తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ఐపాస్) చాలా బాగుందని టాటా గ్రూప్ కంపెనీల చైర్మన్ సైరస్ మిస్త్రీ కీర్తించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును గురువారం క్యాంపు కార్యాలయంలో సైరస్ మిస్త్రీ మర్యాదపూర్వకంగా కలుసుకుని వివిధ అంశాలపై చర్చించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పరిశ్రమలకు కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తుండటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల పారిశ్రామికవేత్తలకు చాలా విలువైన సమయం ఆదా అవుతుందని, పలు విభాగాలకు తిరగకుండా చేజింగ్ సెల్ ద్వారా అనుమతులు ఇవ్వడంతో అనేకమంది ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తారని అన్నారు.
తెలంగాణలో ఉన్న టాటా పరిశ్రమల గురించి చర్చించిన సైరస్ మిస్త్రీ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ విస్తరణకు రూ. 30 కోట్లు ఇస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ కు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను నిర్మిస్తున్న విషయంపై వీరిరువురూ చర్చించినట్లు సమాచారం.