mt_logo

జేఏసీ నాయకుల పోటీ వ్యక్తిగతం

-మా రాజకీయ వైఖరిని త్వరలో ప్రకటిస్తాం
-పునర్నిర్మాణం అంటే తెలంగాణను రక్షించుకోవడమే
-అనివార్యమైనందునే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది
-పీపుల్స్ ఎజెండా కోసం పోరాడుతాం
-టీ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాంతో ఇంటర్వ్యూ

‘పునర్నిర్మాణం అంటే లోతుగా ఆలోచించాల్సిన పనేమి లేదు. ఆంధ్రా వలసపాలకుల దోపిడీ, పెత్తందారీ వివక్షతల నుంచి తెలంగాణను ప్రజాస్వామికంగా రక్షించుకోవడమే పునర్నిర్మాణం. ప్రజాస్వామిక తెలంగాణ కోసమే ఆరు దశాబ్దాలుగా ప్రజలు రాజీ లేని పోరాటాలు చేస్తున్నారు. ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రం ద్వారా వచ్చే అభివృద్ధి ఫలాలు తెలంగాణ ప్రతీ సామాన్యుడికి అందడమే పునర్నిర్మాణం’ అని జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ పట్ల పచ్చి వ్యతిరేకతను ప్రదర్శించిన వైఎస్సార్‌సీపీ, టీడీపీలను అనేక సందర్భాల్లో ప్రజాక్షేత్రంలో జేఏసీ నిలబెట్టి ప్రశ్నించిందని, ఆ వైఖరిని జేఏసీ కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కూడా ఊరికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని, రెండుకోట్ల మంది ప్రత్యక్షంగా పుష్కర కాలంగా ఉద్యమించినందువల్లనే ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న కాంగ్రెస్, అనివార్యంగా ప్రజల ఒత్తిడికి లోనై రాష్ట్రాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. శుక్రవారం టీజేఏసీ చైర్మన్ టీమీడియా ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. త్వరలో జేఏసీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి స్పష్టమైన రాజకీయ వైఖరిని ప్రకటిస్తామని చెప్పారు.

ఆయనతో ఇంటర్వ్యూ ..

జేఏసీ ఎన్నికల సందర్భంలో సరైన పాత్ర పోషిస్తున్నదా? ప్రజలకు జేఏసీ పక్షాన మీరిచ్చే పిలుపేంటి?
కోదండరాం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కలిసివచ్చిన అన్ని పార్టీలు, ప్రజా సంఘాల ఐక్యసంఘటనే జేఏసీ. దీనిలో ప్రజాసంఘాల పాత్ర చాలా కీలకం. జేఏసీలోని ప్రజాసంఘాలకు చెందిన వ్యక్తులు వారి వారి ఇష్టాల ప్రకారం రాజకీయ పార్టీల నుంచి పోటీలోకి సిద్ధమవుతున్నారు. జేఏసీ దీనిని నిరోధించడంలేదు. ఇప్పటికే జేఏసీ పీపుల్స్ ఎజెండాను, వివిధ రాజకీయపార్టీలు తప్పకుండా మ్యానిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను విడుదల చేశాం. ఈ అంశాలు రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలో పొందుపర్చాలని విజ్ఞప్తి చేశాం. ఈ ఎజెండాను రేపటి తెలంగాణ ప్రభుత్వం విధిగా అమలు చేయాల్సిఉంటుంది. ఆ దిశలో ప్రజలను కదిలిస్తాం. వివిధ ప్రజాసంఘాల ఐక్యవేదిక అయినందున సాంకేతికంగా జేఏసీ పక్షాన ఎన్నికల బరిలో పోటీపడటం సాధ్యంకాదు.

జేఏసీ ఎజెండాలోని ప్రాథమిక అంశాలేమిటి?
జేఏసీ రేపటి ప్రభుత్వంపైన ఏ అంశాలపై డిమాండ్ చేస్తుంది?
కోదండరాం: సీమాంధ్ర పెత్తందారీ పాలకులు ఇప్పటికీ హైదరాబాద్ మీద పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. గుప్పెడు మంది ధనార్జనపరులు, కార్పొరేట్ యజమానులు హైదరాబాద్ చుట్టూ భూములు కొనుగోలు చేసి రియల్ దందాను పెంచి పోషించారు. భూముల ధరలను కొండెక్కించారు. కొండలను పిండి చేసి హైదరాబాద్‌ను ధ్వంసం చేశారు. ధ్వంసరచనే అభివృద్ధి నమూనా అని గొప్పలు చెప్పుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ధ్వంసం వికృత రూపాన్ని దాల్చింది. సెజ్‌ల పేరుతో కార్పొరేట్ యజమానులకు భూములను కట్టబెట్టారు. కార్పొరేట్ యజమానులు, అక్రమవ్యాపారులు వక్ఫ్, ప్రభుత్వ, దేవాదాయ భూములను యథేచ్చగా అక్రమించారు. ఈ దురాక్రమణలన్నింటిపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలని తెలంగాణ ప్రజల డిమాండ్. తెలంగాణ ప్రజల డిమాండ్‌ను జేఏసీ ఎజెండాగా స్పష్టంచేస్తున్నాం.

రాజకీయ పార్టీల కన్నా వీరోచితంగా కదంతొక్కిన జేఏసీ రేపటి ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాలను శాసించవచ్చు కదా..?
కోదండరాం: తెలంగాణ ప్రజలు ప్రధానంగా కూలిపోయిన చోట అభివృద్ధిని కోరుకుంటున్నారు. అభివృద్ధితెలంగాణ ప్రజల హక్కు. అభివృద్ధి ఫలాలన్ని సామాన్యులందరికీ చేరాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన, రెండు తెలంగాణ వికాసం, మూడు దోపిడీ వలసపెత్తందారీ గుప్పిట్లో నుంచి తెలంగాణను విమక్తిని చేయడం తెలంగాణ జేఏసీ ప్రధాన ఎజెండా. ఈ దిశలోనే జేఏసీ ప్రయాణం. జేఏసీ ప్రజాసంఘాల సభ్యులు వ్యక్తులుగా వివిధ రాజకీయపార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జేఏసీ కర్తవ్యాన్ని వీరు ఆయా పార్టీల్లో నిర్వర్తిస్తారు. ప్రత్యేకంగా జేఏసీ ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్దంగా లేదు.

జేఏసీ విస్తృతస్థాయిసమావేశం ఎప్పుడుంటుంది? ఖచ్చితమైన రాజకీయ వైఖరిని ఎప్పుడు ప్రకటిస్తుంది?
కోదండరాం: త్వరలోనే జేఏసీ విస్తృస్తాయి సమావేశం నిర్వహిస్తాం. ఖచ్చితమైన రాజకీయ వైఖరిని ప్రకటిస్తాం. అదే సందర్భంలో ఉద్యమంలో కీలక భూమిక పోషించిన బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీయూఎఫ్, టీపీఎఫ్ వంటి పార్టీల పట్ల జేఏసీ సానుకూల వైఖరితోనే ఉంటుంది.
ఉద్యమాన్ని వ్యతిరేకించి రాజకీయంగా గందరగోళం పరిచిన టీడీపీ, వైఎస్సార్సీపీ పట్ల వ్యతిరేకంగానే ఉంటాం. ఈ విషయాలన్నీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయిస్తాం.

తెలంగాణ వికాసం ఎలా ఉండాలి?
కోదండరాం: ఇప్పటివరకు జరిగిందంతా విధ్వంసమే. తెలంగాణలో జరిగినన్ని ఆత్మహత్యలు దేశంలో ఏ ప్రాంతంలో జరగలేదు. రైతులు, స్వర్ణకారులు, చేనేత కార్మికులు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు, ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ కావాలి. తెలంగాణలోని గ్రామీణ చెరువులన్నీ నీటితో కళకళలాడాలి. ప్రజలందరికీ పనులు లభించాలి. వలసలు లేని తెలంగాణ కావాలి. అదే అసలైన తెలంగాణ వికాసం. అదే తెలంగాణ పునర్నిర్మాణం. ఈ పునర్నిర్మాణం కోసం, వికాసం కోసం జేఏసీ నిరంతరం ప్రజలను కదిలిస్తూనే ఉంటుంది.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *