Mission Telangana

ఈ-కామర్స్ రంగంలో విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకోవాలి : మంత్రి కేటీఆర్

సోమవారం పార్లమెంట్‌ స్టాండింగ్ కమిటీ అండ్ కామర్స్ సమావేశం హైదరాబాద్ లోని శాసనసభ కమిటీ హాలులో జరిగింది. కమిటీ చైర్మన్‌ విజయ సాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌తో పాటు… పలువురు సీనియర్‌ ఎంపీలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ప్రతినిధులు, బ్యాంకింగ్, ఈ-కామర్స్ సంస్థలకు చెందిన సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక, సాఫ్ట్‌వేర్‌ రంగంలోని విప్లవాత్మక మార్పులను భారతదేశం అందిపుచ్చుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన విధానపరమైన నిర్ణయాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై వేగంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ-కామర్స్‌పై జాతీయపరమైన పాలసీని సత్వరమే తీసుకురావాలని, ఇందులో ఈ-కామర్స్‌కు అనుబంధంగా ఉన్న ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ సెక్యూరిటీ, మొబైల్‌ పేమెంట్స్‌, అత్యుత్తమ ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండడం వంటి సంబంధిత రంగాలపై విప్లవాత్మకమైన నిర్ణయాలను కేంద్రం ప్రకటించాలన్నారు.

సిటిజన్ సర్వీస్ డెలివరీకి సంబంధించి కేంద్రం మరింత చురుగ్గా కదలాలని సూచించారు. ఈ-కామర్స్, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులని మనం ఆపడం మానేసి, దాన్ని అందిపుచ్చుకొని ప్రపంచాన్ని లీడ్ చేసే విధంగా భారతదేశాన్ని తయారు చేయాలన్నారు. పెద్ద ఎత్తున ఈ-కామర్స్ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ లిటరసీపైన దృష్టి సారించాలన్నారు. భారత దేశంలోని వివిధ భాషల్లో డిజిటల్ లిటరసీని పెంచే ప్రయత్నం చేయాలని, భారత ప్రభుత్వం చేపట్టిన భారత్ నెట్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ ఇంటర్నెట్ వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి వాటికి అవసరమైన ఆర్థికపరమైన సహకారాన్ని అందించాలని కోరారు. ఇంటర్నెట్ ద్వారా లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించినప్పుడు అత్యంత మారుమూల ప్రాంతాల్లోని పౌరులకు కూడా ప్రపంచ స్థాయి పరిజ్ఞానం, సేవలు అందే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైబర్ నేరాలను అరికట్టే ఉద్దేశంతో నల్సార్ యూనివర్సిటీ తో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించే ప్రక్రియను ప్రారంభించిందన్నారు. ఇదే అంశంపై జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కామర్స్ రంగంపై ఏర్పాటైన పార్లమెంట్ కమిటీ ముందు తెలంగాణ ప్రగతిని కేంద్రం ఎదుట ఉంచడంతో పాటు.. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎదురవుతున్న వివక్షను మంత్రి కేటీఆర్‌తెలిపారు. పార్లమెంట్‌ సాక్షిగా వచ్చిన విభజన హామీలతో పాటు వివిధ పథకాల కింద రావాల్సిన సహాయ సహకారాలను అందించాలని, కేంద్రం శీతకన్ను వేసిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి దక్కాల్సిన బయ్యారం స్టీల్ ప్లాంట్ నుంచి మొదలుకొని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నేషనల్ డిజైన్ సెంటర్, ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల వరకు అనేక హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అడిగిన ఇండస్ట్రియల్ కారిడార్‌లతో పాటు డిఫెన్స్ కారిడార్ ఫార్మాసిటీ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లకు అవసరమైన ఆర్థిక సహాయం వంటి అనేక అంశాలపై కేంద్రం స్పందించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించడంపైన అత్యంత విశ్వాసం కలిగి ఉందని, ఈ దిశగా ఆదిలాబాద్‌లోని సీసీఐని పునరుద్ధరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఏడున్నర సంవత్సరాలలోనే దేశంలో అత్యంత విజయవంతమైన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వడంలో చొరవ చూపడం లేదన్నారు. నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వాసం మాకు ఉన్నదన్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే భారతదేశ అభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని, ఏడున్నర సంవత్సరాలుగా తలసరి ఆదాయంతో పాటు జీఎస్‌డీపీ వంటి అంశాల్లో రెట్టింపు వృద్ధిని నమోదు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి వచ్చే సంపద దేశంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగం జరుగుతుందన్న అంశం తమకు గర్వకారణంగా ఉందని, అయితే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మరింత సహకారం అందించాలన్నారు. మేకిన్ ఇండియా నినాదం నిజరూపం దాల్చాలంటే కేంద్ర ప్రభుత్వం మరిన్ని పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే సాధ్యమవుతుందన్నారు. దేశంలోని సూక్ష్మ, మధ్యతరహా పారిశ్రామిక రంగానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *