mt_logo

తెలంగాణ దేశంలోనే ట్రెండ్ సెట్టర్!!

ఆర్ధిక నిర్వహణలో, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని 15వ ఆర్ధికసంఘం చైర్మన్ నందకిశోర్ సింగ్ ప్రశంసించారు. దార్శనికుడు అయిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది అన్నారు. జూబ్లీహాల్ లో మంగళవారం 15వ ఆర్ధికసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు ఆర్ధికసంఘం చైర్మన్, ఇతర సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎస్ ఎస్కే జోషి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్ధిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన పదిమంది మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ నందకిషోర్ సింగ్ మాట్లాడుతూ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం సంపదను పెంచుకుంటూ ముందుకుపోతుందని, బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు అద్భుతమని కొనియాడారు. తమ సంఘం సభ్యులు మూడురోజులపాటు రాష్ట్రంలో పర్యటించి అన్ని విషయాలు తెలుసుకున్నారని, నీటిపారుదల రంగంలో ముఖ్యమంత్రి దూరదృష్టితో ప్రారంభించిన మెగా కాళేశ్వరం అత్యద్భుతమన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అద్భుతమైన ఇంజినీరింగ్ ప్రతిభ ఉన్నదని, రాష్ట్రంలోని అన్ని ఇండ్లకు పైపులైన్ల ద్వారా సురక్షిత మంచినీటిని అందించే మిషన్ భగీరథ పథకం దేశంలోనే గొప్ప పథకమని ప్రశంసల జల్లు కురిపించారు.

తెలంగాణ సంక్షేమ పథకాలు త్వరలోనే సత్ఫలితాలు ఇస్తాయని, గురుకుల పాఠశాలల ఏర్పాటుతో పాటు వైద్య రంగంలో చేపట్టిన విభిన్న పథకాలు, వ్యవసాయ ఉత్పత్తి పెంపుదల కోసం అమలుచేస్తున్న పథకాలు ఎంతో గొప్పవని అన్నారు. రైతుబంధు పథకం యావత్ దేశానికి ఆదర్శమని, అనేక రాష్ట్రాలకు ఈ పథకం మార్గదర్శకంగా మారిందని ఎన్ కే సింగ్ తెలిపారు. జీఎస్డీపీ జాతీయస్థాయిలో జీడీపీ సగటుతో పోలిస్తే 60% ఎక్కువగా ఉన్నదని చెప్పారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితిని పెంచాలన్న విషయంలో తాము రాష్ట్రాల వారీగా పరిశీలించి సిఫార్స్ చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *