mt_logo

తెలంగాణ ఆత్మగౌరవంపై మోడీ సాక్షిగా రేవంత్ దాడి చేశాడు: కేటీఆర్

రేవంత్‌కు తెలంగాణ ఆత్మలేదు.. తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోడీ సాక్షిగా రేవంత్ దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

అసలు తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు, ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం అని ఎద్దేవా చేశారు.

అసలు గోల్‌మాల్ గుజరాత్ మోడల్‌కు గోల్డెన్ తెలంగాణ మోడల్‌తో పోలికెక్కడిది.. ఘనమైన గంగా జెమునా తెహజీబ్ మోడల్ కన్నా మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల మోడల్ రేవంత్ రెడ్డికి నచ్చిందా అని కేటీఆర్ విమర్శించారు.

నిన్నటి దాకా గుజరాత్ మోడల్ పై నిప్పులు కక్కిన రేవంత్.. ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెబుతున్నాడు.. ఇదేం నీతి.. ఇదేం రీతి అని ప్రశ్నించాడు.

తెలంగాణ మోడల్ అంటే సమున్నత సంక్షేమ నమూనా, సమగ్ర అభివృద్ధికి చిరునామా. అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్, యావత్ దేశానికే నచ్చిన మోడల్.. బుడిబుడి అడుగుల వయసులో బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్.. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించపరుస్తావా? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన అని కేటీఆర్ దుయ్యబట్టారు.

నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని  మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా? నాడు తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తాడు.. నేడు తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టాడు.. రేవంత్ రెడ్డికి చరిత్ర క్షమించదు అని అభిప్రాయపడ్డాడు.

నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని  ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది బీఆర్ఎస్ కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది కాంగ్రెస్ అని కేటీఆర్ పేర్కొన్నారు.