mt_logo

టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

ఇద్దరు ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఈరోజు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కేఆర్ ఆమోస్, జగదీశ్వర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, భానుప్రసాద్, రాజలింగం, మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్ధన్ రెడ్డి, పూల రవీందర్, టీడీపీ ఎమ్మెల్సీలు డి. సలీం తదితరులు పార్టీలో చేరారు.

బంగారు తెలంగాణ కోసమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం ఒక్క టీఆర్ఎస్ తోనే సాధ్యమని, అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుదామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్ మాట్లాడుతూ, తాను మొదటినుండీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని, కేసీఆర్ తోనే తెలంగాణ కల సాకారమైందని, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే శక్తి కేసీఆర్ కే ఉందని పేర్కొన్నారు.

టీడీపీ ఎమ్మెల్సీ డీ సలీం మాట్లాడుతూ, తెలంగాణలో ముస్లింలకు సముచిత స్థానాన్ని ఇచ్చి కేసీఆర్ గౌరవించారని, తెలంగాణలో ముస్లింలంతా టీఆర్ఎస్ తోనే ఉన్నారని, శాంతియుతంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన నేత కేసీఆర్ అని ప్రశంసించారు. దేశంలోనే తొలిసారి ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతి ముఖ్యమని, పార్టీలో చేరిన నాయకులు రాజకీయాల కోసమో, పదవుల కోసమో పార్టీలో చేరలేదని, రాష్ట్ర ప్రగతి కోసమేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఆంధ్రా నేతలు ఇంకా అహంకారంతోనే మాట్లాడుతున్నారని, కృష్ణా జలాలను తరలించేందుకు ప్రయత్నించారని, నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఇన్నాళ్ళూ పోరంబోకు ప్రాజెక్టుగా వాడుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు తన నిజస్వరూపాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తున్నాడని, రాష్ట్ర విభజన మానని గాయమంటూ ఏపీ అసెంబ్లీలో గవర్నర్ తో చెప్పించి తెలంగాణ ప్రజలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాదకోసం పదేళ్ళు కలిసుండేందుకు ఒప్పుకున్నామని, సీమాంధ్ర నేతలు ఇంకా జలదోపిడీ కొనసాగిస్తామని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని అన్నారు.

వచ్చిన తెలంగాణ బాగు పడాలంటే రాజకీయ నాయకత్వం ఏకం కావాలని, తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టే సీమాంధ్ర పార్టీలకు దూరంగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలు అడ్డుకుంటున్న తెలంగాణ టీడీపీ నేతలు ఇంకా ఎలా కొనసాగుతారో తేల్చుకోవాలని, టీఆర్ఎస్ గల్లంతవుతుందని ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళే కొట్టుకుపోయారని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *