mt_logo

ఫాక్షన్ మంటల్లో రగులుతున్న రాజోలిబండ

ఫొటో: (పైన) ధ్వంసమైన ఆర్డీఎస్ తూములు, (కింద) సుంకేసుల బారేజి.

By: విశ్వరూప్

రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు మండలాలకు సాగు,త్రాగు నీరందించేందుకు ఉద్దేషించిన ఒక చిన్న ప్రాజెక్టు. ఆర్డీఎస్ ప్రాజెక్టుకు దిగువన కొంత దూరంలో ఉన్న సుంకేసుల బ్యారేజీ కేసీ కెనాల్ ద్వారా కర్నూలు, కడప జిల్లాలకు నీళ్లిస్తుంది. ఎగువన ఉన్న ఆర్డీఎస్ ప్రాజెక్టు గేట్లద్వారా నీల్లు క్రిందకి వచ్చి సుంకేశులలో చేరుతాయి. అయితే అడపాదడపా కర్నూలు నుండి ఫాక్షనిస్టు మూకల అధ్వర్యంలో అక్కడి రైతులు దౌర్జన్యంగా గేట్లు బద్దలు చెయ్యడంతో పాలమూరుకు రావల్సిన నీరు మొత్తంగా సుంకేశుల చేరుతుంది.

మొదట ఆర్డీఎస్ ప్రాజెక్టు కట్టినప్పుడు అప్పటి మూడు రాష్ట్రాలు కర్ణాటక, హైదారాబాద్, ఆంధ్ర రాష్ట్రాలమధ్య కుదిరిన ఒప్పందం ద్వారా ప్రాజెక్టులో 1.2 టీఎంసీ నీరు కర్ణాటకకు, మిగతా నీరు మహబూబ్ నగర్ (పాలమూరు), కర్నూలుకు సమానంగా లభించేలా రూపకల్పన జరిగింది. ప్రాజెక్టు పూర్తయేసరికి ఆంధ్ర, తెలంగాణలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డంతో పెత్తనం ఆంధ్ర నాయకులకు చేరడంతో పాలమూరు వాటా తగ్గిపోయింది. ప్రభుత్వ కోరిక మీదట బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్కు కేవలం 17.1 టీఎంసీలు కేటాయించి కేసీ కెనాల్‌కు మాత్రం 39.9 టీఎంసీలు కేటాయించింది. ఆ తరువాత కర్నూలు నాయకుల అధ్వర్యంలో ఆర్డీఎస్ గేట్లు పగలగొట్టడం ద్వారా కేసీ కెనాల్ తనకు కేటాయించినట్లు 39.9 టీఎంసీలు కాకుండా 50 నుంచి 60 టీఎంసీలు కొల్లగొడుతుంటే ఆర్డీఎస్‌కు మాత్రం 6 టీఎంసీలు కూడా అందడం లేదు.

గత పదిహేను సంవత్సరాలలో మూడు సార్లు కర్నూలు ఫాక్షన్ నేతలు ఆర్డీఎస్ తూములను దౌర్జన్యంగా బద్దలు కొట్టించారు. పదేళ్ళక్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి టీడీపీ ఎంపీ, ఫాక్షన్ నేత అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అధ్వర్యంలో దుండగులు రాత్రిపూట ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టారు. ఆతరువాత చాన్నాల్లు నీల్లు దిగివకు వెలుతూ పాలమూరు రైతులకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఇరుప్రాంతాల నాయకులమధ్య సయోధ్య కుదిరించి పగిలిపోయిన గేట్లకు ఇనుప షట్టర్లను బిగించాడు.

2010 ఆగస్టు పదమూడు నాడు అర్ధరాత్రి మరోసారి మూడో స్లూయిస్ గేటును దుండగులు ధ్వంసం చేశారు. ఈసారి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఈ పని చేయించినట్లు తెలిసింది. ఆఘటన జరిగిన తరువాత సీమ ఫాక్షనిస్టు నేతలు భూమా నాగిరెడ్డి, బాలనాగిరెడ్డి పబ్లిగ్గా గేట్లు బిగించినట్లయితే మల్లీ ధ్వంసం చేస్తామని ప్రకటించారు. అయినప్పటికీ ఈపక్షపాత ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం గమనార్హం. ఒకపక్క ప్రభుత్వ అధికారిక పక్షపాత ధోరణి ద్వారా కేటాయింపుల్లో అన్యాయం, మరోపక్క ఫాక్షన్ నేతల దౌర్జన్యంద్వారా కేటాయించిన నీల్లు కూడా అందకపోవడం జరుగుతూ దశాబ్దాలుగా పాలమూరు వాసులు ఆర్డీఎస్ ప్రాజెక్టు వాటాల్లో మోసపోతూనేఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *