రాష్ట్రంలో రైతుబంధు సంబురం మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నుండి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రాష్ట్రంలో రైతు బంధు సంబురం మొదలైందని తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. తొలి రోజున ఒక ఎకరం వరకు భూమి కలిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో రూ.586.66 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. ఇవి అంకెలు కావు. రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ అంకితభావానికి సిసలైన ఆనవాళ్లు అని ఆయన తెలియజేసారు. ఈ దఫా మొత్తం 68.10 లక్షల రైతులకు రూ. 7,521 కోట్లు పెట్టుబడి సాయంగా అందించనుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కాగా పలుచోట్ల రైతుబంధు అందుకున్న రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు.