హైదరాబాద్ లో అతిత్వరలో ప్రతిష్ఠాత్మకమైన ఎయిర్ క్రాఫ్ట్ పరిశ్రమ ప్రారంభం కానుంది. గతంలో ఎయిర్ ఇండియా షో కోసం హైదరాబాద్ లో పర్యటించిన సఫ్రాన్ సంస్థ సీఈవో ఫిలిప్ పెటిట్ కోలిన్ సీఎం కేసీఆర్ తో సమావేశమై లీప్ టర్బోఫ్యాన్ ఇంజిన్ విడిభాగాలను తయారుచేసే పరిశ్రమను హైదరాబాద్ లో ఏర్పాటుచేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సఫ్రాన్ సంస్థ రూ. 288 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను హైదరాబాద్ లో ప్రారంభించనున్నట్లు పెటిట్ కోలిన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో పరిశ్రమను నెలకొల్పుతుండగా, అందులో 8వేల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని వర్క్ షాప్ లకు కేటాయించినట్లు పెటిట్ కోలిన్ పేర్కొన్నారు. 2019 జూన్ లో పరిశ్రమ నిర్మాణం ప్రారంభమవుతుదని, 2020 నాటికి ఇంజిన్ విడిభాగాల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఈ పరిశ్రమ పూర్తయ్యేలోపు 300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, హైదరాబాద్ లో కొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేయడం గొప్ప అవకాశమని కొలిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ పెట్టుబడి, శిక్షణ కార్యక్రమాలతో భారతదేశ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. హైదరాబాద్ లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయడంపై గతంలో జరిగిన భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారని, ఏరోస్పేస్ పారిశ్రామిక రంగంపై తెలంగాణ దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధమని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా పెటిట్ కొలిన్ గుర్తుచేశారు.
ఇదిలాఉండగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సఫ్రాన్ సంస్థ ముందుకు రావడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. సఫ్రాన్ సంస్థ ఫ్రెంచ్ మల్టీ నేషనల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ. 36 మిలియన్ యూరోస్ పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ ప్లాంట్ ను హైదరాబాద్ లో నెలకొల్పుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు.