mt_logo

కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేకతకు కారణం ఏమిటి?

By: శ్రీకాంత్ చారి

మొత్తానికి కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వదని తేలిపోయింది. ఇప్పటిదాకా రాష్ట్ర, కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెపుతున్నా, వచ్చే ఎన్నికలలోపు కాంగ్రెస్ ఏదో ఓక నిర్ణయం తీసుకుంటుందని ఏ మూలో ఒక చిన్న ఆశ. దానికి కారణాలు లేకపోలేదు. సీమాంధ్రలో రోజురోజుకి దిగజారుతున్న దాని పరిస్థితి. ఒక వేళ తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే కనీసం ఆ ప్రాంతంలో నిలదొక్కుకునే అవకాశం. కాని,

కాంగ్రెస్ తెలంగాణాను ఇలా వెన్నుపోట్లు పొడవడం ఇది మొదటిసారి కాదు. గొప్ప ప్రజా చైతన్యంతో నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం జరిగి, నిజాంను మట్టి కరిపించే తరుణంలో పోలీస్ యాక్షన్ ప్రకటించి, అదే నిజాంని ‘రాజ బహద్దూర్’ చేసి, భరణం ఇచ్చి సాగనంపినప్పుడే నెహ్రూ, పటేల్ తెలంగాణా వెన్నులో మొదటి గునపాన్ని దింపారు. అది మొదలుగా కాంగ్రెస్ పార్టీ మోసాల పరంపర కొనసాగుతూనే వుంది.

1956లో విశాలాంధ్ర ఏర్పాటు చేసినప్పుడూ అదే తంతు. ఆ తర్వాత మోసాలూ, ఒప్పందాల ఉల్లంఘనలూ, 1969లో తెలంగాణ ఉద్యమం అణచివేత, మొన్నటికి మొన్న 2009లో ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోవడం… ఇలా ఒకటేమిటి? తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహాలు చెప్పితే తరిగేవి కాదు. కాంగ్రెస్ చేసిన ఈ ఘనకార్యాలకు ఈ ప్రాంతంలో ఆ పార్టీ భూస్థాపితం కాకుండా తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక చివరి అవకాశం, అధికారంలో ఉండగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం.

కాని దానికి ఆ ఉద్దేశం ఏమాత్రం లేదని కొత్తగా ఇచ్చిన లేఖతో బయటపడింది. ఎంపీలు కోరారు కాబట్టి సమావేశం ఏర్పాటు చేస్తుందట. చర్చలను తిరిగి పునరుద్ధరిస్తుందట! తెలంగాణ ప్రజలను ఆ పార్టీ ఎంత చులకనగా చూస్తుందో ఈ రెండు వాక్యాలు చూస్తే చాలు, తెలిసిపోతుంది.

తెలంగాణ ఇవ్వడం వల్ల తెలంగాణలో బలపడుతానని తెలుసు, ఆంధ్రాలో చెప్పుకోదగ్గ తేడారాదనీ తెలుసు. బయటికేం చెపుతున్నా, తెలంగాణ ఇచ్చినా.., ఇవ్వకపోయినా దేశవ్యాప్తంగా జరిగే మార్పులేమీ ఉండవని కూడా తెలుసు. భారతదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా తెలంగాలో ఉద్యమాలు జరుగుతున్నాయని కూడా తెలుసు. మరి ఏ నష్టం లేనప్పుడు, పైగా ఎంతో కొంత లాభమే ఉన్నప్పుడు, ఆ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ఏందుకు సుముఖత చూపడం లేదు? ఇది ప్రతి తెలంగాణ పౌరుడి మదిలో మెదిలే ప్రశ్న.

అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్న వారికి అది సులభంగానే అర్థమౌతుంది. ఇందిరాగాంధీ మరణం వరకూ కాంగ్రెస్ అమెరికానూ, మార్కెట్ విధానాలనూ ఎదిరించేదిగా పేరు తెచ్చుకుంది. రాజీవ్ గాంధీ ప్రధాని అయిన తర్వాత అది తన దిశను మార్చుకొని, వరల్డ్ బ్యాంకు, అమెరికాల అడుగులకు మడుగులొత్తడం మొదలు పెట్టింది.

ఆ కారణంగానే దేశం మొత్తం వద్దని మొత్తుకున్నా, ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో వున్నా, అణు ఒప్పందాన్ని పార్లమెంటులో నెగ్గించుకుంది. దానికోసం కోట్లు కుమ్మరించి ఎంపీలను కొనడానికి కూడా వెనుకాడలేదు. అలాగే వాల్ మార్టు వ్యవహారం కూడా. అదే సమయంలో మహిళా బిల్లు, జనలోక్ పాల్ బిల్లుల కోసం దేశవ్యాప్తంగా ఎంత వత్తిడి వచ్చినా పట్టించుకోలేదు. ఇక తెలంగాణ సంగతి సరేసరి.

దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ అమెరికాకు, అంబానీలకు మాత్రమే జవాబుదారీ తప్ప, ఈ దేశ ప్రజలకు కాదని అర్థంకావడం లేదూ? మార్కెట్ శక్తులు ఆజ్ఞాపిస్తే కాంగ్రెస్ నిముషాల్లో తెలంగాణ ఇస్తుంది. కానీ అలా జరగడం లేదు… కారణం ఏమిటి?

తెలంగాణ రైతాంగ పోరాటం నుండి ఇప్పటివరకూ తెలంగాణ ప్రజలు మార్కెట్ భావజాలానికి వ్యతిరేకం. ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. మార్కెట్ శక్తులకు ఊడిగం చేసే స్వభావం అసలే కాదు. మరి ఇలాంటి ప్రజల చేతులో ప్రపంచ ప్రసిద్ధ మార్కెట్లలో ఒకటైన హైదరాబాదును ఎలా పెడతారు? చూస్తూ చూస్తూ అంత పెద్ద మార్కెట్ను శాసించే అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా?

కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తెలంగాణ రాదనీ స్పష్టమైంది. అదే విధంగా రేపు మరో కూటమి కేంద్రంలో అధికారం లోకి వచ్చినా, అది కూడా మార్కెట్ శక్తులకు ఊడిగం చేసే అవకాశం వుంది. అలాంటి పార్టీలు ఇప్పుడు ఏమి చెప్పినా, తర్వాత ఇచ్చిన వాగ్దానాలను మార్కెట్ శక్తుల ఆదేశాల మేరకు తుంగలో తొక్కవని అనుకోలేం.

ఉద్యమాలతో తెలంగాణ సాధించాలని కొందరి వాదన. ఉద్యమాలతో తెలంగాణ వచ్చే అవకాశమే వుంటే అది ఇప్పటికే వచ్చి వుండాలి. ఒక్క సాయుధ పోరాటం తప్ప తెలంగాణ ప్రజలు ఇప్పటికే అన్ని రకాల ఉద్యమ రీతులను ఇంతకూ ముందు కనీ, వినీ ఎరుగని రీతిలో చేసి వున్నారు. మరి కొన్ని ఉద్యమాలు చేసినా బలమైన శత్రువు ముందు అవి ఏమాత్రం పని చేయవని లోక్ పాల్, వగైరా ఉదంతాలు ఈ పాటికే తేటతెల్లం చేశాయి. ప్రజలు ఉద్యమాలు చేసిన కొద్దీ, ప్రభుత్వం మరిన్ని అధునాతన ఆయుధాలు దిగుమతి చేసుకొని మరింత నైపుణ్యంగా వాటిని అణచి వేస్తుందే తప్ప, ప్రజల కోరిక ఇదీ, దాన్ని నేరవేర్చుదామనే ఆలోచన చేయదు.

కాబట్టి రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలు ముందు రాజకీయంగా బలపడాలి. నిఖార్సైన తెలంగాణవాదులను అత్యధికంగా పార్లమెంటుకి, అసెంబ్లీకి గెలిపించడం ద్వారా, రాష్ట్రంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించగలిగినప్పుడే ఆ అనివార్యత సాధ్యం అవుతుంది. ఎదురునిలిచి పోరాడేవాడికి కట్టెనిచ్చి, పారిపోయే వాడికి కత్తినివ్వడం వలన ఉపయోగం లేదు. కాబట్టి పన్నెండేళ్ళుగా నిబద్ధతతో తెలంగాణ ఏర్పాటుకోసం ఉద్యమిస్తూ చిత్తశుద్ధిని చాటుకున్న కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితిని అత్యధిక సీట్లలో గెలిపించడం ఒకటే ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న మార్గం. అంతకు మించిన మార్గం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *