ఫ్రీడం బ్రాండ్‌తో వంట నూనెలను విక్రయిస్తున్న జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ (జీఈఎఫ్)… రాష్ట్రంలో రిఫైనరీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌కు సమీపంలో రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ రిఫైనరీ యూనిట్ వచ్చే రెండేండ్లలో అందుబాటులోకి రానున్నది. ఈ రిఫైనరీ యూనిట్‌తో 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు సంస్థ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి చేసే రైతులకు కూడా ఈ యూనిట్ ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని తెలిపారు.
ఈ యూనిట్ ఏర్పాటునకు సంబంధించి జీఈఎఫ్ ఎండీ ప్రదీప్ చౌదరీ బుధవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ పెట్టుబడి వివరాలను వెల్లడించారు. జీఈఎఫ్ పెట్టుబడి నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఇప్పటికే నాలుగు విప్లవాలు (రెండవ హరిత, నీలి, గులాబీ, శ్వేత విప్లవం)కు శ్రీకారం చుట్టిందని, దీంతోపాటు 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయడం ద్వారా పసుపు విప్లవానికి శ్రీకారం చుట్టాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
ఈ సందర్భంగా జెమినీ ఎండీ ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ.. తెలంగాణలో పసుపు విప్లవానికి తమ పెట్టుబడి నాంది పలుకుతుందని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రెండేండ్లలో అందుబాటులోకి రానున్న ఈ యూనిట్‌తో 1000 మందికి ఉద్యోగాలు లభించడంతోపాటు ఆయిల్ సీడ్ రైతులకు మద్దతుగా ఉంటుందన్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాలు (చౌటుప్పల్, జహీరాబాద్, కొత్తూరు) సూచించిందని, దీనికి సంబంధించి త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్నారు. 
