mt_logo

రసవత్తరం చంద్రబాబు లీలలు!

By: — వెల్లంపల్లి అవినాష్

 

“నా పాదయాత్ర రాజకీయం కోసమో, ఎన్నికల కోసమో కాదు, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం!”

“నాకే ఓటెయ్యండి, అభివృద్ధి అంటే నాదే!”

ఇవి రెండూ ఒకే సందర్భంల, ఒకే మనిషి మాట్లాడిన మాటలు. ఆ మనిషే నవరసనటనా ధురంధరుడు, అమెరికా విఖ్యాత నటసార్వభౌముడు – చంద్రబాబు నాయుడు!

చంద్రబాబుకి ఎందుకు ఓటెయ్యాలె? “కార్పొరేట్ వెలుగులు ఉండగా సంక్షేమపథకాలన్నీ దండగ” అంటూ, రెండు రూపాయల బియ్యం పథకాన్ని రద్దు చేసినందుకా? ఖజానా ఖాళీ అయిపోయిందని మద్యనిషేధం ఎత్తేసినందుకా? అధికారం కోసం కనిపించిన వాళ్లందరి కాళ్ళూ పట్టుకుంటూ కుప్పలుతెప్పలుగా వెర్రిమొర్రి వాగ్దానాలు కుమ్మరిస్తున్నందుకా? చంద్రబాబుకి ఎందుకు ఓటెయ్యాలె?

చంద్రబాబు చరిత్ర చూస్తే పచ్చిఅవకాశవాదమూ, అధికారదాహమూ, జిత్తులమారితనమూ తప్ప నీతీనిజాయితీ, విశ్వసనీయతా ఏ కోశానా కనిపించవు. చంద్రబాబూ, విశ్వసనీయతా వ్యతిరేక పదాలు! జగన్ ది ధనదాహం అన్నది ఎంత నిజమో చంద్రబాబుది అధికారదాహం అన్నది కూడా అంతే నిజం!

చంద్రబాబు 1983 ఎన్నికలల్ల కాంగ్రెస్ తరఫున “తెలుగువాడి ఆత్మగౌరవం” నినాదానికి వ్యతిరేకంగా పోటీచేసి తుక్కుతుక్కుగా ఓడిపోయిండు. తరవాత కాంగ్రెస్ ను వదిలేసి గెలుపుగుర్రమైన తెలుగుదేశంల చేరిపోయిండు. తెలుగుదేశంల చేరింది ఆత్మగౌరవం కోసమా, అధికారం కోసమా?? తెలుగువాడి ఆత్మగౌరవంపై మక్కువ ఉంటే, 1983లనే ఎందుకు చేరలేదు?

హరికృష్ణనూ, దగ్గుబాటి వెంకటేశ్వర్రావునూ చేరదీసి, ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిసి అధికారంలకు వచ్చిండు. అవసరం తీరినంక దగ్గుబాటినీ, హరికృష్ణనీ వదిలేసిండు. ఏరు దాటేసినంక తెప్పతో ఇంకా పనేంటి! ఇదీ మన “అభివృద్ధి” నాయకుని నీతీ నిజాయితీ!

చంద్రబాబుకి 1994-99 మధ్య కమ్యూనిస్టులు మిత్రపక్షాలుగా కనిపించిన్రు. 1999-2004 మధ్య టూరిస్టులుగా, కాలం చెల్లినవారిలా కనిపించిన్రు. 2005-06 నాటి భూపోరాటాలల్ల నికార్సైన ఉద్యమకారుల్లా కనిపించిన్రు. అధికారం ఉండగా టూరిస్టుల్లా కనిపించిన కమ్యూనిస్టులు, కుర్చీ చేజారగానే ప్రజాఉద్యమకారుల్లా కనిపిస్తరు. 2009ల మళ్ళీ మిత్రపక్షాలయ్యిన్రు. తెలుగుదేశానికి 90 సీట్లోచ్చినయ్, కమ్యూనిస్టులు మాత్రం ఐదు సీట్లకు పడిపోయిన్రు. టూరిస్టులతో పొత్తులు పెట్టుకుంటరు, కాలం చెల్లిన సిద్ధాంతాల వాళ్ళ చేత ఓట్లూ వేయించుకుంటరు! చంద్రబాబు నీతికీ, విశ్వసనీయతకీ అసలుసిసలైన ఉదాహరణ ఇది!

చెప్పుకుంటూ పోతే చంద్రబాబు అవకాశవాద విన్యాసాలు పెద్ద ఉద్గ్రంథమే రాయొచ్చు.

1999 నాటికి కమ్యూనిస్టులను వదిలేసి, బీజేపీని చేరదీసిండు. బీజేపీ సాయంతో 1999 ఎన్నికలు గట్టెక్కిండు. తరవాత మతతత్వ పార్టీ అంటూ బీజేపీనీ వదిలేసిండు. పాపం, బీజేపీ మతతత్వ పార్టీ అని అప్పటివరకూ తెలియని చిన్నపిల్లగాడు మన చంద్రబాబు! మతతత్వ పార్టీలకు కేంద్రంల మద్దతియ్యొచ్చు, మతతత్వ పార్టీల పొత్తులతో ఎన్నికలల్ల గెలవొచ్చు. గెలిసినంక మొండిచేయి చూపొచ్చు. విశ్వసనీయత అంటే ఇదే!

ప్రపంచబ్యాంకు విధానాలను తలకెత్తుకుని, సంక్షేమపథకాలను అటకెక్కించిండు. ఇప్పుడు మళ్ళీ సంక్షేమపథకాలు ప్రకటిస్తూ ఊరూవాడా ఊదరగొడుతున్నడు. ఊహకందని, అలవిగాని వాగ్దానాలు అలవోకగా చేసి పారేస్తున్నడు. 2014 ఎన్నికల ఏరు దాటి పొరపాటున అధికారంలకు వస్తే, ఈ పథకాల తెప్ప తగలెయ్యడని ఎట్ల నమ్మాలె??

అధికారం దూరమయ్యేసరికి గంగవెర్రులెత్తిన చంద్రబాబు 2009లో రకరకాల విన్యాసాలు చేసి, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నడు. తెరాసతో పొత్తు కోసం, “తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరమే”నని నిమిషాల మీద తీర్మానాలు జరిగిపోతయి. అధికారం కోసం మహాకూటమి పేరిట కేసీఆర్ తో వేదికలు పంచుకున్నప్పుడూ, చేతులెత్తి ఫోటోలకు ఫోజులిచ్చినప్పుడూ కేసీఆర్ కుటుంబ రాజకీయాలూ, కూడబెట్టిన సంపదా కంటికి కనిపించవు. అప్పుడు కేసీఆర్ వెనక ఉన్న ఓట్లు మాత్రమే కనిపిస్తాయి. ఇదీ చంద్రబాబు నీతీ, నిజాయితీ!

అప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకునిగా కనిపించిన కేసీఆర్ ఈరోజు సెంటిమెంటును వాడుకుంటున్న “దొరగారి”లా, ఉద్యమం మాటున డబ్బులు కూడబెట్టిన దొంగ లెక్క కనిపిస్తడు. తెలంగాణ సమస్యపై ఆరోజు సీమాంధ్ర నాయకులను కనుసైగతో ఒప్పించగలిగిన చంద్రబాబు ఈరోజు మాత్రం “రెండు ప్రాంతాల్లో ఉన్న పార్టీగా మాకు పరిమితులున్నాయి” అంటూ కబుర్లు చెప్తడు. సొంత పార్టీలో కూడా ఏకాభిప్రాయం తేలేనివాడికి పార్టీ నాయకత్వం ఎందుకు? అధికారమెందుకు? పరిమితులున్నవాడు రేపు అధికారంలోకి వస్తే, తెలంగాణ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తడు?

2009 డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై తీర్మానం ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ మద్ధతు ఇస్తుందని బొంకిన బాబు, డిసెంబర్ 10నాడు మాత్రం “మమ్మల్ని అడక్కుండా సోనియా తెలంగాణ ఎట్లా ఇచ్చేస్తారు??” అంటూ ప్లేటు ఫిరాయించిండు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సొంత పార్టీలో ఒక స్పష్టమైన విధాన నిర్ణయం చేయలేని ఈ నాయకుడు కూడా ఒక నాయకుడేనా? రాష్ట్రంలో అనిశ్చితికి ప్రధాన కారణం – తెలంగాణపై ఒక విధానం అంటూ లేని గోడ మీది పిల్లుల పార్టీ తెలుగుదేశం!. ఈ పిల్లుల నాయకుడ్ని గెలిపించి గద్దెనెక్కిస్తే రేపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏవిధంగా పరిష్కరిస్తడు?

ఎప్పుడో పక్కన పారేసిన హరికృష్ణనీ, బాలకృష్ణనీ మళ్లీ దగ్గరికి తెచ్చుకున్నడు. తాజా కరివేపాకు పాత్ర పోషించడానికి జూ. ఎన్టీఆర్ నీ తెచ్చుకున్నడు. కొద్ది రోజులు వాడుకుని, బాలకృష్ణని మాత్రం అట్టే పెట్టుకుని హరికృష్ణకీ, జూ. ఎన్టీఆర్ కీ తాత్కాలికంగా కరివేపాకు గతి పట్టించిండు.

పార్టీలో దేవేందర్ గౌడ్ రెండో స్థానానికి ఎదుగుతున్నడని భయపడి, నాగం జనార్ధన్ రెడ్డిని ఎగదోసి దేవేందర్ గౌడ్ ని వెళ్లగొట్టిండు. నాగం జనార్ధన్ రెడ్డిని వెళ్లగొట్టడానికి ఎర్రబెల్లిని వాడుకున్నడు. రేపు ఎర్రబెల్లిని వెళ్లగొట్టడానికి మోత్కుపల్లి నర్సింహులుని వాడుతున్నడు. ఎల్లుండి మోత్కుపల్లిని వెళ్లగొట్టడానికి ఇంకో తోకనెవరినో వాడుతడు.

రైతులేమన్నా దేవుళ్ళా, వాళ్ళకు ఉచిత విద్యుత్ ఎందుకివ్వాలని ఒకప్పుడు వాదించిన చంద్రబాబు ఇప్పుడు రైతులకు రుణమాఫీల గురించి మాట్లాడుతున్నడు. కంప్యూటర్లతో ఫోటోలు దిగిన చంద్రబాబు ఈరోజు రైతు వేషం వేసుకుని తిరుగుతున్నడు. ఎక్స్ గ్రేషియా కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరని కనిపెట్టిన చంద్రబాబు, ఈరోజు ప్రభుత్వ అసమర్థత వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నయ్యని బోధిస్తడు. హైటెక్ వెలుగుజిలుగుల ప్రపంచాన్ని ఊహిస్తూ హెలికాప్టర్ యాత్రలు చేసిన బాబు, ఈరోజు పాదయాత్రలు చేస్తూ పిల్లల ముక్కు చీదుతున్నడు, బుగ్గలు పులుముతున్నడు, బస్సులెక్కి జనంతో మాట్లాడుతున్నడు. అధికారం కోసం చంద్రబాబు ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నడు. సీఎం పదవిస్తమంటే, కాంగ్రెస్ తో కూడా లోపాయికారీ పొత్తు పెట్టుకోగలడు.

సినీదర్శకుల సాయంతో స్క్రీన్ ప్లే నడిపి, రచయితలు రాసిన డైలాగులు వల్లెవేస్తే విశ్వసనీయత వస్తదా?? ప్రజాసంక్షేమం మ్యానిపులేషన్ కాదు, అది చంద్రబాబుకి చేతకాదు.

శాసనసభ్యులు వరసగా పార్టీ వదిలేసి వెళ్లిపోతున్నరు. ఎఫ్డీఐలపై విధానపరంగా ఎంతో ముఖ్యమైన ఓటింగ్ జరుగుతున్నా ఎంపీలకు విప్ జారీ చెయ్యరు. పార్టీ నిర్ణయాన్ని ఉల్లంఘించి ఓటింగుకు గైర్హాజరు అయినవాళ్లపై చర్యలు తీసుకునే దిక్కు లేదు. ఎవరు పార్టీలో ఉంటారో, ఎవరు ఎప్పుడు వెళ్లిపోతరో తెలియదు. ఉన్నవాళ్లలో చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసం ఉన్నవాళ్ళు ఎందరో తెలియదు. తెలంగాణ నాయకులు ఒకటి మాట్లాడుతుంటరు, సీమాంధ్ర నాయకులు ఇంకేదో మాట్లాడతరు. ఒకే పార్టీ ఐనా ఎన్నెన్నో విధానాలు, నాలుకలు! బడుగుల పార్టీ అని ఒకవైపు ఊదరగొడుతూనే, మరోవైపు నామా నాగేశ్వర్రావు, సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటి వాళ్ళకు ఎంపీ టికెట్లిస్తరు. కాంగ్రెస్ మార్క్ అవలక్షణాలన్నీ నేడు తెలుగుదేశంలోనూ ఉన్నయి. మరి చంద్రబాబు ఏవిధంగా ప్రత్యామ్నాయం?

తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షపార్టీగా ఉండి కూడా 2009 తరవాత జరిగిన అన్ని ఉపఎన్నికల్లోనూ ఓడిపోయింది. కాంగ్రెస్ ను ఓడించగల సత్తా తనకు మాత్రమే ఉన్నదని తెలుగుదేశం 2009 తరవాత ఏ దశలోనూ నిరూపించుకోలేకపోయింది. తెలుగుదేశం విధానాలు కాంగ్రెస్ కి ఏ విధంగా భిన్నమైనవి? మరి చంద్రబాబుకి ఎందుకు ఓటెయ్యాలె?

తెలుగుదేశం అంత్యదశకు చేరుకుని, అంపశయ్యపై ఉన్నది. 2014 ఎన్నికలు దాన్ని సమాధి చేయబోతున్నాయి. కర్ణుని చావుకు సవాలక్ష కారణాలుండవచ్చు, తెలుగుదేశం చావుకు మాత్రం చంద్రబాబు పోకడలే కారణం!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *