mt_logo

సీమాంధ్ర ఆర్టీసీ సమ్మె, ప్రైవేట్ ట్రావెల్స్ కు మంచి వ్యాపారం

తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో నిన్న మొదలైన సమ్మె అక్కడి ప్రైవేట్ ట్రావెల్స్ కు కాసులు కురిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు రోడ్ మీదకు రాకపోవడంతో ఇదే అదనుగా విజయవాడ కేంద్రంగా ఉన్న అనేక ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ప్రయాణీకుల వద్ద రెండు రెట్లు చార్జీలు వసూలు చేసి సొమ్ముచేసుకుంటున్నారు.

అందుకే సమ్మె మొదలైన రెండో రోజే ఈ అంశం సీమాంధ్ర ఆర్టీసీ కార్మికులకు, ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు మధ్య చిచ్చు రేపింది. సమ్మెను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సీమాంధ్ర ప్రైవేట్ ట్రావెల్స్ కు వ్యతిరేకంగా ఇవ్వాళ విజయవాడ వద్ద ఆర్టీసీ కార్మికులు ప్రైవేట్ బస్సులను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావల్సి వచ్చింది.

నిన్న సమ్మె మొదలైనప్పుడు తిరుమలకు కూడా బస్సులు బంద్ చేశారు సీమాంధ్ర ఆర్టీసీ కార్మికులు. తిరుపతికి వచ్చిన వేలాది మంది భక్తులు తిరుమల వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరి ఇబ్బందిని ప్రైవేట్ ట్రావెల్స్ వారు పూర్తిగా సొమ్ముచేసుకుని భక్తులను నిలువుదోపిడీ చేశారు. ఒక్కరోజులోనే ఆర్టీసీ గంపెడు నష్టాన్ని మూటగట్టుకోవడంతో కళ్లు తెరిచిన కార్మికులు సమ్మె విరమించి ఇవ్వాళటి నుండి తిరుమలకు బస్సులు నడపుతున్నారు.

తమ ఉద్యోగాలను ఫణంగా పెట్టి తాము సమ్మె చేస్తుంటే సీమాంధ్ర ప్రైవేట్ ట్రావెల్స్ వ్యాపారులు ఉద్యమంతో కూడా వ్యాపారం చేయడం దారుణమని విజయవాడ హైవేపై ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *