బైసన్ పోలో, జింఖానా గ్రౌండ్స్ లో నూతన సచివాలయం నిర్మించుకోవడానికి మార్గం సుగమమైంది. రక్షణ శాఖ అధీనంలో ఉన్న సికింద్రాబాద్ బైసన్ పోలో, జింఖానా మైదానాలను నూతన సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఉపయోగించుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరభ్యంతరంగా చర్చలు కొనసాగించవచ్చని రాష్ట్ర హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ప్రభుత్వాల మధ్య భూముల బదలాయింపు విషయంలో ఎలాంటి స్టేలు లేవని, తమ అధీనంలోని భూముల అప్పగింతపై నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ కేంద్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు పేర్కొంది.
ఇదిలావుండగా నూతన సచివాలయానికి భూములు అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తాము నిర్ణయం తీసుకోలేకపోతున్నామని కేంద్రం ఇటీవల పార్లమెంటులో వివరించిన విషయం తెలిసిందే. బైసన్ పోలో, జింఖానా గ్రౌండ్స్ పూర్తిగా క్రీడా మైదానాలని, వాటిని సెక్రటేరియట్ నిర్మాణానికి అప్పగించవద్దని కొందరు వేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు కేంద్ర, రాష్ట్రాల మధ్య భూ బదలాయింపు ఒక కొలిక్కి రాకముందే నిర్మాణాలు మొదలైనట్లు అభ్యంతరాలు తెలపడం సమంజసం కాదని పిటిషనర్లకు సూచించింది. తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.