడా కిందికి దింపి చెవిలో రామరామ చెప్తారు. ఏమో చనిపోయిన వాడు గొంతుకలిపి లేస్తాడన్న ఆశ! ఇపుడు రాధాకృష్ణ గ్యాంగుకు సదరు ఆశ జీహెచ్‌ఎంసీ రూపంలో ఉంది. ఈ ఎన్నికల్లో నగరంలోని సీమాంధ్రుల ఓట్లతో టీడీపీ లేచి నిలుచుంటుందని బాబు పరివారం గాఢంగా నమ్ముతున్నది.

ఇక్కడ ఊపిరి పోసుకుంటే దీన్ని షో చేసి తెలంగాణలో విజృంభించాలనేది వారి ఎత్తుగడ. నగరంలో టీఆర్‌ఎస్‌కు పునాది లేదని వారు గాఢంగా విశ్వసిస్తున్నారు. కానీ కేసీఆర్ పర్యటనలు పరిస్థితిని తారుమారు చేస్తున్నాయి. అందుకే రాధాకృష్ణ ఠారెత్తిపోతున్నాడు. ఎందుకంటే తెలంగాణలో టీడీపీకి ఇది చివరి అవకాశం. ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకోకపోతే తెలంగాణలో ఈ పార్టీలో ఇక ఎవరూ మిగలరు. అందుకే కేసీఆర్ దూసుకుపోతున్న తీరు బస్తీల్లో ఆయనకు లభిస్తున్న ఆదరణ రాధాకృష్ణ కంటిమీద నిద్ర లేకుండా చేస్తున్నది. మరుండవన్ కణ్ణుక్కు.. ఇరుండ దెల్లామ్ పేయ్ అని తమిళంలో ఓ సామెత ఉంది. అంటే ధైర్యం లేనివాడికి అన్నీ దయ్యంలాగే కనబడతాయి. ఇపుడు రాధాకృష్ణది అదే పరిస్థితి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *