mt_logo

సంక్షేమం, అభివృద్ధి మా ప్రాథమ్యాలు

-తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు స్పష్టత ఉంది
-సమస్య మూలాలనుంచి పరిష్కారానికి కృషిచేస్తున్నారు
-హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుంది
-మండుటెండల్లో కోతల్లేని కరెంటు మా విజయం
-కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి
-పరిపాలించే దమ్ములేకనే చంద్రబాబు విమర్శలు
-ఉనికి కోసమే రాహుల్‌గాంధీ పాదయాత్ర
-అమెరికా పర్యటన తర్వాత మీడియాతో మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఏడాదిపాటు ప్రజాసంక్షేమ పాలన అందించిన తెలంగాణ ప్రభుత్వం రాబోయే కాలంలోనూ ఇదే విధంగా ప్రజలకోసం పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వ ప్రాథమ్యాలని, వీటిని జోడుగుర్రాల్లా ముందుకు తీసుకుపోతామని తెలిపారు. ముఖ్యమంత్రికి అన్ని అంశాలపై సరైన స్పష్టత ఉందని, ఆ మేరకు సమస్య మూలాలనుంచి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని వచ్చిన మంత్రి కేటీఆర్‌ను మంగళవారం పలువురు మీడియా ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన స్పందించారు. ఇవీ ఆ వివరాలు..

తెలంగాణ ఉద్యమ సారథిగా ఉన్న కేసీఆర్‌కు అధికార పగ్గాలు అప్పగించారు. ఏడాది టీఆర్‌ఎస్ పాలనకు ఎన్ని మార్కులు వేసుకుంటారు?

మా ప్రభుత్వం గురించి మేం చెప్పుకోవడం సరికాదు. అయితే ఏడాది పరిపాలన బాగుంది. ఇంకా బాగుండే పాలన అందించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పినట్లు మా ప్రభుత్వం ప్రాథమ్యాలు సంక్షేమం, అభివృద్ధి. వీటిని జోడుగుర్రాల్లా ముందుకు తీసుకువెళతాం. తొలి ఏడాదిలో తెలంగాణ సర్కారు సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చింది. దేశంలో ఏ సర్కారూ చేయని విధంగా అట్టడుగువర్గాల అభివృద్ధికి పాటుపడ్డాం. మా పరిపాలనపై ప్రజలే నిర్ణేతలు. ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చామో వాటిని తప్పకుండా నెరవేరుస్తాం. మా ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే.. నేలవిడిచి సాముచేయడం మా ఉద్దేశం కాదు. తెలంగాణ అమెరికా కావాలని, లేదా సింగపూర్ కావాలని, జపాన్‌లా మారిపోవాలని మేం అనుకోవడం లేదు. మా ముఖ్యమంత్రికి తెలంగాణ సమస్యలపై స్పష్టత ఉంది. వాటిని పరిష్కరిస్తూ తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆయనకు తెలుసు.

తెలంగాణలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది?

కరెంటు సమస్య తెలంగాణకు వారసత్వంగా వస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పడితే ఎన్నో కష్టాలుంటాయని చెప్పారు. ఆయన హయాంలోనే ఇందిరాపార్కు వేదికగా పారిశ్రామికవేత్తలు ధర్నా చేపట్టారు. కానీ గురివింద గింజ రీతిలో ఆయన దాన్ని కప్పిపెట్టి మాట్లాడారు. అయితే తెలంగాణ ప్రభుత్వం సమస్యను గుర్తించి, 23,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తికి రూ.94,000 కోట్లతో ప్రణాళికలు సిద్ధంచేసింది. థర్మల్, సోలార్, హైడ్రో పవర్ ఉత్పత్తిని అందుబాటులోకి తెస్తున్నది. మీడియా చెప్తున్నట్లు ఈసారి అత్యంత భారీస్థాయిలో ఎండలున్నా.. కరెంటు కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నాం. ఇదెవరూ ఊహించని విజయం. ఇంటింటికీ నల్లా నీరు అందించాలనేది మా ఎన్నికల మ్యానిఫెస్టోలో లేదు. కానీ మేం చేపట్టాం. మిషన్ కాకతీయను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముందుకువెళుతున్నాం. 45,600 చెరువులను పునరుద్ధరించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఈ చర్యతో 260 టీఎంసీల నీరు నిల్వ అవుతుంది. ఈ సామర్థ్యం నాగార్జునసాగర్ డ్యాంతో సమానమైనది.

డ్రింకింగ్ వాటర్ గ్రిడ్‌పై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు కదా?

హిందీలో ఓ సామెత ఉంది. మంచి పనులు చేసేవారు చేస్తుంటే.. ఓర్వలేని వారు మాట్లాడుతూ ఉంటారు. అధికారం అండతో దోచుకోవడం కాంగ్రెస్ వారికే సాధ్యం అయింది. వాళ్ల హయాంలో సీఎంలు, పీఎంలపై నిందితులుగా కేసులు నమోదయ్యాయి. అలానే అనుకుంటున్నట్లుంది. కాంగ్రెస్‌లా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి, తిరిగి పర్సెంటేజీల రూపంలో మా సర్కారు తీసుకోలేదు. కాంట్రాక్టర్లే ధర నిర్ణయించే ఈపీసీ విధానాన్ని మేం వ్యతిరేకించి, మా ఇంజినీర్లద్వారా ప్రతిపాదనలు రూపొందించాం. మరింత పారదర్శకతకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థతో చెక్ చేయించాం. పట్టిసీమ ప్రాజెక్టువలే 25శాతం టెండర్లు మా దగ్గర పడలేదు. మేం ప్రతిపాదించిన దానికంటే తక్కువ ధరకే టెండర్లు పడ్డాయి.

ఏడాదైనా ఉద్యోగాల భర్తీ కాలేదని నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉంది కదా!

నిరుద్యోగుల్లో అసంతృప్తి ప్రభుత్వానికి తెలుసు. 9 నిమిషాల్లో చేయాల్సిన ఐఏఎస్‌ల విభజన 9 నెలలు పట్టింది. ఉద్యోగుల విభజన ఇంకా సాగుతున్నది. జిల్లా, ఇతరత్రా పోస్టుల భర్తీ త్వరలో ప్రారంభిస్తాం. ముఖ్యమంత్రి చెప్పినట్లు.. రాబోయే రెండేండ్లలో లక్షపైచిలుకు ఉద్యోగాలు భర్తీచేస్తాం. మరోవైపు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతున్నాం. స్వయం ఉపాధివైపు ప్రోత్సహించేలా మార్జిన్‌మనీ సైతం ప్రభుత్వమే చెల్లించేలా బడ్జెట్ కేటాయింపులు కూడా చేశాం.

రైతుల ఆత్మహత్యలు సాగుతున్నాయి కదా!

రైతుల ఆత్మహత్యలు బాధాకరం. ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నది. ఉచిత విద్యుత్, సరిపడా నీరు, పంటకు రుణాలు, కనీస మద్దతు ధర అందిస్తున్నాం. అయినా ఇంకా ఆత్మహత్యలు సాగడంపై అంతా ఆలోచించాలి. ఏండ్లుగా సాగుతున్న పరిస్థితులవల్లే ఈ పరిణామం. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌కు స్పష్టత ఉంది కాబట్టే వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టే దిశగా కసరత్తు చేస్తున్నారు. రాహుల్‌గాంధీకి ఏం పనిలేదు. అధికారం కూడా లేదు. ఏదో తిరిగిపోవాలనుకోని వచ్చిపోయారు. ఉనికి కాపాడుకోవడం కోసం ఆయన యాత్ర చేశారు.

ఇరు రాష్ట్రాల మధ్య తగవులు ఎందుకు?

మాకు గొడవ పెట్టుకోవాలనే ఆలోచన లేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, పరిపాలించే దమ్ములేకనే మాపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. విభజనవల్ల కొత్త విమానాశ్రయాలు కట్టుకునే సౌలభ్యం, కొత్త తరహాలో రాజధాని నిర్మించుకునే అవకాశం దొరికిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కానీ చంద్రబాబు విమర్శల్లో ఆనందం పొందుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఏడాది పాలన ఎలా ఉంది?

ఏడాదిలోనే అన్నీ జరగాలని కోరుకోవడం సరికాదు. అయితే సమస్యలు పరిష్కరించాలనే దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ కార్యాచరణ ఏదీ లేదు. అన్నిరాష్ట్రాలను ఒకేరీతిగా చూసే విధానాన్ని కేంద్రం అలవర్చుకోవాలి. అయితే అమెరికా పర్యటన సందర్భంగా మోదీ పాలన, మా ముఖ్యమంత్రి పనితీరు బాగుందని చెప్పాం. ఎందుకంటే సమస్యలను ఇక్కడే పరిష్కరించుకోవాలి తప్ప బయట రచ్చ చేయకూడదు అనేది మా విధానం.

పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ ప్రాంతాలది.. ఐటీ శాఖ పట్టణాలది.. రెంటినీ నిర్వహించడంలో ఎలా ఫీలవుతున్నారు?

సాంకేతికఫలాలను గ్రామీణులకు అందించాలనే దిశగా కృషిచేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ-పంచాయతీల పేరుతో పరిపాలన ప్రజల ముందుకు తెస్తున్నాం. గతంలోని ఈ-గవర్నెన్స్‌కు కాలం చెల్లింది. ఇపుడు కావాల్సింది మొబైల్ గవర్నెన్స్. పింఛన్లు, బ్యాంక్ సేవలు, బీమా పాలసీలు అన్ని ఈ-పంచాయతీల కేంద్రంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. అమెరికా కంపెనీలు గతంలో హైదరాబాద్‌ను బ్యాక్ ఎండ్ సేవలకు ఉపయోగించుకునేవి. ఇపుడు అలా కాకుండా ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదగాలని అనుకుంటున్నారు. ఫేస్‌బుక్, వాట్సప్ స్థాయి ఆవిష్కరణలను సాధించే సత్తా మన తెలంగాణ బిడ్డలకు ఉంది. దీన్ని ప్రోత్సహించే దిశగా మా ప్రభుత్వం తప్పక కృషి చేస్తుంది.

2019లో ఎన్నికల ఫలితాలపై మీ అంచనా?

ప్రజలు మమ్మల్ని 2014 ఎన్నికల్లో ఆశీర్వదించారు. ఆ మేరకు పాలనపగ్గాలు చేపట్టి వారికోసం మా ముఖ్యమంత్రి మరో ఆలోచన లేకుండా 24 గంటలు శ్రమిస్తున్నారు. ఆయన ఆలోచనల్లో 50% సఫలమైనా.. మేం తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తాం.

రూ.1500 కోట్లతో గూగుల్ హైదరాబాద్ క్యాంపస్
-రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్
కోల్‌కతా: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. హైదరాబాద్‌లో సొంత క్యాంపస్ ఏర్పాటుకు వచ్చే నాలుగేండ్లలో రూ.1500 కోట్లు పెట్టుబడిగా పెట్టనుందని రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఈ క్యాంపస్‌లో మొత్తం మూడు మెగా ప్రాజెక్టులు (సూపర్ ఫాస్ట్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు, స్ట్రీట్ వ్యూ, గూగుల్ ఎడ్యుకేషన్) చేపట్టనుందని ఆయన ఎకనామిక్స్ టైమ్స్‌కు వెల్లడించారు. దాదాపు 13 వేల మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా నిర్మించబోతున్న ఈ క్యాంపస్.. సంస్థకు అమెరికా అవతల అతిపెద్ద కార్యకలాపాల కేంద్రం కానుంది. క్యాంపస్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు గూగుల్ త్వరలోనే తన బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనుందని రంజన్ వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా ఈ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించి గూగూల్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేటీఆర్‌తోపాటు యూఎస్ వెళ్లిన అధికారుల బృందంలో జయేష్ రంజన్ కూడా ఉన్నారు.

రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందనే ప్రచారం సాగింది. తాజాగా మీ అమెరికా పర్యటనలో మీకేమనిపించింది?

నా పర్యటన సందర్భంగా అమెరికాలో ఉన్న సీమాంధ్రులతోపాటు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ అభివృద్ధి, భవిష్యత్తుపై సీమాంధ్రులు ఇక్కడ చేసిన ప్రచారంలో వాస్తవం లేదు. తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉన్నా, గూగుల్ కంపెనీ వచ్చినా తన వల్లే అనడంతో పాటు.. హైదరాబాద్‌ను ఉద్ధరించానని పదేపదే చెప్పుకొనే చంద్రబాబునాయుడు వాస్తవాలను ఎందుకు చెప్పడం లేదు? 1956లోనే హైదరాబాద్‌కు రూ.6కోట్ల మిగులు ధనం ఉంది. బీపీఆర్ విఠల్ అనే విశ్లేషకుడి కేస్‌స్టడీ మేరకు 1968లో కూడా తెలంగాణ సర్‌ప్లస్ స్టేట్. 2000 సంవత్సరంలో కూడా అదే విఠల్ మరో స్టడీ చేయగా సర్‌ప్లస్ స్టేట్ అని తేలింది. అంటే.. చంద్రబాబు పుట్టకముందు.. రాజకీయాల్లోకి రాకముందు.. అధికారంలో ఉన్నప్పుడు, అన్ని సమయాల్లోనూ తెలంగాణ మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రంగానే ఉంది. తెలంగాణ వస్తే హైదరాబాద్ నుంచి తరిమేస్తారు.. ఆస్తులు లాక్కుంటారు.. అని ప్రచారం చేశారు. కానీ మా ఏడాది పాలనలో అలాంటిదేమైనా జరిగిందా? ఆఖరికి వాళ్ల హయాంలో జరిగిన బాంబు పేలుళ్లవంటివి ఏమైనా జరిగాయా?

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *