mt_logo

అబద్ధాల జ్యోతి..అడ్డగోలు కూతలు..

-మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టే కుయుక్తి
-ఒక బ్రోకర్.. ఒక బ్లాక్ మెయిలర్ కుమ్మక్కై కేసీఆర్‌పై రోత రాతలు

రాధాకృష్ణ ఉన్మాదం పరాకాష్ఠకు చేరింది. పచ్చదొరల పాలేరు పిచ్చి పీక్‌కు చేరింది. తెలంగాణ ఉనికిని సహించలేకపోతున్నాడు. ఆంధ్రలో కేసీఆర్‌కు జేజేలు కొట్టడం భరించలేకపోతున్నాడు. ఏం చేసైనా.. తెలంగాణ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. ఈ కోరికను దాచుకోవటం లేదు. మొన్న కొలుములు అంటూ సర్కారును కూల్చేయాలని విషం చిమ్మితే.. నిన్న ఓడించాలని వంధిమాగధులతో రాయించాడు. ఇవాళ మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టి కథనాలు పరిచి వికటాట్టహాసాలు చేస్తున్నాడు. ఇదే కాదు.. ఇంకా రాస్తా అంటూ ఉన్మత్త ప్రేలాపనలకు దిగుతున్నాడు. రాజకీయంగా తొక్కేయాలనుకున్నా.. డబ్బులు విరజిమ్మి గెలవాలనుకున్నా.. మీడియా ప్రచారాలతోను నెగ్గుకురావాలనుకున్నా వల్ల కాక.. వామపక్ష యూనియన్లను ఎత్తి పట్టి లాభం లేక.. ఇపుడు అవినీతి బురదతో దెబ్బతీయాలన్న కుట్రకు దిగాడు.

తెలంగాణ రాష్ట్రంలో పదహారు నెలల పాలన మీద దుర్భిణీలు పెట్టుకుని వెతికినా.. స్ప్రింగు గ్యాంగులను ఉసిగొల్పినా వెంట్రుక కూడా దొరకని స్థితిలో ఇపుడు ఢిల్లీ మీద పడ్డాడు. అక్కడ ఆంధ్ర ఐఏఎస్ విచారణ, ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రచురణ. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అని సామెత. కానీ ఇక్కడ ఎలుక కాదు. దాని విసర్జితం కూడా రాధాకృష్ణకు చిక్కలేదు. అయినా ఫైళ్లలోని అంశాలు ముందేసుకుని కథలు అల్లుకుంటూ బురద చల్లే కార్యక్రమం చేపట్టాడు. అడ్డగోలు కూతలు కూస్తున్నాడు. రంకెలు వేస్తున్నాడు. ఒక బ్రోకర్‌ను పక్కన పెట్టుకుని బ్రహ్మాండమేదో బద్దలైనట్టు అట్టహాసాలకు పోతున్నాడు.

ఇంతా చేసి రాధాకృష్ణ రాసిందేమిటి? కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నపుడు కొన్ని కంపెనీలకు ఈపీఎఫ్ స్వీయ నిర్వహణకు అనుమతినిచ్చారు. అంటే కార్మికుల భవిష్యనిధిని సదరు కంపెనీలే నిర్వహించుకునే వెసులుబాటు ఇచ్చారు. అది అసాధారణ నిర్ణయంగా రాధాకృష్ణకు తోచింది. అందులో ఉన్న సహారా కంపెనీకి సదరు మినహాయింపునివ్వటం అనుచితంగా కూడా కనిపించింది. పచ్చ కామెర్లవాడికి లోకమంతా పచ్చగానే కనిపించడం.. బతుకంతా అడ్డదారిలో గడిపిన వారికి ఎదుటివారి పనులన్నీ తప్పులుగానే తోచటంలో వింతలేదు. భారత పార్లమెంటు కార్మికుల భవిష్యనిధి చట్టం అనేదొకదాన్ని ఆమోదించింది.

అదెప్పుడూ రాధాకృష్ణగాని ఆయన దగ్గరి డూడూ బసవన్నలుగాని చదివి ఉండకపోవచ్చు. ఆ చట్టంలో 16/ఏ అనే ఉపనిబంధన కూడా ఒకటి ఉంది. భారత పార్లమెంటే దాన్ని ఆమోదించింది. వందకు మించి కార్మికులు పనిచేసే పెద్ద కంపెనీలు భవిష్యనిధి ఖాతాను తమకు తాముగా నిర్వహించుకోవచ్చు. ఆయా కంపెనీల యాజమాన్యాలు మరియు ఆ కంపెనీలో పనిచేసే కార్మికులు లేదా ఉద్యోగులు పరస్పరం అంగీకారానికి వచ్చి ఆ మేరకు కార్మిక శాఖకు వినతి సమర్పించుకుంటే కార్మికశాఖ అందుకు అనుమతిని ఇవ్వవచ్చు అని ఆ నిబంధన పేర్కొంటున్నది. ఈ చట్టం కేసీఆర్ రూపొందించింది కాదు.

ఈ క్లాజు కేసీఆర్ సృష్టించింది కూడా కాదు. కేసీఆర్ కార్మికమంత్రి కాకముందునుంచీ అమలులో ఉన్నది. అనేక కంపెనీలు ఈ పద్ధతిలో మినహాయింపులు కూడా పొందాయి. కార్మికమంత్రులూ ఇచ్చారు. సహారా కూడా అలాగే చట్టబద్ధంగా వినతిపత్రం పెట్టుకుంది. నిబంధనల ప్రకారం కార్మికశాఖ అనుమతినిచ్చింది. కానని ముఖానికి కప్పే దయ్యం అన్నట్టు ఈ చట్టాలు అవీ తెలియదేమో.. రాధాకృష్ణకు ఇందులో ఏదో జరిగినట్టు కనబడింది.

ఇక రాధాకృష్ణ రెండో ఆరోపణ.. సహారా మీద అనేక కేసులున్నాయి. అదొక ఫ్రాడ్ కంపెనీ. దానికి అనుమతి ఇవ్వడంలో మతలబు ఉంది.. వగైరా వగైరా.. రాధాకృష్ణకు చట్టాలు తెలియకపోతే పోయాయి. ఎక్కడ చదువుకున్నాడో.. ఎవడు ఉద్యోగమిచ్చాడో తెలియదు కానీ.. జర్నలిస్టు అనే కార్డు పెట్టుకుని అనేక ఏండ్లు పనిచేసినందుకైనా దేశ కాల పరిస్థితుల మీద అవగాహన ఉండాలి. ఒక విషయం రాస్తున్నపుడు కాలగతి ఎరిగి రాయాలి. క్రానాలజీ అనే పదమన్నా విని దాన్ని అన్వయించుకుని రాసి ఉండాలి. కేసీఆర్ కార్మికమంత్రిగా ఉన్న నాడు సహారా అనే కంపెనీ పరిస్థితి ఏమిటి? ఆనాడు దానికి ఉన్న విలువ, ప్రతిష్ఠ ఏమిటి? అనే విషయం తెలిసి రాయాలి.

కనీసం వంధిమాగధులన్నా డూడూ బసవన్నలా తలలూపకుండా విషయం తెలియచెప్పి ఉండాలి. 2004లో టైమ్స్ పత్రిక సహారా గురించి ఏమన్నదో రాధాకృష్ణకు బహుశా ఆయన వంధిమాగధులకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ టైమ్స్ పత్రిక ఆనాడు సహారా గురించి రాస్తూ భారతదేశంలో రైల్వేశాఖ తర్వాత పెద్దసంఖ్యలో ఉద్యోగాలిచ్చిన సంస్థగా ప్రశంసించింది. అతి సంపన్న కంపెనీగా ప్రస్తుతించింది. అంటే ఆనాడు 2004 సంవత్సరంలో దేశంలో అత్యధిక ఉద్యోగాలిచ్చిన రెండో అతి పెద్ద సంస్థ సహారా కంపెనీ. భవిష్యనిధి చట్టం 16/ఏ అనే క్లాజ్‌కు ఇంతకన్నా అర్హమైన సంస్థ మరొకటి ఉంటుందా? ఉండదా? అనేది ఆయన సొల్లుగ్యాంగుకు ఎటూ తెలియదు.

రాసేముందు కనీసం బయట ఏ రిక్షావాలాను అడిగిఉన్నా చెప్పిఉండేవాడు. అంతేకాదు.. ఆనాడు సహారా అధినేత సుబ్రతోరాయ్‌ని ఇండియా టుడే దేశంలో పదిమంది శక్తిమంతుల జాబితాలో చేర్చింది. ఆనాడు దేశాధినేతలు అనేకమంది ఆయన ముందు మోకరిల్లుతున్నారు. బిజినెస్ పత్రికలకు ఆయన ఒక ఆర్థిక మహామాంత్రికుడుగా.. మోడల్‌గా.. దార్శనికుడుగా కనిపిస్తున్నాడు. టాటా, బిర్లా, అంబానీల్లాంటి విజయవంతమైన బిజినెస్ మ్యాన్ హోదాలో ఉన్నాడు. ఆ హోదా.. ప్రతిష్ఠ 2010దాకా కొనసాగింది. మరి 2004-06 మధ్యలో మంత్రిగా ఉన్న కేసీఆర్‌కు సహారా అవకతవకలకు పాల్పడి నష్టాల పాలవుతుందని ఎలా తెలుస్తుంది? ఉద్యోగ కల్పనలో దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా ఆ సంస్థకు మినహాయింపునివ్వడం అక్రమం ఎలా అవుతుంది? సహారాలో అవకతవకలు బయటకు వచ్చింది 2010 నవంబర్‌లో. ఆ కంపెనీ మీద తొలికేసు నమోదైంది అప్పుడే. అంతదాకా సహారా ప్రతిష్ఠ పదిలంగానే ఉంది. మరి 2004-06లో కేవలం కొన్ని మాసాలపాటు మంత్రిగా ఉన్న కేసీఆర్‌కు ఆ తర్వాత పరిణామాలతో సంబంధముందని మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవరైనా అనగలడా? ఒక్క రాధాకృష్ణ ఆయన డూడూ బసవన్నలు తప్ప!

ఇంతోటిదానికి సీబీఐ తవ్వుతున్నదట.. ఈ మొగోడు రాస్తున్నడట.. తవ్వితే దొరికేదేమిటట.. తవ్వి తవ్వి వాళ్లకు.. రాసిరాసి ఈయనకు జబ్బల నొప్పులు తప్ప! అపుడెపుడో వైఎస్ అనంతపురంలో ఏదో భూములు కేటాయిస్తే ఇలాగే రాశాడు. అక్కడ సెలయేళ్లున్నాయి. అరుదైన వృక్షాలున్నాయి. లేళ్లు ఛెంగుఛెంగున ఎగురుతున్నాయి.. అంటూ! చదివిన వాళ్లు పగలబడి నవ్వుకున్నారు.. ఎందుకంటే అక్కడ చుక్క నీరులేదు.. అక్కడ లేళ్లు కాదు.. తొండల గుడ్లు తప్ప ఇంకేం లేవు. రాధాకృష్ణ వచ్చి వాటిని పట్టుకు పోతాడేమోననుకున్నారంతా. తెలంగాణ ఆవిర్భావానికి ముందూ అంతే.. హైదరాబాద్ యూటీ అంటూ! ఎన్ని రకాలుగా యూటీలు చేయవచ్చో సీరియళ్లు కూడా వేసుకుని సంతోషపడ్డాడు. ఎటు తిరిగీ ఆంధ్రజ్యోతి చరిత్రలో కథనాలు.. ఊహాగానాలు నిజమైన సందర్భం ఒక్కటీ లేదు. పోన్లెండి.. ఏదో ఒకనాటికి ఏ ఒక్క ఊహాగానమూ కూడా నిజం కానీ రికార్డు స్థాపించిన పత్రికగా ఆంధ్రజ్యోతి గిన్నిస్‌బుక్ అవార్డు పుచ్చుకోవడం మాత్రం గ్యారెంటీగా కనిపిస్తున్నది.

రాధాకృష్ణ ఆయన గ్యాంగు సభ్యులు.. ఎవడో తవ్వుతున్న ఫైళ్లు కాకుండా ఒకసారి పార్లమెంటు సమావేశాల రికార్డులు చూస్తే కేసీఆర్ మంత్రిగా కుమ్మేసుకునే పనులు చేశారా.. ఎంజాయ్ చేశారా.. ఏదీ పట్టకుండా తెలంగాణ కోసం తాపత్రయపడ్డారా.. తెలిసిఉండేది. ఆయనకు తెలంగాణ ముఖ్యమైతే ఆ పనే చేసుకోమనండి. ఆయన ఎందుకు మంత్రిగా ఉన్నారో తెలియదు. ఒక్కనాడూ ఆఫీసుకు రారు. ఏదీ పట్టించుకోరు. ఒక్కపనీ అక్కడ జరగడం లేదు. ఫైళ్లు కదలటం లేదు. ఎన్నిసార్లు వెళ్లినా దొరకడంలేదు.. యూపీఏ-1 అధికారంలో ఉన్నపుడు సీపీఐ నేత గురుదాస్ దాస్‌గుప్తా పార్లమెంటు ప్రసంగంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు చేసిన ఫిర్యాదు ఇది. చాలా…!

ఆఖరున మరో తాలింపు.. ఆంధ్ర ఐఏఎస్ ప్రత్యేకంగా విచారిస్తున్నాడట. ఎందుకట? ఆ చారిత్రక అవసరం ఎందుకు వచ్చిందట. ఎవరి కడుపు నొప్పి తీర్చడానికట. అవును. తెలంగాణ మీద విచారణ కదా. ఆంధ్ర అధికారులే వస్తారు. వింతేం లేదు. తెలంగాణను పొడిచేందుకు కాకులు అక్కడినుంచే దిగుమతి అవుతాయి. అలాగే ఇది ఎవరి మేలుకు జరుగుతున్నదో.. దీని వెనుక ఎవడి కుట్ర ఉన్నదో చెప్పే పనీలేదు. ఎవరు ఉసిగొలిపితే వచ్చారో కూడా విప్పి చెప్పనవసరమూ లేదు. రాజకీయంగా తొక్కేయలేక పోయారు. డబ్బులు విరజిమ్మి గెలువలేక పోయారు.

మీడియా ప్రచారాలతోనూ నెగ్గుకురాలేక పోయారు. వామపక్ష యూనియన్లను దింపీ సాధించలేక పోయారు. అయినా మీరు ఓటమి అంగీకరించరు. అది మాకు తెలుసు.. వచ్చేది వస్తున్నది… మహాయుద్ధమేనని ప్రతీపశక్తులన్నీ ఉనికికోసం జత కడతాయనీ తెలుసు. ఇంతకాలం ధరించిన తెలంగాణ ముసుగులను పక్కన పెట్టి కొందరు కొత్త గొంతులతో వస్తారని తెలుసు. జెండాలు వేసుకు వస్తారని.. కుల సంఘాలై వస్తారని.. కార్మిక నేతలై దిగుతారని.. మేధావుల రంగుల్లో.. కవులు.. కళాకారుల వేషాల్లో దిగుతారని.. డప్పులు, ఢమరుకాలు దద్దరిల్లుతాయని తెలుసు.. నిజాం.. నియంత.. హిట్లర్.. దొర.. పదాలకు ప్రపంచం ఎన్నడూ వినని అన్వయాలు దిగుమతి అవుతాయని కూడా తెలుసు. అవి ఎందుకు వాడుతున్నారో కూడా ఆలోచించే వ్యవధినివ్వకుండానే తెలంగాణ మీద రుద్దుతారనీ డెఫినెట్‌గా తెలుసు. మీ జెండాలు ఎగురకపోతే.. మీ ఎజెండాలు నడవక పోతే మీరు భరించలేరు.

మీ ప్రయోగాలకు లాబొరేటరీగా ఉండటంకన్నా ఒక్క మెట్టు తెలంగాణ పైకి వెళ్లినా మీరు సహించలేరు. మీ దుకాణాల పేరు చెప్పుకొంటే తప్ప బతుకులేని సన్నాసులు ఇక్కడున్నారని.. ఆ డూడూ బసవన్నలు మీ గిన్నీ పందులుగా బలిదానంకోసం వస్తారని తెలుసు. కొలుములు అంటుకున్నా.. కొంపలు తగులబెట్టుకున్నా.. అగ్నిపర్వతాలు బద్దలైనా భూమ్యాకాశాలు ఏకమైనా.. మేం గెలుస్తాం. అరవై ఏండ్ల పాలనను పాలకులనే కాదు.. అరవై ఏండ్ల అడ్డగోలు నాటకాలకు కూడా శాశ్వతంగా తెర దించుతాం. పాతిపెట్టిన పాత కథలు తవ్వించుకుని ఛీత్కారాలకు గురికాకుండా చూసుకోండి. వెళ్లేటపుడు గౌరవప్రదంగా నిష్క్రమించండి. ఆ మర్యాదనన్నా మిగుల్చుకోండి. మీ బ్రోకర్, లోఫర్, బ్లాక్‌మెయిలింగ్ వ్యవహారాల మీద మేం నోరు విప్పటం మొదలు పెడితే, మనసుపెట్టి రాయటం మొదలు పెడితే.. మీ ఒంటిమీద గోచీగుడ్డ కూడా మిగలదు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *