మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా తమ ఊరి మొహం చూడని కోమటిరెడ్డి.. మళ్లీ ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని ఓట్లడుగుతావని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి మునుగోడు మండలం సోలిపురం చేరుకున్న రాజగోపాల్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ ఊరికి ప్రధాన సమస్యగా మారిన బ్రిడ్జిని సొంతఖర్చుతో నిర్మిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని.. ముందు దాని సంగతి చూడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ హామీని నెరవేర్చేవరకు గ్రామంలో ప్రచారం చేయొద్దని అడ్డుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత ఒక్కసారి కూడా మమ్మల్ని పట్టించుకోని మీరు.. ఎలా ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి మరో విపక్షంలో చేరారని, మరి ఇప్పుడు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేస్తే ఏం ప్రయోజనం ఉండదని, సొంత లాభంకోసమే పార్టీ మారారని పెద్దపెట్టున గ్రామ ప్రజలు నినాదాలు చేశారు. దీంతో చేసేదేంలేక కోమటిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా మొన్న చౌటుప్పల్ మడలంలోని అల్లపురంలో ప్రజలు రాజగోపాల్ రెడ్డికి ఎదురు తిరిగి, ప్రచారాన్ని అడ్డుకున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని గెలిపిస్తే, అదిపక్కనబెట్టి కాంట్రాక్టుల కోసం అమ్ముడు పోయావంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.