mt_logo

యాకూబ్ రెడ్డిని లాఠీలతో కొట్టించినందుకా మీకు ఓట్లేసేది? – హరీష్ రావు

మెదక్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా సంగారెడ్డిలో బైక్ ర్యాలీని భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పదేళ్ళ కాలంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు ఏం చేశారని? తెలంగాణలో ఒక్క ఎకరాకైనా సాగునీరందించారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం రాజీనామా చేయాలని మంత్రి నివాసం ముందు విద్యార్థులు నిరసన తెలిపిన పాపానికి యాకూబ్ రెడ్డి అనే విద్యార్థిని పోలీసులతో లాఠీచార్జి చేయించినందుకా మీకు ఓట్లేసేది అని హరీష్ దుయ్యబట్టారు.

అడుగడుగునా తెలంగాణ ఉద్యమాలకు అడ్డుతగిలి పోలీసులతో ఉద్యమకారులను కొట్టించిన నీచ సంస్కృతి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులదని, ఆ పార్టీలకు ఓట్లడిగే నైతిక హక్కు లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడైన బండారు దత్తాత్రేయకు మంత్రిపదవి ఇవ్వని బీజేపీ నేతలు ఉప ఎన్నికలో జగ్గారెడ్డి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వస్తుందని ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

బుధవారం నర్సాపూర్ లో జరిగిన టీఆర్ఎస్ సభకు హాజరైన అశేష జనాన్ని చూస్తే సీఎం కేసీఆర్ పై జనానికి ఎంతగా అభిమానం ఉందో జాతీయ పార్టీలకు కూడా తెలిసిందని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సీమాంధ్ర పాలకులకు తాకట్టుపెట్టి పదవుల కోసమే పాకులాడిన అవకాశవాదులైన సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డిలకు ఓట్లు వేయొద్దని హరీష్ రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *