mt_logo

చెరువు శిఖాలు కబ్జా చేయకుండా త్వరలో బిల్లు- హరీష్ రావు

గత సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల చట్టాలున్నా అమలుచేయని దుస్థితిలో నేడు చెరువు శిఖాలు కబ్జాకు గురయ్యాయని, కాకతీయుల హయాంలో గొప్ప వెలుగు వెలిగిన చెరువులు, కుంటలు కనుమరుగయ్యాయని నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వరంగల్ లో భద్రకాళి చెరువు కట్ట మరమ్మతు పనులను మంత్రి ప్రారంభించిన అనంతరం వరంగల్ కలెక్టరేట్ లో దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చెరువు శిఖం భూములు మింగేవారికి ఇక జైలే గతని, అటవీ చట్టాలకంటే కఠినమైన చట్టాలు తేబోతున్నామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

చెరువులు, కుంటలు కనుమరుగు కాకుండా శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని, గోదావరిపై ఏటూరు నాగారం మండలంలో కంతెనపల్లి ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ముంపు తగ్గించే ఆలోచన ఉందని తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ మండలంలో 13 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించడం ద్వారా దేవాదుల మొదటి, రెండో దశకు నీరు ఇవ్వడమే కాకుండా ఆయకట్టుకు నీరివ్వచ్చని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన హరీష్ రావు వెంటనే డీపీఆర్ తయారుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం మిషన్ కాకతీయలో భాగంగా హరీష్ రావు వరంగల్ జిల్లా హసన్ పర్తిలోని పెద్ద చెరువులో రూ. 72 లక్షల వ్యయంతో చేపట్టిన చెరువు పునరుద్ధరణ పనులను, హన్మకొండ మండలం గోపాల్ పూర్ చెరువు పనులను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చెరువులపై ఆధారపడిన రైతులు, కులవృత్తులకు ఉపాథి కల్పించేందుకు సీఎం కేసీఆర్ చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారని, వచ్చే ఏడాదిలో హసన్ పర్తి చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చేందుకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *