ఓటుకు నోటు కేసులో ఏసీబీ మళ్ళీ దూకుడు పెంచింది. కేసులో కీలకమైన రేవంత్ రెడ్డి వీడియో, చంద్రబాబు ఆడియో రికార్డులతో పాటు నిందితులు వాడిన సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లపై పరీక్షలు చేసిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తుది నివేదికను గురువారం ఏసీబీ కోర్టుకు సమర్పించిందని సమాచారం. వీడియో, ఆడియోలు అన్నీ నిజమైనవేనని, ఎలాంటి కట్, పేస్ట్ లు, టాంపరింగ్ లు జరగలేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నివేదిక తమకు అందగానే అందులోని వాయిస్ చంద్రబాబుదేనని ధృవీకరించేందుకు వాయిస్ రీకాల్ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని, అందుకోసం బాబుకు నోటీసులు జారీ చేస్తామని ఏసీబీ అధికారి ఒకరు తెలిపారు.
రేవంత్, ఇతర నిందితుల ఫోన్లలో డిలీట్ చేసిన మెసేజ్ లను మెమొరీ నుండి ఎఫ్ఎస్ఎల్ సంపాదించిందని, ఇవి ఈ కేసులో కీలకంగా ఉపయోగపడతాయని ఏసీబీ అధికారి తెలిపారు. రేవంత్, స్టీఫెన్ సన్, సెబాస్టియన్ లు సాగించిన సంభాషణలను ఫొటోలతో సహా వివరాలను ఎఫ్ఎస్ఎల్ తన నివేదికలో పొందుపరచినట్లు సమాచారం. అంతేకాకుండా ఫోరెన్సిక్ లాబ్ సమర్పించిన నివేదిక కోసం గురువారం ఏసీబీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేసినట్లు తెలిసింది. దాదాపు 20 రోజులుగా ఈ నివేదిక కోసం తాము ఎదురుచూస్తున్నామని, నివేదిక అందగానే చంద్రబాబుకుస్వర పరీక్ష తప్పదని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే నేరుగా చంద్రబాబు, ఇతర నిందితులకు నోటీసులు జారీ చేసి ఆడియో రీకాల్ కు పిలవాలా? లేకపోతే కోర్టు ద్వారా అనుమతి తీసుకోవడమా? అన్నది న్యాయసలహాపై ఆధారపడి ఉంటుందని ఏసీబీ ఉన్నతాధికారి వెల్లడించారు.