శుక్రవారం మాదాపూర్ లో కృష్ణా జలాల తరలింపు 3వ దశ పనులకు ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాదాపూర్, హైటెక్ సిటీ పరిధిలో పైప్ లైన్ విస్తరణకు రూ. 25 కోట్లు కేటాయించినట్లు, ఐటీ కారిడార్ పరిధిలోని రహదారుల అభివృద్ధి కోసం రూ. 16 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ త్వరలోనే వరల్డ్ సిటీ మార్క్ ను అందుకుంటుందని, ఇందుకు అవసరమైన అన్ని వనరులు నగరానికి పుష్కలంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖామంత్రి మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారి సోమేశ్ కుమార్, జలమండలి ఎండీ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, మాదాపూర్ లో కంపెనీలకు నీటి కొరత లేకుండా కృష్ణా వాటర్ ఫేజ్-3 పనులు చేపట్టామని అన్నారు. ఐటీ కారిడార్ లో నీటి సమస్యలు ఉన్నాయని చెప్పగానే మంత్రి కేటీఆర్ వెంటనే రూ. 25 కోట్లు మంజూరు చేశారని, దీంతో 10 లక్షల మంది దాహార్తి తీరుతుందని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా ఐటీ కారిడార్ ప్రాంతంలో రూ. 16 కోట్లతో 7.7 కి.మీ రోడ్లు విస్తరణ చేపట్టామన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయని, ప్రతీ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిస్తున్నామని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.