mt_logo

అధిష్టానం వద్ద పరపతి కోల్పోయిన రేవంత్?

తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. వాస్తవానికి ప్రారంభోత్సవానికి విగ్రహం ఎప్పుడో ఎప్పుడో సిద్ధమైంది.. కానీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను తీసుకురావాలన్న సీఎం రేవంత్ రెడ్డి పంతం వల్ల ఆవిష్కరణ ఆలస్యమైంది.

ఇన్ని రోజులు ప్రయత్నించినా.. రేవంత్ రెడ్డి ఎంత బతిమిలాడినా కూడా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆహ్వానాన్ని నిరాకరించినట్లు జోరుగా టాక్ నడుస్తుంది.

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థానంలో రాజీవ్ విగ్రహం పెట్టడంపై తెలంగాణ ప్రజల ఆగ్రహం, తెలంగాణ పౌర సమాజం లేఖ రాయడంతో ఆ సెగ ఢిల్లీకి తాకినట్లు సమాచారం. అనవసరంగా తెలంగాణవాదంతో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు అని పార్టీ పెద్దలు గ్రహించే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అందుకే ఆగస్ట్ 20న ఆవిష్కరణ సభ ఏర్పాటు చేసినా వెనకడుగు వేసిన సోనియా, రాహుల్ గాంధీ.. నెల రోజులు వేచి చూసినా, రేవంత్ రెండు సార్లు ఢిల్లీకి వెళ్లినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వైనం స్పష్టంగా కనిపిస్తుంది.

చివరికి దిక్కుతోచని స్థితిలో, తానే హడావిడిగా ఇవ్వాళ రాజీవ్ విగ్రహం ఆవిష్కరణ చేస్తానని రేవంత్ ప్రకటించడం కొసమెరుపు. రేవంత్ ఒంటెద్దు పోకడలు, ప్రైవేటు డీలింగులు, సీనియర్ ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లను పక్కన బెట్టి.. పారాషూట్, టీడీపీ నుండి వచ్చిన కాంగ్రెస్ నేతలను అందలం ఎక్కించడంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

బీఆర్ఎస్ నుండి ఫిరాయింపులను మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయి, జాతీయ స్థాయిలో తలవంపులు తెచ్చాడని కూడా రేవంత్‌పై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటు చేసి పది నెలలు కావొస్తున్నా మంత్రివర్గ విస్తరణ పీటముడి విప్పలేక ఢిల్లీ పెద్దలు ఇప్పటికే తలపట్టుకున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో.. ఢిల్లీ పెద్దల వద్ద రేవంత్ ఇమేజ్ బాగానే డ్యామేజీ అయ్యిందని మీడియా మిత్రుల వద్ద కాంగ్రెస్ సీనియర్లు డైరెక్ట్‌గానే వ్యాఖ్యానిస్తున్నారు.