అసెంబ్లీ సమావేశాలు ఏమాత్రం ముందుకు సాగకుండా సీమాంధ్రకు చెందిన నాయకులు అడ్డుకోవడం పరిపాటయింది. శీతాకాల తొలి విడత సమావేశాల్లో చర్చ జరక్కుండా అడ్డుకున్నందుకే రెండవసారి అంటే జనవరి 3నుండి మలివిడత సమావేశాలు మొదలయ్యాయి. కానీ సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని సమైక్య తీర్మానాలను అందించగా స్పీకర్ వాటిని తిరస్కరించారు. తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు.
మంత్రి గీతారెడ్డి ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తుండగా సీమాంధ్ర సభ్యులు నినాదాలు చేశారు. తెలంగాణ సభ్యులు కూడా జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ సభను 30 నిమిషాలపాటు వాయిదా వేశారు. తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగా, సభ్యులు మళ్ళీ పోడియం చుట్టూ చేరి నినాదాలు చేయగా స్పీకర్ సభ ఆటంకం లేకుండా జరగనివ్వాలని కోరినా సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో తిరిగి గంటసేపు వాయిదా వేశారు.
మధ్యాహ్నం మళ్ళీ సభ ప్రారంభమైనా, సభ్యుల ఆందోళనల మధ్య సభ శనివారానికి వాయిదా పడింది. కాగా శాసనసభ సభ్యుల్లో చాలామంది గైర్హాజరయ్యారు. వారిలో సీమాంధ్ర, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు తక్కువగా హాజరయ్యారు. ఇరు ప్రాంతాల టీడీపీ హాజరు శాతం కూడా తక్కువే. శాసనమండలిలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. చర్చ జరక్కుండా సీమాంధ్ర ఎమ్మెల్సీలు అడ్డుకోవడంతో సభను మూడుసార్లు వాయిదా వేశారు. మండలి చైర్మన్ చక్రపాణి సభను శనివారానికి వాయిదా వేశారు.