mt_logo

రేపే మెదక్ పోల్

ఉపపోరులో ముగిసిన ప్రచారం
రాష్ట్ర, జాతీయ స్థాయి
నాయకులతో ప్రచారం
రాష్ట్ర అంశాలే ప్రధానంగా ప్రస్తావన
హోరెత్తించిన టీఆర్‌ఎస్ ప్రచారం
వెలవెలబోయిన ప్రత్యర్థి పార్టీల సభలు
గులాబీ దళంలో గెలుపు జోష్
రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన మెదక్ పార్లమెంటు ఉపఎన్నిక ప్రచారం గురువారం సాయంత్రం ముగిసి పోయింది. శనివారం ఉదయం నుంచి పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో 15,43,422 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,817 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా అధికార టీఆర్‌ఎస్‌నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సునీతారెడ్డి, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా తూర్పు జయప్రకాశ్‌రెడ్డి పోటీపడుతుండగా మరో 11మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న సంగారెడ్డి, పటాన్‌చెరు, మెదక్, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు ముఖ్య పార్టీల తరపున రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు సభల్లో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించారు.

ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాలేవీ ప్రస్తావనకు రాకపోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన అభ్యర్థికి బీజేపీ టిక్కెట్ ఇవ్వడం, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన, పథకాలపై తీవ్ర స్థాయిలో వాద ప్రతివాదాలు చోటు చేసుకున్నాయి. టీఆర్‌ఎస్ ఈ ఎన్నికలను తెలంగాణ అనుకూల, వ్యతిరేక శక్తుల మధ్య పోరాటంగా అభివర్ణించింది. బీజేపీ, కాంగ్రెస్ పూర్తిగా వందరోజుల టీఆర్‌ఎస్ పాలనపై విమర్శలు గుప్పించాయి. ప్రచార హోరుకు తెరపడటంతో పోలింగ్ సరళిపై అంచనాలు మొదలయ్యాయి. ప్రధానంగా ఆయా పార్టీలు ప్రచార వ్యూహం ఓటింగ్ సరళిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే దానిపై చర్చ మొదలైంది.

గులాబీ జోష్..!
పక్కా ప్రణాళిక, పకడ్బందీ ప్రచార వ్యూహం, ఏకతాటిపై నిలిచిన ప్రజాప్రతినిధులు.. అంతకుమించి వంద రోజులుగా సర్కారు పనితీరు ప్రధానాస్ర్తాలుగా టీఆర్‌ఎస్ ప్రచారాన్ని పూర్తిగా తనచుట్టూ తిప్పుకొంది. కారు స్పీడును మిగిలిన పార్టీలు అందుకోలేకపోయాయి. టీఆర్‌ఎస్ మొదటి నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లింది. అందరికన్నా అభ్యర్థి ఎంపిక ముందుగా పూర్తిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వ్యూహాన్ని కూడా ఖరారు చేశారు. ఆయన దిశా నిర్దేశంతో మంత్రులు మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు వ్యూహాత్మకంగా ప్రచారాన్ని నిర్వహించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఉప ఎన్నిక ఇన్‌ఛార్జిగా కీలక భూమిక పోషించారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, టీ రాజయ్య, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, పీ మహేందర్‌రెడ్డి, పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రచారపర్వంలో తమ వంతు పాత్రను పోషించారు. ఈ దఫా ప్రచారంలో సభలు, సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా నేరుగా ఓటర్లలోకి వెళ్లేందుకు మొగ్గు చూపారు. తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ కోసం ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తుందనే అంశంతో పాటు ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఎలా ముందుకు వెళుతుందనే వివరాలను ప్రజలకు వివరించారు. మూడు నెలల కిందటే ప్రజాక్షేత్రంలో వచ్చిన అనూహ్య మద్దతును ఆస్వాదిస్తున్న ప్రజాప్రతినిధులు అదే జోష్‌తో ఈ ఉప సమరంలో సంఘటితంగా శ్రమించారు.

కలిసొచ్చిన ప్రత్యర్థుల ఎంపిక…
మెదక్ జిల్లా రాజకీయాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి క్రియాశీలకంగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డిని అధికార పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. క్లీన్‌చీట్‌తో ఆయన ప్రజల ముందుకు వెళ్లారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఎంపిక టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చినట్లయింది. గత పదేళ్లుగా మంత్రిగా పని చేసి అసెంబ్లీ నియోజకవర్గంలో పరాజయం పాలైన సునీతారెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీలోనే ముసలం పుట్టించింది. మరోవైపు టీడీపీ రంగంలో నిలవకుండా బీజేపీకి మద్దతివ్వడం, ఆ పార్టీ రాత్రికి రాత్రి కాషాయం కండువా కప్పుకున్న జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వడం టీఆర్‌ఎస్‌కు మరింత కలిసివచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పంచన చేరి తెలంగాణ వ్యతిరేక ప్రకటనలు చేసిన వ్యక్తికి టిక్కెట్టివ్వడంతో ఆ పార్టీ నాయకులు పలువురు కారు ఎక్కేశారు.

కేసీఆర్ బహిరంగ సభతో నూతనోత్తేజం…
ప్రచారంలో కారు దూసుకుపోతున్న తరుణంలో ఈనెల 10న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బహిరంగ సభ దిగ్విజయవంతంగా జరగడంతో ఫలితం దాదాపు తేలిపోయినట్టు అయింది. ఈ సభలో కేసీఆర్ తన ప్రసంగంలో ఇతర పార్టీలను విమర్శించడం కన్నా తెలంగాణ ప్రభుత్వ పనితీరు, ఐదేళ్ల అభివృద్ధికి రూపొందిస్తున్న ప్రణాళికను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి, ఉప ఎన్నికల పరిశీలకులు కుంతియాను రంగంలోకి దించింది. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, డీ శ్రీనివాస్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, భట్టి విక్రమార్క, ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, నందిఎల్లయ్య, మాజీ మంత్రి గీతారెడ్డి ప్రచారం చేశారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పటాన్‌చెరు, నర్సాపూర్‌లలో ప్రచారం నిర్వహించారు. ముఖ్య నేతలంతా జిల్లాలోనే మకాం వేసి ప్రచారం చేసినా కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. చాలా చోట్ల ఆ పార్టీ మీటింగ్‌ల్లో ఖాళీ కుర్చీలు కనిపించాయి. దీనితో నేతల ప్రచారమంతా ప్రెస్‌మీట్లు, విమర్శలకే పరిమితమైంది.

ఇక బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి జగ్గారెడ్డి తరపున ప్రచారం చేసేందుకు జాతీయ అధ్యక్షుడు అమీత్‌షాను రంగంలోకి దించాలని తొలుత భావించిన కాషాయదళం తర్వాత ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. టీడీపీ నేతలతో దూషణలే ప్రధానంగా సాగిన ప్రచారం పార్టీకి ప్లస్ కాలేక పోయాయి. పైగా పార్లమెంట్ పరిధిలో ఆ రెండు పార్టీలకు క్యాడర్ లేకపోవడంతో కార్యకర్తలు లేక సభలు వెలవెల బోయాయి.

ఫలితాలు మరీ ఏకపక్షంగా ఉంటాయనే భావన ఏర్పడడంతో చివరి నిమిషంలో ఇద్దరు కేంద్ర మంత్రులు సదానందగౌడ, జవదేకర్‌తో బహిరంగ సభ నిర్వహించారు. ప్రచారపర్వం ముగిసిన అనంతరం ఆయా పార్టీలు బలాబలాలు లెక్కలు వేసుకుంటున్నాయి. గులాబీ దళంలో విజయం ఖాయమనే నమ్మకం కనిపిస్తుండగా ప్రత్యర్థుల శిబిరాలను నైరాశ్యం వెంటాడుతున్నది. ప్రచారంలో ముందంజలో ఉన్న కారు పార్టీ… ప్రత్యర్థి పార్టీలను ఎంత దూరంలోకి నెట్టేస్తుందనే దానిపైనే రాజకీయవర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది.

పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ బాజ్‌పేయ్
పార్లమెంట్ ఉపఎన్నిక పోలింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 15,43,422 మంది ఓటర్లలో 7,79,346 మంది పురుషులు, 7,63,633 మందిమహిళా ఓటర్లు , 347 మంది సర్వీసు ఓటర్లులున్నారని చెప్పారు. 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, ఎన్నికలో నోటా ఓటు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

మొత్తం 1,817 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేశామని, గత ఎన్నికల్లో 77.35 శాతం ఓటింగ్ నమోదైందని, ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. 95శాతం ఓటింగ్ నమోదైన గ్రామాలకు ప్రభుత్వం రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుందని వెల్లడించారు. జిల్లాలో 21 ప్లయింగ్ స్కాడ్, 21 స్టాటిక్ సర్వేలెన్స్, మరో 21 ఇతర బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్లను, వెబ్ కాస్టింగ్ సిస్టంను ఏర్పాటు చేశామని,13న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించారని వివరించారు. ఇదిలా ఉండగా ఉప ఎన్నికల నిర్వహణకు పోలీస్ యంత్రాగం అన్ని భద్రత చర్యలు తీసుకుందని జిల్లా ఎస్పీ శేమూషీ బాజ్‌పేయ్ తెలిపారు. 177 మోబైల్ పెట్రోలింగ్ బృందాల ద్వారా ఎన్నికలు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.

160 అతి సమస్యాత్మకమైన, 339 సమస్యాత్మక, 542 సాధారణ పోలింగ్ స్టేషన్లను గుర్తించి బందోబస్తు చర్యలు తీసుకున్నామన్నారు. 4500 మంది ఇతర జిల్లాల పోలీస్ సిబ్బంది, 2500 మంది జిల్లా పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని , వీరితో పాటు సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎష్, టీఎస్‌ఎస్‌పీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 87 ప్రొహిబిషన్ కేసులు నమోదు చేశామని 743.815 లీటర్ల అక్రమ లిక్కర్, రూ. 75,24,280 నగదు, రూ.22,200 విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రచారం నిర్వహించిన ఇతర జిల్లాలకు చెందిన వారు తిరిగి వెళ్ళిపోవాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపినట్లు తెలిస్తే 9440627000 నెంబర్‌కు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
చింతమడకలో ఓటేయనున్న సీఎం
మెదక్ ఉప ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట నియోజకవర్గంలోని తన స్వగ్రా మమైన చింతమడకకు వెళ్లనున్నారు. ఉపఎన్నికలో గురువారం ప్రచారపర్వం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్, ఆయన సతీమణి చింతమండకకు వెళ్లి ఓటు వేయనున్నట్లు సీఎం కార్యాలయ సీపీఆర్‌ఓ ఒక ప్రకటనలో తెలిపారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *