రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్యా నిధి పథకం కింద ఇప్పటివరకు మొత్తం రూ. 885.95 కోట్ల ఆర్థిక సహాయం అందజేసింది. మొత్తం 4,919 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్దిపొందగా… వారిలో ఎస్సీ విద్యార్థులు 935 మంది, ఎస్టీలు 208, బీసీలు 1,603, మైనార్టీలు 2,173 మంది ఉన్నారు.
అయితే ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే విదేశీ విద్య స్కాలర్‌షిప్ పథకం అమలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ బీసీ, ఈబీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు కూడా వర్తింపజేశారు. ఈ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేవారికి గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు రూ.10 లక్షల వరకు మాత్రమే ఇచ్చేవారు. స్కాలర్‌షిప్ పొందేందుకు వార్షిక ఆదాయ పరిమితిని సైతం రూ.4.5 లక్షలకు పెంచింది. పది శాతం స్కాలర్‌షిప్‌లను హ్యుమానిటీస్, ఎకనామిక్స్, అకౌంట్స్, ఆర్ట్స్ విద్యార్థులకు రిజర్వు చేసిం ది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ కోర్సులు చేస్తున్నవారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వ అందిస్తున్న ఈ పథకం ద్వారా విదేశీ విద్య అభ్యసించి అక్కడే వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నా వారు కోకొల్లుగా ఉండటం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం పేరుతో, బీసీలకు మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకం పేరుతో అమలు చేస్తున్నది.