mt_logo

పాలమూరు నిర్వాసితులకు రూ. 300 కోట్లు విడుదల..

పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం చేపట్టనున్న భూసేకరణలో నిర్వాసితులుగా మారుతున్న వారికి నష్టపరిహారం చెల్లించేందుకు గానూ రూ. 300 కోట్లు విడుదల చేసి జిల్లా కలెక్టర్ వద్ద ఉంచినట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. భూసేకరణ వల్ల నిర్వాసితులుగా మారే వారిపట్ల సానుభూతితో వ్యవహరించాలని, విద్యార్హతలను బట్టి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. అంతేకాకుండా భూసేకరణ కోసం రైతులతో స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడాలని, ప్రాజెక్టుకు కావాల్సిన భూమిని రైతుల నుండి మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలని సీఎం సూచించారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై శుక్రవారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను రీ డిజైన్ చేయడం వల్ల అంతర్రాష్ట్ర వివాదాలు, ఇతర సమస్యలు చాలావరకు తగ్గాయని, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో తలెత్తే సమస్యలు, అడ్డంకులను వెంటనే అధిగమించి చాలా తక్కువ సమయంలోనే నదీ జలాలను పొలాలకు మళ్ళించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో ముంపు పెద్దగా లేనప్పటికీ, కొద్దిపాటి ఆవాస ప్రాంతాల ప్రజలను అక్కడినుండి వేరేచోటికి తరలించడం అనివార్యమని, లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి కడుతున్న ప్రాజెక్టుల కోసం తమ భూములను, ఇళ్ళను, వ్యవసాయాన్ని కోల్పోతున్న వారిపట్ల అత్యంత సానుభూతితో వ్యవహరించాలని కోరారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి డబ్బులు చెల్లించడమే ప్రాజెక్టుల నిర్మాణ ప్రక్రియలో మొదటి పని అని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టు భూ నిర్వాసితులకు చెల్లించడానికి ప్రభుత్వం రూ. 300 కోట్లు విడుదల చేసి మహబూబ్ నగర్ కలెక్టర్ వద్ద ఉంచిందని, ఆ డబ్బులు వెంటనే నిర్వాసితులకు అందించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

పాలమూరు ప్రాజెక్టు పూర్తయ్యేవరకు తాను, మంత్రి హరీష్ రావు నిరంతరం పర్యవేక్షిస్తామని, టెండర్లు ఖరారైన తర్వాత కాంట్రాక్టర్లతో తానే స్వయంగా మాట్లాడి పనులు వేగవంతంగా పూర్తిచేయాలని కోరుతానని సీఎం చెప్పారు. డిండి ప్రాజెక్టు పనులను కూడా వెంటనే చేపట్టాలని, ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని, నిధుల కొరత రాకుండా వెంటనే రూ. 75 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సీఎం ఆదేశించారు. డిండి ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాకు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీరందించాలని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, మర్రి జనార్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు, నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, పాలమూరు ప్రాజెక్టు ఓఎస్డీ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *