mt_logo

రూ. 26 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలు..

రంజాన్ వేడుకల నిర్వహణపై మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ రంజాన్ పండుగను రూ. 26 కోట్లు ఖర్చుపెట్టి ప్రత్యేకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దావత్ ఏ ఇఫ్తార్ విందును గతంలోలా మొక్కుబడిగా కాకుండా ఘనంగా నిర్వహిస్తాం అని చెప్పారు. గత ప్రభుత్వాలు రంజాన్ పండుగను మొక్కుబడిగా జూబ్లీహాలులో, అక్కడక్కడా నిర్వహించేవి. గంగా జమున తెహజీబ్ లాంటి తెలంగాణలో ప్రభుత్వం తరపున రంజాన్ ను, ఇఫ్తార్ విందును ఒక గొప్ప పండుగలా జరపాలని, ఇఫ్తార్ ను జూబ్లీహాలులో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు.

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మసీదు వద్ద దావత్-ఏ-ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నట్లు, టీఆర్ఎస్ ఎన్నికల హామీలో చెప్పినట్లు ఈ రంజాన్ సందర్భంగా 5 వేలమంది ఇమాంలు, మౌజంలకు నెలకు రూ. 1000 చొప్పున గౌరవ భ్రుతి ఇస్తామని సీఎం చెప్పారు. నిజాం కళాశాల వేదికగా ఈనెల 8న నాలుగైదు వేల మందితో ఇఫ్తార్ విందును నిర్వహిస్తున్నామని, తనతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల కలెక్టర్లతో పార్టీలకు అతీతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో రంజాన్ వేడుకలకు వివిధ ముస్లిం దేశాల రాయబారులను కూడా ఆహ్వానించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

హైదరాబాద్ లోని వంద మసీదుల్లో దావత్-ఏ-ఇఫ్తార్ ఏర్పాటు చేస్తున్నాం.. రాష్ట్రంలోని 1.95 లక్షల నిరుపేద ముస్లింలకు రూ. 500 విలువైన దుస్తులు పంపిణీ, భోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేవుడు, అల్లా, జీసస్ లు అందరివారు.. రూ. 25 లక్షల ఖర్చుతో రాష్ట్రంలోని అన్ని అనాథ శరణాలయాల్లో భోజనాలు పెట్టిస్తామని, జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్ని ఏర్పాట్లు చేస్తారని సీఎం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *