mt_logo

మన మాట, మన పాట, మన యాస – రేలా రేలా రే

తెలంగాణ ఉద్యమం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఉద్యమ గీతాలు. ఒక్కటా, రెండా…గత దశాబ్ద కాలంలో వేలాది ఉద్యమగీతాలు తెలంగాణ కళాకారుల కలాలు, గళాల నుండి జాలువారి ప్రజల్లో మారుమోగుతున్నాయి. ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తున్నాయి.

ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా పాటల తూటాలు కురిపించిన సుద్దాల హనుమంతు, “బండెనుక బండి గట్టి, పదహారు బండ్లు గట్టి ఏ బండ్లె వస్తవ్ కొడుకో” అని ఫిరంగి అయి పేలిన బండి యాదగిరి మొదలు ఉద్యమ గీతాలకు పుట్టినిల్లు మన తెలంగాణ.

అ…ఆ…లు రాయడము రాకున్నా జయ జయహే తెలంగాణ అని ఎలుగెత్తి ఈ ప్రాంతపు గొప్పతనాన్ని చాటిన అందెశ్రీ

పాల బుగ్గల జీతగాన్ని యాది చేసే మా భూమి సంధ్యక్క

గుండెలోని బుల్లెట్ ఉన్నా గొంతులో పాటను ఆపని గద్దరన్న

ధూం ధాం కళారూపాన్ని అవిష్కరించి ఉద్యమానికి పదునైన అయుధాన్ని అందించిన రసమయి బాలకిషన్

“పల్లె కన్నీరు పెడుతుంది” అని యాది చేసిన గోరెటి వెంకన్న

“నాగేటి సాల్లల్ల నా తెలంగాణ” అంటున్న నందిని సిధారెడ్డి

“కోకిల నల్ల కోకిల” అంటూ కోకిల రాగం తీస్తున్న విమలక్క

“ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లను అని” చిన్న వయసులో మన ముందుకు వచ్చిన బాల సరస్వతి మధుప్రియ

“వీరులకు మొగసాలరా, తెలగాణ ధీరులకు కాణాచిరా” అని గొంతెత్తిన దేశపతి

రాతి బొమ్మలల్ల కొలువైన శివుణ్ని కూడా ప్రశ్నించిన మిట్టపల్లి సురేందర్ ….

ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో గల్లీ గల్లీకి ఒక గాయకుడు, ఊరూరికి ఒక పాటల రచయిత ఉన్నారు. తెలంగాణ పాటలు వేల మందిని కదిలిస్తాయి. లక్షల మందిని ఆలోచింపచేస్తాయి. ఉద్యమపాట, జానపదం, బతుకమ్మ పాట…పాట ఏదైనా ప్రతి పాట తెలంగాణ పల్లెలోని బతుకు చిత్రాన్ని మనకు అనుక్షణం గుర్తుచేస్తుంది.

సీమాంధ్రుల ఆధిపత్యంలోని రేడియోల్లో మాత్రం తెలంగాణ పాటకు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదనే చెప్పాలి. ఎఫ్.ఎం. రేడియోలు తెలంగాణ పాటను ఇంకా అంటరానిదానిగానే చూస్తున్నాయి. అశ్లీల, ద్వందార్ధాల  “తెలుగు” సినిమా పాటలనే అవి రాత్రనకా పగలనకా వినిపిస్తున్నాయి. ఇప్పుడు రేడియోల్లో వినిపించే సినిమా పాటలు గంట తరువాత అసలు గుర్తు ఉంటాయా?

మన మాట, మన పాట, మన యాస ఉండనపుడు మనం ఆ రేడియోలు ఎందుకు వినాలి? అనే ప్రశ్న ఉదయించింది రాజు అనే వరంగల్ యువకుడి మదిలో. దాని ఫలితమే రేలా రేలా రే అనే తెలంగాణ వెబ్ రేడియో ఆవిర్భావం.

తెలంగాణా గొంతుకలను ప్రపంచమంతా వినిపించాలి అనే ఆలోచన నుండి ఈ తెలంగాణ వెబ్ రేడియో పుట్టింది.

రేలా రేలా రే అంటే కేవలం మన పాట, మన పదమే కాదు, అణిచివేయబడుతున్న, ధ్వంసమవుతున్న తెలంగాణ సంస్కృతిని పునర్నిర్మించే ఒక చిరు ప్రయత్నం.

ఇప్పటినుండి మీరు MissionTelangana వెబ్ సైటులో కూడా రేలా రేలా రే వెబ్ రేడియోను వినవచ్చు. తెలంగాణ గుండె గొంతుకను వినడానికి కుడి వైపు ఉన్న లంకెను ఉపయోగించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *