mt_logo

రసాభాసగా మారిన టీడీపీ, బీజేపీల పొత్తు వ్యవహారం!..

టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుకుదరడంతో రెండుపార్టీల మధ్య నిరసనజ్వాల మొదలైంది. పొత్తు ప్రకటన వెలువడగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత మైనంపల్లి ప్రకటించారు. మల్కాజిగిరి టిక్కెట్ ఆశిస్తున్న ఆయన టీడీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట అసెంబ్లీ స్థానాన్ని తనకే కేటాయించాలని ఎస్ రాజేందర్ రెడ్డి తన అనుచరులతో చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగగా, టీడీపీ కార్యకర్త ఒకరు మల్కాజిగిరి టికెట్ బీజేపీకి ఇవ్వొద్దని ఆత్మహత్యాయత్నం చేశాడు. మరోవైపు పార్టీ ఓడినా ఫర్వాలేదుకానీ టీడీపీతో పొత్తువద్దని తెలంగాణ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. పొత్తును వ్యతిరేకిస్తూ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఆ లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గతంలో ఖమ్మం లోక్ సభ స్థానానికి బీజేపీ పార్టీ తరపున పోటీ చేసిన కపిలవాయి రవీందర్ కూడా రాజీనామా చేశారని తెలిసింది. వీరే కాక చాలామంది నేతలు సోమవారం రాజీనామాబాట పడతారని సమాచారం. నిన్న జరిగిన రెండు పార్టీల ప్రెస్ మీట్ లో చంద్రబాబుతో కల్సి పాల్గొనడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విముఖత చూపించారని, అందుకే కార్యక్రమానికి డుమ్మా కొట్టారని తెల్సింది. సీమాంధ్రలో కూడా ఇదేరకమైన నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని జిల్లాల్లో బీజేపీకి టిక్కెట్లు ఇవ్వవద్దని టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగుతుండటంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రెండు పార్టీలూ ఉన్నాయి. నర్సరావుపేట సీటును బీజేపీకి కేటాయించడాన్ని టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

గతంలో బీజేపీతో పొత్తుపెట్టుకుని చారిత్రకతప్పిదం చేశామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో ఎలా పొత్తుపెట్టుకుంటారని? వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హైదరాబాద్ వస్తే అడ్డుకుంటామని అన్న బాబు ఇప్పుడు అదే మోడీపంచన చేరుతున్నారని ఆయన విమర్శించారు.

టీడీపీ, బీజేపీ మధ్య పొత్తువల్ల తమకు వచ్చే నష్టం ఏమీ లేదని, ఆ రెండు పార్టీలూ చాలాకాలం నుండి మంచి మిత్రులని, ఎన్డీయే హయాంలో బీజేపీ చేసిన నేరాలు, ఘోరాలన్నింటిలోనూ టీడీపీకి కూడా ప్రమేయం ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ అన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ బీజేపీతో పొత్తుపెట్టుకున్న కారణంగా జాహెద్ ఆలీఖాన్ టీడీపీకి ఆదివారం రాజీనామా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *